రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

వృందావన్‌లోని రామకృష్ణ సేవాశ్రమ్‌లో నంద కిశోర్ సోమనీ ఆంకాలజీ బ్లాకును ప్రారంభించిన రాష్ట్రపతి


ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం, కరుణ కలయికతో మానవ సంక్షేమానికి గొప్ప కార్యాలు చేయవచ్చని రామకృష్ణ మిషన్ నిరూపించింది: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

నాడు పోస్టు చేయడమైనది: 20 MAR 2026 2:52PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్‌లో ఉన్న రామకృష్ణ మిషన్ సేవాశ్రమ్‌లో నంద కిశోర్ సోమనీ ఆంకాలజీ బ్లాకును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు (2026 మార్చి, 20) ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆధ్యాత్మిక చైతన్యం, మానవతా సేవల సంగమానికి శక్తిమంతమైన చిహ్నంగా రామకృష్ణ మిషన్ నిలుస్తుందని అన్నారు. రామకృష్ణ పరమహంస అద్వితీయమైన భక్తి నుంచి ఓ గొప్ప శక్తి వెలువడింది. దానిని ఆయన శిష్యుల్లో అగ్రగణ్యులైన స్వామి వివేకానంద మానవ సంక్షేమం కోసం ఒక వ్యవస్థగా మలిచారు. భగవంతున్ని చేరుకొనేందుకు ప్రేమసేవ, కరుణలే అత్యుత్తమ మార్గాలనే సందేశాన్ని రామకృష్ణ మిషన్ ఎల్లప్పుడూ చెబుతుంది. నిస్వార్ధ సేవ, కరుణే ఆధ్యాత్మికతకు నిజమైన వ్యక్తీకరణలు అని ఈ సంస్థ నిరూపించింది.

అత్యంత తీవ్రమైన అనారోగ్యాల్లో క్యాన్సర్ ఒకటి అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించడం, నాణ్యమైన చికిత్సను అందించడమే రోగి ప్రాణాలను కాపాడటంలో నిర్ణయాత్మకంగా మారతాయి. అయితేఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక కుటుంబాలకు ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం కష్టంగా లేదా అసాధ్యంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో సేవా దృక్పథంతో పని చేసే సంస్థలు సమాజ సంక్షేమంలో చురుకైన పాత్రను పోషిస్తాయి. అవగాహన కార్యక్రమాలు, సకాలంలో స్క్రీనింగ్ పరీక్షలతో  క్యాన్సర్ నివారణ, ప్రారంభ దశలోనే చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆరోగ్యవంతులైన పౌరుల ద్వారానే బలమైన, స్వావలంబన సాధించిన భారత్ కల సాకారమవుతుంది.

ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ప్రతి పౌరునికీ నాణ్యమైన వైద్య  సేవలు అందించేందుకు భారత్ నిరంతరాయంగా కృషి చేస్తోందని రాష్ట్రపతి అన్నారు. ఆయుష్మాన్ భారత్ లాంటి చరిత్రాత్మక పథకాల ద్వారాలక్షలాది మంది పౌరులకు తక్కువ ధరలకే నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సను కూడా ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి తీసుకురావడం వల్ల పేద, నిరుపేద రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది.

సేవా దృక్పథంతో పనిచేసే వైద్య సంస్థలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి అన్నారు. అవి కేవలం వ్యాధులకు చికిత్స చేయడమే కాకుండారోగులు, వారి కుటుంబ సభ్యుల జీవితాల్లో ఆశనుఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని నింపుతాయని ఆమె పేర్కొన్నారు. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం, మానవతా దృక్పథం కలిస్తే మానవ సంక్షేమం కోసం అనేక గొప్ప కార్యాలు చేయవచ్చని రామకృష్ణ మిషన్ నిరూపించిందని ఆమె తెలిపారు. రామకృష్ణ మిషన్ సేవాశ్రమంతో కలసి పనిచేస్తున్న వారందరినీ ఆమె అభినందించారు. రాబోయే కాలంలో ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో వారి కృషి కీలకంగా మారుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి పూర్తి ప్రసంగ పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

***


(రిలీజ్ ఐడి: 2243228) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati