యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
భారతదేశాన్ని ప్రపంచ క్రీడా పరికరాల తయారీ కేంద్రంగా మార్చేందుకు నీతి ఆయోగ్ నివేదిక
"క్రీడా వస్తువుల వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తిస్తూ.. బాధ్యతలు నిర్ణయించే నిబంధనల పరిధిలో క్రీడా సామాగ్రిని చేర్చిన మంత్రిత్వ శాఖ" - శ్రీ హరి రంజన్ రావు, కార్యదర్శి (క్రీడా శాఖ)
2036 నాటికి క్రీడా సామాగ్రి ఎగుమతులను 8.1 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారత్
నాడు పోస్టు చేయడమైనది:
19 MAR 2026 8:21PM by PIB Hyderabad
"భారత క్రీడా పరికరాల తయారీ రంగ సామర్థ్యాన్ని సాకారం చేసుకోవటం" శీర్షికన ఇవాళ అధికారిక నివేదిక విడుదలైంది. క్రీడా ఉత్పత్తుల తయారీ, ఎగుమతుల్లో అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టాలన్న లక్ష్యాన్ని ఈ నివేదిక స్పష్టం చేసింది.
ఈ నివేదిక ప్రధానంగా క్రీడా పరికరాల తయారీ రంగంపైనే దృష్టి సారిస్తుంది. ఈ రంగంలో ఎగుమతులకు అపారమైన అవకాశాలున్నాయి.
క్రీడా పరికరాల తయారీ రంగం శ్రమతో కూడినదే కాక, ఆర్థికంగా లాభదాయకమని ఈ నివేదిక తెలియజేస్తుంది. ఇది ఉపాధి కల్పనకు, పారిశ్రామిక వృద్ధికి మెరుగైన అవకాశాలను అందిస్తుంది.
2036 నాటికి క్రీడా సామాగ్రి ఎగుమతులను 8.1 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేసేలా నిర్మాణాత్మక, పరిపాలనా సంస్కరణలు.. అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచేలా ఆర్థిక ప్రోత్సాహకాలతో సమగ్ర వ్యూహాన్ని నివేదిక సిఫార్సు చేసింది.
కొత్త క్రీడా సామాగ్రి తయారీ క్లస్టర్ల అభివృద్ధి, నవీకరించిన అంతర్జాతీయ స్థాయి పరీక్షలు, ధ్రువీకరణ మౌలిక సదుపాయాల ఏర్పాటు, ప్రపంచ క్రీడా విపణిలో "బ్రాండ్ ఇండియా" ను ప్రోత్సహించటం, ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని ఇది పిలుపునిచ్చింది.
కార్యదర్శి (క్రీడా శాఖ) శ్రీ హరి రంజన్ రావు మాట్లాడుతూ.. "క్రీడా వస్తువుల వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తిస్తూ క్రీడా సామాగ్రి బాధ్యతలు నిర్ణయించే నిబంధనల నియమావళి పరిధిలో మంత్రిత్వ శాఖ చేర్చింది" అని తెలిపారు.
భారత క్రీడా వ్యవస్థను బలోపేతం చేయటంలో ఖేలో భారత్ నీతి-2025, ప్రతిపాదిత జాతీయ క్రీడల పాలనా చట్టం కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు.
ఆర్థికాభివృద్ధికి, ప్రపంచ స్థాయి బ్రాండింగ్‌కు, యువత అభివృద్ధికి ఊతమిచ్చే శక్తి సాధనంగా క్రీడలను వినియోగించుకోవాలన్న గౌరవ ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేసేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తుందని కార్యదర్శి (క్రీడా శాఖ) తెలిపారు.
ప్రపంచ క్రీడా పరికరాల తయారీ విలువ వ్యవస్థలో భారత్ సామర్థ్యాన్ని వెలికితీయటానికి, దేశాన్ని పోటీతత్వంతో ఆవిష్కరణల దిశగా, ఎగుమతులే లక్ష్యంగా సాగే కేంద్రంగా తీర్చిదిద్దటానికి ఈ నివేదిక కీలక ముందడుగు.
జలంధర్, మీరట్‌లోని ప్రముఖ క్రీడా వస్తువుల తయారీ కేంద్రాల ప్రతినిధులతో పాటు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ అధికారులు ఈ నివేదిక విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.
నివేదికను ఈ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. https://niti.gov.in/sites/default/files/2026-03/Realising-the-Export-Potential-of-India-Sports-Equipment-Manufacturing-Sector.pdf
***
(రిలీజ్ ఐడి: 2242869)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8