సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గిరిజన, జానపద కళలకు ప్రోత్సాహం

నాడు పోస్టు చేయడమైనది: 19 MAR 2026 1:18PM by PIB Hyderabad

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ సంగీత నాటక అకాడమీ (ఎస్ఎన్ఏ). అగోచర సాంస్కృతిక వారసత్వ అంశాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ద్వారా.. వివిధ గిరిజన, జానపద కళారూపాలు సహా పలు అగోచర సాంస్కృతిక వారసత్వ అంశాలపై పరిశోధన తో పాటు వాటిని రికార్డు చేసి భద్రపరిచే కార్యక్రమాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. అలాగే, వీటిని యునెస్కో అగోచర సాంస్కృతిక వారసత్వ జాతీయ జాబితాలో నమోదు చేస్తుంది.

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అనేక సందర్భాల్లో గుసాడి నృత్యం, ఒగ్గు కథలను సంగీత నాటక అకాడమీ ప్రదర్శించింది. అంతేకాకుండా అంతరించిపోతున్న సాంప్రదాయక, జానపద, గిరిజన ప్రదర్శన కళారూపాలను పునరుజ్జీవింపజేయడంతోపాటు వాటిని నిలబెట్టడం, కళాకారులకు జీవనోపాధిని కల్పించడం లక్ష్యంగా.. ‘కళా దీక్ష’ అనే జాతీయ శిక్షణ కార్యక్రమాన్ని సంగీత నాటక అకాడమీ ప్రారంభించింది.

భారతీయ ప్రదర్శనా కళలను ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడం కోసం సంగీత నాటక అకాడమీ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. సామాజిక, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ కళారూపాలకు విస్తృత ప్రాచుర్యం కల్పిస్తోంది. ఇటీవల కోస్ట్రోమా రష్యన్ నేషనల్ బ్యాలెట్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ నృత్య భాషణ ప్రాజెక్టు కింద.. రష్యన్ - భారతీయ జానపద నృత్య సాంస్కృతిక ఆదానప్రధానాలపై వర్క్‌షాపును సంగీత నాటక అకాడమీ నిర్వహించింది. రష్యన్ నృత్య నాటికలు, భాంగ్రా, బిహు, కోలి, గుసాడి నృత్య రూపాలను ఇందులో ప్రదర్శించారు. దేశవిదేశాల్లోని ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

రాజ్యసభలో ఈ రోజు ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2242661) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR