గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గిరిజన భారత్‌ హృదయసీమలోకి స్వాగతం: న్యూఢిల్లీలో ‘భారత్ ట్రైబ్స్ ఫెస్ట్-2026’ ప్రారంభం


· గిరిజన కళలు.. ‘అడవి నుంచి ఆకు’లోకి సిసలైన సంప్రదాయక వంటకాలు.. ప్రయోగాత్మక సంస్థల నైపుణ్య సహిత భారీ ప్రదర్శనలో దేశంలోని 21 రాష్ట్రాల ఉజ్వల సంగమాన్ని ఆస్వాదించండి

· న్యూఢిల్లీలో భారత గిరిజన వారసత్వం.. వ్యాపార స్ఫూర్తి.. ప్రపంచ సాంస్కృతిక భాగస్వామ్యాలను ప్రదర్శించే ‘భారత్ ట్రైబ్స్ ఫెస్ట్-2026

· దేశం నలుమూలల నుంచి గిరిజన కళలు.. వంటకాలు.. వ్యవస్థాపనల సమ్మేళనంతో సుందర్ నర్సరీలో భారీ గిరిజన ప్రదర్శనకు శ్రీకారం

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 10:07PM by PIB Hyderabad

దేశంలోని గిరిజనుల సుసంపన్న సాంస్కృతిక వారసత్వం, హస్తకళలు, వ్యవస్థాపన స్ఫూర్తిని చాటే జాతీయ వేదికగా న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో ‘భారత్ ట్రైబ్స్ ఫెస్ట్-2026’ నేడు ప్రారంభమైంది. ‘ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ట్రైఫెడ్) సహకారంతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది.

కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి శ్రీ జువల్ ఓరం ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వియత్నాం రిపబ్లిక్‌ ‘జాతులు-తెగల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ డావో గోక్ డాంగ్, సహాయ మంత్రి శ్రీ వై.థాంగ్ పాల్గొన్నారు. అలాగే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి రంజనా చోప్రా, అదనపు కార్యదర్శి శ్రీ మనీష్ ఠాకూర్, సంయుక్త కార్యదర్శి శ్రీ అనంత్ ప్రకాష్ పాండే, ట్రైఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం.రాజమురుగన్, మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు, గిరిజన నాయకులు, చేతివృత్తులవారు, ఇతర భాగస్వాములు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జువల్ ఓరం మాట్లాడుతూ- “దేశంలోని గిరిజనుల సుసంపన్న సంప్రదాయాలు, సృజనాత్మకత, పునరుత్థాన సామర్థ్యాలను ‘భారత్ ట్రైబ్స్ ఫెస్ట్’ ప్రతిబింబిస్తుంది. గిరిజన కళాకారులు, వ్యాపారవేత్తలకు మార్కెట్ అనుసంధాన బలోపేతం సహా గిరిజన కళలు, చేతివృత్తులు, చేనేత, వంటకాలు, వ్యాపారం తదితర వైభవాన్ని చాటిచెప్పడంలో ఈ ఉత్సవం ఓ కీలక జాతీయ వేదికగా ఉపయోగపడుతుంది” అన్నారు.

వియత్నాం సోషలిస్ట్ రిపబ్లిక్ జాతులు-తెగల వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయ డావో గోక్‌ డాంగ్ మాట్లాడుతూ- భారత్‌, వియత్నాం మధ్య చిరకాల భాగస్వామ్యం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాగే “మా సాంస్కృతిక, ఆర్థిక, జాతుల పరమైన సంబంధాల్లో పాదుకున్న బలమైన, బహుముఖ బంధాన్ని భారత్‌తో పంచుకోవడం మాకెంతో ఆనందాన్నిస్తోంది. నేడు రెండు దేశాల మధ్య స్నేహసంబంధాల 10వ వార్షికోత్సవం మనం నిర్వహించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మన బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటూ శాశ్వత స్నేహం స్థాయికి చేర్చే దిశగా అవగాహన పెంచడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీమతి రంజనా చోప్రా ఈ కార్యక్రమ ప్రాధాన్యాన్ని వివరిస్తూ- “గిరిజన హస్తకళలు, అపార వ్యవస్థాపన సామర్థ్యాన్ని ఈ భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ ప్రస్ఫుటం చేస్తుంది. అలాగే, సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రోత్సాహం లభించేందుకు ఇది తోడ్పడుతుంది. గిరిజన కళాకారులు భవిష్యత్తులో తమ ఉత్పత్తులను సాధికారికంగా విక్రయించుకుంటూ మెరుగైన లాభాలు ఆర్జించడంతోపాటు అర్థవంతమైన గుర్తింపు  పొందగలుగుతారు. తద్వారా వారి జీవనోపాధి మెరుగుపడటమే కాకుండా మార్కెట్‌లో వారి మనుగడ మరింత బలోపేతం అవుతుందని మేం దృఢంగా విశ్వసిస్తున్నాం” అని ఆమె పేర్కొన్నారు.

దేశం నలుమూలలాగల గిరిజన తెగలను, సంస్థలను ఈ ఉత్సవం ఒకే వేదికపైకి తెచ్చింది. హస్తకళలు, చేనేత వస్త్రాలు, అటవీ ఉత్పత్తులు, సంప్రదాయ గిరిజన వంటకాల ఉత్సాహభరిత, విశేషానుభూతిని ఈ ప్రదర్శన మన సొంతం చేస్తుంది. ఇందులోని విశేషాలు:

·        గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించే 200కు పైగా ప్రత్యేక స్టాళ్లు

·        విలువ జోడించిన అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించే సుమారు 75 వన్‌ధన్‌ వికాస్ కేంద్రాలు

·        దేశం నలుమూలల నుంచి 300కు పైగా కళలు-చేతివృత్తుల వారి ఉత్పత్తులు

·        ప్రామాణిక ప్రాంతీయ వంటకాలతో 120 మంది గిరిజన పాకశాస్త్ర నిపుణుల భాగస్వామ్యం

·        నిపుణ కళాకారుల ద్వారా 17 రకాల చేతివృత్తుల ప్రత్యక్ష ప్రదర్శన

·        ప్రత్యేక పెవిలియన్‌లో ప్రసిద్ధ డిజైనర్లు, గిరిజన కళాకారుల నైపుణ్య ప్రదర్శన

·        సంప్రదాయ నృత్యసంగీత ప్రదర్శనలిచ్చే 400 మందికి పైగా గిరిజన కళాకారులు

ప్రసిద్ధ డిజైనర్లు, గిరిజన కళాకారులు సంయుక్తంగా రూపొందించిన, ప్రత్యేకంగా ఎంపిక చేసిన గిరిజన వస్త్రాలు-హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించే విశిష్ట పెవిలియన్‌ ప్రారంభంతోపాటు ‘రిసా’ బ్రాండ్‌ను  ఆవిష్కరించడం ఈ ఉత్సవంలో ఒక ప్రధాన ఆకర్షణగా పేర్కొనవచ్చు. కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్, శ్రీమతి రంజనా చోప్రా, శ్రీ ఎం.రాజమురుగన్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అనంత్ ప్రకాష్ పాండే, ప్రముఖ డిజైనర్ శ్రీ మనీష్ త్రిపాఠి తదితర ప్రముఖుల సమక్షంలో మంత్రి శ్రీ జువల్ ఓరం ‘రిసా’బ్రాండ్‌ను ఆవిష్కరించారు.

అస్సాంలోని ప్రసిద్ధ ‘ఏరి సిల్క్, మూగా సిల్క్’, ఒడిషా రాష్ట్ర  ‘కోట్‌పాడ్ కాటన్’, లద్దాఖ్‌ ప్రాంత ‘చాంగ్‌పా పష్మినా’, తమిళనాడు రాష్ట్ర ‘తోడా ఎంబ్రాయిడరీ’ వంటి దేశీయ వస్త్ర సంప్రదాయాలను  సమకాలీన డిజైన్లలో ‘రిసా’ వేదికపై ప్రదర్శిస్తున్నారు. గిరిజన కళాకారులు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ, విస్తృత మార్కెట్‌తో సంధానితులు కావడంలో ఈ వేదిక కొత్త అవకాశాలు కల్పిస్తుంది.

ఈ ఉత్సవంలో భాగంగా సహకారం, ఆవిష్కరణలు, మార్కెట్ విస్తరణ మార్గాల అన్వేషణ తదితరాల దిశగా విధాన రూపకర్తలు, పరిశ్రమ అగ్రగాములు, డిజైనర్లు, గిరిజన సంస్థల ప్రతినిధులతో పలు రోజుల పాటు నిర్వహించే ‘భారత్ ట్రైబ్స్ బిజినెస్ కాంక్లేవ్’ 19వ తేదీ నుంచి ప్రారంభమైంది.

దీంతోపాటు 24వ తేదీన ‘సీఎస్‌ఆర్‌’ సదస్సును నిర్వహించనున్నారు. సుస్థిర జీవనోపాధికి ప్రోత్సాహం సహా కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా కార్పొరేట్-గిరిజన సంస్థల మధ్య భాగస్వామ్యాల బలోపేతంపై ఇది దృష్టి సారిస్తుంది.

న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో ఈ నెల 18న ప్రారంభమైన ‘భారత్ ట్రైబ్స్ ఫెస్ట్-2026’ ఈ నెల 30వ తేదీవరకూ కొనసాగుతుంది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన గిరిజనుల కళలు, చేనేత, హస్తకళలు, వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనల సంపూర్ణ అనుభూతిని సందర్శకులు ఆస్వాదించవచ్చు. గిరిజనానికి మెరుగైన జీవనోపాధి అవకాశాల కల్పనతోపాటు తమ వారసత్వంపై వారిలో అవగాహనను మరింత పెంచి, ప్రోత్సహించడం ఈ ప్రదర్శన ప్రధాన లక్ష్యం.

 

***


(రిలీజ్ ఐడి: 2242318) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी