ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టడానికి తీసుకున్న చర్యలు
మూడు సంవత్సరాల్లో 5.18 లక్షలకు పైగా నమూనాల విశ్లేషణ..
88,192 జరిమానాల విధింపు.. 3,614 కేసుల్లో దోష నిర్ధారణ
రిస్క్ బేస్‌డ్ తనిఖీ వ్యవస్థను రూపొందించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ..
దీనిలో, ఆహార సంబంధిత వ్యాపారాలతో ముడి పడిన రిస్క్ ఆధారంగా
ఎంత తరచుగా పరిశీలనలు జరపాలో నిర్ణయించి, దిశానిర్దేశం చేశారు
ఆహార నమూనాల విశ్లేషణకు 252 ఆహార పరీక్షా ప్రయోగశాలలను, అప్పిలేట్ నమూనాల విశ్లేషణకు
24 రెఫరల్ ఫూడ్ ల్యాబరేటరీలను నోటిఫై చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
వివిధ ఆహార పదార్థాల్లో కల్తీని అక్కడికక్కడ పరీక్షించడానికి 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో
305 ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ రంగంలోకి
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 1:17PM by PIB Hyderabad
ఆహార పదార్థాలకు శాస్త్రీయ ప్రాతిపదిక కలిగిన ప్రమాణాలను నిర్దేశించాలని, మనుషులు భుజించదగిన సురక్షిత, సంపూర్ణ ఆరోగ్యవంతమైన ఆహారం అందుబాటులో ఉండేటట్లు చూడడానికి అనువుగా వాటి తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, దిగుమతులను నియంత్రించాలని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్‌స్ అథారిటీ ఇండియా..ఎఫ్ఎస్ఎస్ఏఐ)ని ఆదేశించారు. ఆహార భద్రత, ప్రమాణాల (ఎఫ్ఎస్ఎస్) చట్టం-2006ను పక్కాగా అమలుచేయడం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత.
శాస్త్రీయ ప్రాతిపదిక కలిగిన ప్రమాణాలను రూపొందించడంతో పాటు మొత్తం మీద సమన్వయపరిచే బాధ్యతలు ఎఫ్ఎస్ఎస్ఏఐవి కాగా, క్షేత్ర స్థాయిలో అమలుకు మౌలిక బాధ్యత రాష్ట్ర ఆహార భద్రత ప్రాధికార సంస్థలది. ఎఫ్ఎస్ఎస్ చట్టం-2006ను పక్కాగా అమలు చేసే బాధ్యతను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార భద్రత కమిషనరు అధీనంలో పనిచేసే డిజిగ్నేటెడ్ అధికారులకు (డీఓస్), ఆహార భద్రత అధికారులకు (ఎఫ్ఎస్ఓస్) అప్పగించారు.
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006తో పాటు దానిలో భాగంగా పేర్కొన్న నాణ్యత, సురక్ష ప్రమాణాలు, ఇతర అవసరాలను ఎంతవరకు నెరవేరుస్తున్నారో సరిచూడడానికి సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రత విభాగాలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాంతీయ కార్యాలయాల అధికారులు ఏడాది పొడవునా పాలు, నెయ్యి, మసాలాలు, తేనె, పన్నీరులతో పాటు ఇతర ఆహార పదార్థాలు సహా వేర్వేరు ఆహార ఉత్పాదనల నిఘా, పర్యవేక్షణ, నియంత్రణపూర్వక పరిశీలన, యాదృచ్ఛిక నమూనాలు సేకరిస్తారు. గత మూడు సంవత్సరాల్లో అంటే 2022-23 నుంచి 2024-25 మధ్య మొత్తం 5,18,559 నమూనాలను విశ్లేషించారు. ఈ కాలంలో 88,192 కేసులలో జరిమానా విధించారు. 3,614 కేసుల్లో దోషాన్ని నిర్ధరించారు. 1,161 లైసెన్సుల్ని రద్దు చేశారు.
నష్ట భయ ఆధారిత పరిశీలక వ్యవస్థ (రిస్క్ బేస్‌డ్ ఇన్స్‌పెక్షన్ సిస్టమ్.. ఆర్‌బీఐఎస్)ను కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ రూపొందించింది. దీనిలో ఆహార సంబంధిత వ్యాపారాలూ, జారీ చేసిన మార్గదర్శక సూత్రాలతో ముడిపెట్టిన రిస్క్ ఆధారంగా ఎంత తరచుగా పరిశీలనలు జరపాలో నిర్ణయిస్తారు. అధిక రిస్కు ఉన్నట్లు గుర్తించిన ఆహార కేటగిరీలన్నిటికీ వార్షిక పరిశీలనలను నిర్వహించాల్సివుంటుంది. గత మూడేళ్లలో (2022-23 నుంచి 2024-25 మధ్య) మొత్తం 56,259 ఆర్‌బీఎస్‌ను నిర్వహించారు.
దేశంలో ఆహార భద్రత సంబంధిత మౌలిక సదుపాయాలను పటిష్ఠపరచడానికి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆర్థిక సహాయంతో పాటు, సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అందే సహకారంలో ఈ కింద పేర్కొన్న చర్యలు కలిసివుంటాయి:
• లైసెన్సుల మంజూరు, రిజిస్ట్రేషన్ల వంటి నియమాల పాలనతో పాటు నియమావళి అమలును పటిష్ఠపరుస్తారు.
• పరిశీలనలు, లెక్కల తనిఖీలతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్, నిఘా సందర్భాల్లో నమూనాలను సేకరిస్తారు, ఆ నమూనాలను పరీక్షిస్తారు.
• వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరిస్తారు.
• అధికారులలో సామర్థ్యాన్ని పెంచేందుకు కొన్ని కార్యక్రమాలను చేపడుతారు.
• ప్రయోగశాలలకు ప్రాథమిక, ఉన్నత సామగ్రి వంటి ఆహార పరీక్షల అనుబంధ విస్తారిత వ్యవస్థని బలోపేతం చేస్తారు.
• ఈట్ రైట్ క్యాంపస్, ఈట్ రైట్ స్కూల్ వంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ కార్యక్రమాలను విరివిగా చేపడుతారు.
• ఎఫ్ఎస్ఓలు, డీఓలు నిర్వహించే పరీక్ష, నమూనాల సేకరణ కోసం వాహనాలను అద్దెకు తీసుకోవడం వంటి సహాయక చర్యలకూ తోడ్పడుతారు.
దేశంలో ఆహార నియంత్రణ అనుబంధ విస్తారిత వ్యవస్థను పటిష్ఠపరిచే దిశగా, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహార నమూనాల విశ్లేషణ కోసం 252 ఆహార పరీక్ష ప్రయోగశాలల్ని నోటిఫై చేసింది. అప్పిలేట్ శాంపుల్స్ విషయంలో విశ్లేషణ కోసం 24 రెఫరల్ ఫూడ్ లేబరేటరీలను నోటిఫై చేసింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంచార ఆహార పరీక్ష ప్రయోగశాల (మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబరేటరీ.. ఎమ్ఎఫ్‌టీఎల్)ను సమకూర్చుకోవడానికి నిధులను కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ అందించింది. ఈ వాహనాలని ‘‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’’ (ఎఫ్ఎస్‌డబ్ల్యూ) అని పిలుస్తారు. వేర్వేరు ఆహార వస్తువుల్లో కల్తీని అక్కడికక్కడ పరీక్షించడానికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ ఎఫ్ఎస్‌డబ్ల్యూలలో ఏర్పాటు చేశారు. దీంతో ఇవి కల్తీని ఎదుర్కోవడానికి ముఖ్య సాధనంగా మారాయి.
ఈ విషయాలను కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2241244)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19