పర్యటక మంత్రిత్వ శాఖ
గిరిజన హోమ్ స్టే యజమానులకు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీడీసీ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 11:39AM by PIB Hyderabad
న్యూఢిల్లోలోని హోటల్ సామ్రాట్, కౌటిల్య హాల్లో ట్రైబల్ హోమ్ స్టే యజమానులకు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పర్యాటక అభివృద్ధి సంస్థ (ఐటీడీసీ) ప్రారంభించింది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న ట్రైబల్ హోమ్ స్టే నిర్వాహకుల్లో వృత్తిపరమైన ఆతిథ్య నైపుణ్యాలను బలోపేతం చేస్తూనే స్థానిక సమూహ-ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా చేపట్టిన ముఖ్యమైన చర్యను ఈ కార్యక్రమం సూచిస్తుంది. నిర్మాణాత్మక శిక్షణ, సామర్థ్య నిర్మాణంతో సేవల ప్రామాణికతను పెంపొందించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం, గిరిజన తెగలకు సుస్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఐహెచ్ఎం అశోక్, గిరిజన మంత్రిత్వ శాఖకు చెందిన ఐటీడీసీ ఈ శిక్షణను అందిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 40 మంది ప్రతినిధులతో కూడిన మొదటి బ్యాచ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి రంజనా చోప్రా, అదనపు కార్యదర్శి మనీష్ ఠాకూర్, ఐటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ ముగ్ధా సిన్హా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ వర్ణాలి డేకా, ఐటీడీసీ కమర్షియల్, మార్కెటింగ్ డైరెక్టర్ రాజేష్ రాణా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘‘ట్రైబల్ హోమ్ స్టే - ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ మాన్యువల్ 2026’’ పేరుతో ఐహెచ్ఎం అశోక్ తీర్చిదిద్దిన పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన హోమ్ స్టేల అభివృద్ధికి తోడ్పడటానికి, వాటి నిర్వహణకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని ఈ కరదీపిక అందిస్తుంది. కొత్తగా హోమ్ స్టేలు ప్రారంభించాలనుకునే వారికి, ఇప్పటికే వాటిని నిర్వహిస్తున్న వారికి ఆచరణాత్మకమైన సూచనలు అందించేలా, బహుభాషా వనరుగా దీనిని తీర్చిదిద్దారు. స్థానిక వర్గాలకు మరింత చేరువయ్యేలా హిందీ మరియు గుజరాతీ భాషల్లోకి కూడా అనువదించారు.

ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల కార్యదర్శి రంజనా చోప్రా మాట్లాడారు. ‘‘భారతీయ పర్యాటకుడి ఆలోచనా విధానం మారుతోంది. రద్దీ తక్కువగా, ప్రకృతికి చేరువగా, కాలుష్య రహితంగా ఉండే ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. అదే సమయంలో ఆ వాతావరణ అనుభూతిని ఆస్వాదించేందుకు ఎక్కువ కాలం అక్కడే గడపాలని భావిస్తున్నారు. గణనీయమైన స్థాయిలో హోటల్ గదుల కొరత ఉన్న మన దేశంలో ఈ హోమ్ స్టే విధానం శక్తిమంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది’’ అన్నారు.
‘‘ఆధునిక పర్యాటకుల అంచనాలను అందుకోవడం మాత్రమే కాకుండా.. గిరిజన కుటుంబాలకు ముఖ్యంగా ప్రకృతి సౌందర్యంతో నిండిన పర్వత ప్రాంతాల్లో నివాసం ఉండేవారికి అర్థవంతమైన జీవనోపాధి అవకాశాలను ఇవి అందిస్తాయి. ఆతిథ్యానికి సంబంధించి ప్రాథమిక అంశాలపై హోమ్ స్టే నిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలను మార్చే సామర్థ్యం ఈ కార్యక్రమానికి ఉంది. అరవై ఏళ్ల ప్రయాణాన్ని ఐటీడీసీ పూర్తి చేసుకున్న తరుణంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమం మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ శిక్షణతో మనం ఈ రోజు నాటుతున్న విత్తనం భవిష్యత్తులో పర్యాటక ఆధారిత జీవనోపాధి అవకాశాలను ఇతర సమాజాలు సైతం స్వీకరించే బలమైన, స్థిరమైన విధానంగా వృద్ధి చెందుతుంది’’ అని ఆమె వివరించారు.
ఐటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ముగ్ధా సిన్హా మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఒక లక్ష హోమ్ స్టేలను ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి లక్ష్యమే ఈ హోమ్ స్టే ఉద్యమానికి స్ఫూర్తి. 1,500 మందికి శిక్షణ ఇవ్వాలనే మా ప్రయత్నం ఆరంభం మాత్రమే. తమ రాష్ట్రాల్లో ఇతరులకు శిక్షణ ఇచ్చే స్థాయికి వారిని చేర్చాలనేదే మా అసలైన లక్ష్యం. దీనివల్ల ఈ నమూనా వేగంగా విస్తరిస్తుంది. స్థానికంగానే శిక్షణ పొందే అవకాశం ఆయా వర్గాలకు లభిస్తుంది’’ అని వివరించారు.
‘‘సమన్వయంతో, అర్థవంతమైన సహకారాలతో పనిచేయాలనే మా నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ, ఇంక్రెడిబుల్ ఇండియా కార్యక్రమాన్ని ఏకం చేసి ఓ వ్యవస్థను మేం సిద్ధం చేస్తున్నాం. ఇది సుస్థిరమైన పర్యాటకానికి దోహదపడుతుంది. అలాగే దేశంలో వివిధ వర్గాలకు నూతన జీవనోపాధి అవకాశాలను అందిస్తుంది’’ అని తెలిపారు.
పర్యాటకం ద్వారా సమగ్రాభివృద్ధిని సాధించడం, జీవనోపాధిని కల్పించడంలో ప్రభుత్వం సారిస్తున్న దృష్టిని ఐటీడీసీ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య సహకారం ప్రతిబింబిస్తుంది. అత్యుత్తమ సేవలను అందించేలా గిరిజన హోమ్ స్టే నిర్వాహకులకు నైపుణ్యాలతో, విజ్ఞానంతో సిద్ధం చేసి స్థానిక సమూహ- ఆధారిత పర్యాటకాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యాల్లో ఒకటి. అలాగే గిరిజన సంప్రదాయాలను పరిరక్షిస్తూ.. అర్థవంతమైన ఉపాధి అవకాశాలను అందించి సుస్థిరాభివృద్ధికి దోహదపడుతుంది.

భారత పర్యాటక అభివృద్ధి సంస్థ గురించి:
దేశంలో పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి, విస్తరించడానికి 1966లో ఐటీడీసీని ఏర్పాటు చేశారు. అభివృద్ది, పురోగతి, అతిథులకు ప్రపంచ స్థాయి సేవలు, సౌకర్యాలను కల్పించేందుకు నిరంతరం ఈ కార్పొరేషన్ కృషి చేస్తోంది. హోటళ్ల నిర్వహణతో పాటు, టికెటింగ్, టూర్స్ అండ్ ట్రావెల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, డ్యూటీ ఫ్రీ షాపింగ్, పబ్లిసిటీ-ప్రింటింగ్ కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ, మౌంటింగ్ సౌండ్ అండ్ లైట్ షోలు, ఆతిథ్య విద్య, నైపుణ్యాభివృద్ధి - ఇలా అన్నింటినీ ఒకే చోట అందిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2241176)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11