నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే ప్రణాళిక
నాడు పోస్టు చేయడమైనది:
16 MAR 2026 3:26PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ స్కిల్ ఇండియా మిషన్ (ఎస్ఐఎం) కింద వివిధ పథకాల పరిధిలో నిర్వహిస్తున్న కేంద్రాల ద్వారా నైపుణ్య శిక్షణను నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ అందిస్తోంది. వీటి ద్వారా అన్ని వర్గాలకు చెందిన వారికీ తమ నైపుణ్యాలను మెరుగుపరచుకొనేందుకు అవసరమైన శిక్షణ లభిస్తుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై), జన శిక్షణ సంస్థాన్ (జేఎస్ఎస్), నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఏపీఎస్), పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)ల్లో చేపడుతున్న క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (సీటీఎస్) వంటి పథకాల పరిధిలో ఈ నైపుణ్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా భారతీయ యువతకు పారిశ్రామిక నైపుణ్యాలను అందించడమే ఈ ఎస్ఐఎం లక్ష్యం.
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ప్రణాళిక రూపకల్పనకు, దానిని అమలు చేసేందుకు ఎంఎస్‌డీఈ దిగువ పేర్కొన్న చర్యలను చేపట్టింది.
-
సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణ (టీవీఈటీ) రంగంలో నాణ్యతకు భరోసానిచ్చేలా నిబంధనలను, ప్రమాణాలను రూపొందించే నియంత్రణా సంస్థగా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీవీఈటీ)ను ఏర్పాటు చేశారు. పారిశ్రామిక సంస్థలను అవార్డింగ్ బాడీ (ఏబీ)లుగా లేదా అసెస్మెంట్ ఏజెన్సీ (ఏఏ)లుగా ఎన్‌సీవీఈటీ గుర్తిస్తుంది.
-
పరిశ్రమల్లో ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా అర్హతలను అవార్డింగ్ సంస్థలు రూపొందిస్తాయి. అలాగే జాతీయ వృత్తుల వర్గీకరణ-2015 ప్రకారం, గుర్తించిన వృత్తులతో వాటిని అనుసంధానించాల్సి ఉంటుంది. వాటికి పరిశ్రమ ధ్రువీకరణ అవసరం. పరిశ్రమ అవసరాల ప్రకారం 9026 కోర్సులను ఎన్‌సీవీఈటీ ఆమోదించింది. వాటిలో 2599 చెల్లుబాటు అయ్యేవిగా, క్రియాశీలకంగా ఉన్నాయి. మిగిలిన 6,427ను ఆర్కైవ్ చేశారు.
-
వాస్తవ పారిశ్రామిక వాతావరణంలో ఐటీఐ విద్యార్థులకు శిక్షణ అందించడానికి పరిశ్రమల సహకారంతో ఫ్లెక్సీ ఎంవోయూ పథకాన్ని, డ్యూయల్ ట్రైనింగ్ సిస్టమ్ (డీఎస్టీ)లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) అమలు చేస్తోంది.
-
రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలోని విద్యాసంస్థలకు పరిశ్రమలతో సంబంధాలను ఏర్పాటు చేయడానికి ఐబీఎం, సిస్కో, మైక్రోసాఫ్ట్, ఏడబ్ల్యూఎస్, ఆటోడెస్క్ తదితర ఐటీ సంస్థలతో అవగాహనా ఒప్పందాలను డీజీటీ కుదుర్చుకుంది. ఆధునిక పరిజ్ఞానాల్లో సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్య శిక్షణను అందించడంలో ఈ ఒప్పందాలు సహపడతాయి.
-
పీఎంకేవీవై పరిధిలో భవిష్యత్తు మార్కెట్టు, పరిశ్రమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏఐ/ఎంఎల్, రోబోటిక్స్, మెకట్రానిక్స్, డ్రోన్ టెక్నాలజీ, గ్రీన్ టెక్, అడ్వాన్స్డ్ మ్యానుఫాక్చరింగ్ తదితర రంగాల్లో ఇండస్ట్రీ 4.0 అవసరాలకు అనుగుణంగా ఆధునిక నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలను ప్రత్యేకంగా రూపొందించారు.
-
5జీ నెట్‌వర్క్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సైబర్ సెక్యూరిటీ అసిస్టెంట్, డ్రోన్ టెక్నీషియన్, సోలార్ టెక్నీషియన్ వంటి నూతన ఉద్యోగాలకు శిక్షణ అందించేందుకు సీటీఎస్ పరిధిలో అత్యాధునికమైన/భవిష్యత్తు అవసరాలకు తగిన నైపుణ్య కోర్సులను డీజీటీ ప్రవేశపెట్టింది.
-
ఆయా రంగాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాల నాయకత్వంలో 36 సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (ఎస్ఎస్‌సీ)లను ఏర్పాటు చేశారు. ఇవి సంబంధిత రంగాలకు అవసరమైన నైపుణ్య అవసరాలను గుర్తించి, నైపుణ్య సామర్థ్య ప్రమాణాలను నిర్దేశిస్తాయి.
-
కొత్తగా పుట్టుకొస్తున్న ఆర్థిక అవకాశాలకు అనుగుణంగా, పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సిద్ధం చేసే లక్ష్యంతో అహ్మదాబాద్, ముంబయిల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రెండు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్) సంస్థలను ఏర్పాటు చేశారు.
2023 నాటి జీ20 న్యూఢిల్లీ నాయకుల ప్రకటన ప్రకారం వివిధ దేశాల్లో నైపుణ్యాలను అర్హతలను పోల్చదగినవిగా, పరస్పరం గుర్తించేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అవసరమైన నైపుణ్యాలు, అర్హతలతో ఉద్యోగాలను అనుసంధానించేలా అంతర్జాతీయ ప్రామాణిక విధానాన్ని అభివృద్ధి చేయడంలో సాధ్యాసాధ్యాల అధ్యయనానికి అంతర్జాతీయ కార్మిక సంస్థతో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, శిక్షణ రంగాల్లో సహకారం కోసం భాగస్వామ్య దేశాలతో ఎంఎస్‌డీఈ ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఖతార్, సింగపూర్, యూఏఈ మొత్తం 8 దేశాలతో క్రియాశీలక ఒప్పందాలను ఎంఎస్‌డీఈ కలిగి ఉంది. దేశీయ, అంతర్జాతీయ కార్మిక మార్కెట్లలో భారతీయ శ్రామిక శక్తికి ఉద్యోగావకాశాలను విస్తరించే లక్ష్యంతో సాంకేతిక మార్పిడి, సహకారాత్మక శిక్షణ కార్యక్రమాలు, ఉత్తమ పద్ధతులను పంచుకొనే వీలును ఈ ఒప్పందాలు అందిస్తాయి. అలాగే నైపుణ్యాలు, అర్హతలకు గుర్తింపు సాధించే దిశగా ప్రయత్నిస్తాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంతకం చేసిన వలస, తరలింపు భాగస్వామ్య ఒప్పందాల్లో ఎంఎస్‌డీఈ ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా నైపుణ్యాలున్న వారు విదేశాలకు సులభంగా వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఎస్‌డీఈ సమయానుగుణంగా కలసి పనిచేస్తుంది.
విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు తగినట్టుగా భారతీయ యువతను సిద్ధం చేసేందుకు బెంగళూరు, భువనేశ్వర్, గువాహటి, హైదరాబాద్, కాన్పూర్, లూథియానా, వారణాసిల్లో 7 స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాలు (ఎస్ఐఐసీ)ను ఎంఎస్‌డీఈ ఏర్పాటు చేసింది. నైపుణ్య కార్మికులు సురక్షితంగా, పూర్తి అవగాహనతో విదేశాలకు వెళ్లేలా తోడ్పాటును అందించేందుకు.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డొమైన్ స్కిల్ శిక్షణ, భాషా శిక్షణ అందించడం, విదేశాలకు వెళ్లే ముందు అవగాహనను కల్పించడమే ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యం.
దీనికి అదనంగా, ఈ కేంద్రాల్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన (పీకేవీవై) పరిధిలో ప్రీ-డిపార్చర్ ఓరియెంటేషన్ శిక్షణ (పీడీవోటీ) అందిస్తారు. తాము వెళ్లాలనుకొనే దేశాలకు సంబంధించిన భాష, సాంస్కృతిక అంశాలు, కార్మిక చట్టాలు, సురక్షిత వలస పద్ధతులపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తారు..
ఈ సమాచారాన్ని నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ జయంత్ చౌధరి ఈ సమాచారాన్ని లోక్‌సభలో లిఖితపూర్వకంగా అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2240961)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13