|
శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశంలోని 23 విద్యాసంస్థలలో క్వాంటం బోధన సౌకర్యాలు.. ప్రయోగశాలల ఏర్పాటుకు ఆమోదం
· పురోగమిస్తున్న క్వాంటం సాంకేతికతలలో ఆధునిక పరిశోధన-శిక్షణ దిశగా మరో 100 సంస్థలకు మద్దతుపై పరిశీలన · శాస్త్ర విజ్ఞాన మంత్రిత్వశాఖ నెలవారీ సమావేశానికి అధ్యక్షత వహించి.. శాస్త్ర-పరిశోధన-ఆవిష్కరణ-సాంకేతిక ప్రగతి సంబంధిత కీలక కార్యక్రమాలను సమీక్షించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ · భారత ఆవిష్కరణల వ్యవస్థ బలోపేతానికి శాస్త్ర విజ్ఞాన మంత్రిత్వ శాఖల మధ్య విస్తృత సమన్వయం ఆవశ్యతను స్పష్టం చేసిన మంత్రి · ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ నిర్వహణ సన్నాహాలతోపాటు పరిశోధన-పరిశ్రమ-అంకుర సంస్థల మధ్య సహకార విస్తృతి దిశగా ‘రైజ్’ సదస్సుపైనా సమీక్ష
నాడు పోస్టు చేయడమైనది:
16 MAR 2026 6:20PM by PIB Hyderabad
దేశంలోని వివిధ రాష్ట్రాల పరిధిలోగల 23 విద్యాసంస్థలలో నేషనల్ క్వాంటం మిషన్ కింద క్వాంటం బోధన సౌకర్యాలు, ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ సరికొత్త సాంకేతికతలలో మరో 100 సంస్థల ద్వారా అత్యాధునిక పరిశోధన-శిక్షణకు మద్దతిచ్చే అంశం కూడా పరిశీలనలో ఉంది.
కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞానశాస్త్ర శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది-ప్రజా సమస్యలు-పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ అంశాన్ని వెల్లడించారు. అంతకుముందు కేంద్ర శాస్త్ర విజ్ఞాన మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శుల సంయుక్త నెలవారీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దేశంలో కొనసాగుతున్న కీలక శాస్త్ర విజ్ఞాన కార్యక్రమాలు, త్వరలో చేపట్టబోయే జాతీయ కార్యక్రమాలు సహా వివిధ శాస్త్రవిజ్ఞాన మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం బలోపేతం దిశగా కృషిని సమీక్షించారు.
కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రవిజ్ఞాన సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, శాస్త్ర-సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్, బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్.గోఖలే, శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్.కలైసెల్వి, భూవిజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్, ఆయా మంత్రిత్వశాఖలు-విభాగాల పరిధిలోని సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2026’ (ఐఐఎస్‌ఎఫ్) నిర్వహణ సంబంధిత సన్నాహాలను ఈ సమావేశంలో సమీక్షించారు. పుణె నగరంలో ఈ కార్యక్రమం నిర్వహించే ప్రతిపాదన నేపథ్యంలో వివిధ ఇతివృత్తాలు, కార్యక్రమ స్వరూపం, సదుపాయాల ప్రణాళిక సహా మొత్తం చట్రంపై బయోటెక్నాలజీ విభాగం ఈ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్సవ ముసాయిదాను సిద్ధం చేయడంతోపాటు కార్యక్రమం-షెడ్యూల్ ఖరారు కోసం త్వరలో భాగస్వామ్య సంస్థలతో చర్చలు సాగనున్నాయి.
చెన్నైలో ‘సీఎస్‌ఐఆర్’ ఇటీవల నిర్వహించిన 5వ ‘రైజ్’ (పరిశోధన, పరిశ్రమ, అంకుర సంస్థలు, వ్యవస్థాపన) సదస్సుపైనా సమావేశం సమీక్షించింది. ఈ రెండు రోజుల కార్యక్రమంలో ఆవిష్కరణ, సాంకేతిక వాణిజ్యీకరణల బలోపేతం దిశగా పరిశోధకులు, అంకుర సంస్థలు, పారిశ్రామిక ప్రముఖులు, విద్యాసంస్థలు ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్యానెల్ చర్చలు, పరస్పర పారిశ్రామిక కార్యకలాపాలు సహా డీఎస్‌టీ, డీబీటీ, ఎంఓఈఎస్, బిరాక్, ఇస్రో, విశ్వవిద్యాలయాలతో ముడిపడిన ‘సీఎస్‌ఐఆర్’ ప్రయోగశాలలు-సంస్థల సాంకేతికతలను ప్రదర్శించే 140కి పైగా స్టాళ్లతో ‘స్టార్టప్ ఎక్స్‌పో’ను కూడా నిర్వహించారు.
ఈ ఏడాది మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవ నిర్వహణ ప్రణాళికలపైనా సమావేశంలో చర్చించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మే 11 నుంచి 13 వరకు భారీ సాంకేతిక ప్రదర్శన నిర్వహణకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇక్కడ శాస్త్ర విజ్ఞాన మంత్రిత్వ శాఖల మద్దతుగల జాతీయ పరిశోధన సంస్థలు, అంకుర సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. ఈ కార్యక్రమం 3000కు పైగా భాగస్వామ్య సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చి, వివిధ రంగాల సంబంధిత 500కుపైగా సాంకేతికతలు-ఆవిష్కరణలను ప్రదర్శిస్తుందని అంచనా. అలాగే పరిశ్రమల మధ్య సంబంధాలు, సాంకేతిక వాణిజ్యీకరణకు ఇదొక వేదిక కానుంది.
సహకారాత్మక పరిశోధన కార్యక్రమాలను ప్రోత్సహించే శాస్త్రవిజ్ఞాన విభాగాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయ బలోపేతంపైనా సమావేశం చర్చించింది. జాతీయ పరిశోధన ప్రాథమ్యాల కోసం ఆయా రంగాల నైపుణ్యాన్ని వాడుకునే విధంగా బహుళ విభాగాల సంబంధిత సంస్థల సంయుక్త ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కృషి సాగుతోంది.
ప్రధాన శాస్త్రవిజ్ఞాన కార్యక్రమాల పురోగతిపై తాజా సమాచారాన్ని అధికారులు పరస్పరం పంచుకున్నారు. ఇందులో భాగంగా నేషనల్ క్వాంటం మిషన్ కింద పలు రాష్ట్రాల్లోని 23 సంస్థలలో క్వాంటం బోధన ప్రయోగశాలల ఏర్పాటు ఆమోదముద్ర పడింది. పురోగమిస్తున్న క్వాంటం సాంకేతికతలలో ఆధునిక పరిశోధన-శిక్షణ దిశగా మరో 100 సంస్థలకు మద్దతు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
ఈ సమావేశంలో భాగంగా అంతరిక్ష రంగం నుంచి అందిన తాజా సమాచారంపైనా సమీక్షించారు. ముఖ్యంగా... ఈ ఏడాది ఆఖరున తదుపరి ‘పీఎస్‌ఎల్‌వీ’ ప్రయోగ సన్నాహాలు, రాబోయే ఉపగ్రహ ప్రయోగాలు సహా అనేక అంశాలపై చర్చించారు. అంతరిక్ష ఆధారిత నావిగేషన్, వ్యూహాత్మక సామర్థ్యాల బలోపేతానికి భారత్ చేస్తున్న కృషిలో భాగంగా మే నెలలో నావికాదళం కోసం తదుపరి నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగ ప్రణాళికలపైనా చర్చించారు.
శాస్త్రవిజ్ఞాన పరిశోధన కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రాజెక్టు సిబ్బందికి మానవశక్తి మార్గదర్శకాల సవరణపైనా సమావేశంలో చర్చించారు. శాస్త్ర-సాంకేతిక విభాగం 2020లో జారీచేసిన మార్గదర్శకాలకు ప్రస్తుత నవీకరణలపై పరిశీలన చేపట్టింది. ఇవి ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్‌ఆర్‌ఎఫ్) చట్రం కింద ప్రకటించిన నిబంధనలకు అనుగుణంగా ఉంటూ ఆయా విభాగాలలో మరింత ఏకరూపతకు భరోసా ఇస్తాయి.
జాతీయ ప్రయోగశాలలు సాధించే విజయాలు-ఆవిష్కరణలకు విస్తృత ప్రాచుర్యం సహా పరిశ్రమలు, విద్యాసంస్థలు, సమాజంతో మరింత అనుసంధానం దిశగా సమాచార-సౌలభ్య బలోపేతంపై చర్చతో సమావేశం సమాప్తమైంది.
***
(రిలీజ్ ఐడి: 2240960)
|