మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా దత్తత స్వీకార పద్ధతులను బలోపేతం చేయడానికి, రికార్డులను భద్రపరచడానికి, బాలల గుర్తింపును పరిరక్షించడానికి జాతీయ స్థాయిలో ఆదేశాలను జారీ చేసిన కారా
నాడు పోస్టు చేయడమైనది:
16 MAR 2026 10:17AM by PIB Hyderabad
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని చట్టబద్ధ సంస్థ అయిన కేంద్రీయ దత్తత ప్రాధికార సంస్థ (కారా) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మూడు ముఖ్యమైన అధికారిక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర దత్తత ప్రాధికార సంస్థ (స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ - సారా)లకు పంపిన ఈ ఆదేశాలు దత్తత స్వీకార పద్ధతులను బలోపేతం చేస్తాయి. దత్తత తీసుకున్న చిన్నారుల రికార్డులను, బాలల గుర్తింపును పరిరక్షించేలా వీటిని రూపొందించారు. జువైనల్ న్యాయ (బాలల పోషణ, పరిరక్షణ) చట్టం - 2015, దత్తత నియమాలు - 2022లోని నిబంధనల ప్రకారం వీటిని జారీ చేశారు.
అనాథలు, వదలివేసిన, అప్పగించిన బాలలకు కుటుంబాన్ని పొందే హక్కును కల్పించడమే జువైనల్ న్యాయం చట్టంలోని సెక్షన్ 56(1) లక్ష్యం. చిన్నారులను చట్టబద్ధంగా దత్తతకు ఇవ్వడానికంటే ముందు న్యాయపరమైన విధానాలను, కాలపరిమితులను తప్పనిసరిగా పాటించాలని కారా జారీ చేసిన మొదటి మెమోరాండం తెలియజేస్తోంది.
నిర్ణీత కాలపరిమితి లోపు తగిన విచారణ, వారి కన్న తల్లిదండ్రుల జాడను తెలుసుకోవడం, పునరుద్ధరణ ప్రయత్నాలు, ఇతర న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేయకుండా ఏ అనాథనైనా లేదా వదిలేసిన బిడ్డనైనా చట్టబద్ధంగా దత్తత ఇచ్చేందుకు వీలు లేదని కారా స్పష్టం చేసింది. అలాగే చిన్నారిని దత్తతకు అందుబాటులో ఉంచే ముందు చట్ట ప్రకారం నిర్దేశించిన రెండు నెలల తప్పనిసరి పునఃపరిశీలన వ్యవధిని ఖచ్చితంగా పాటించాలి.
బాలలు, దత్తత వెళ్లిన చిన్నారుల రికార్డులను భద్రపరచడం, నిర్వహణ, బదిలీకి సంబంధించిన స్పష్టతను కారా జారీ చేసిన రెండో మెమోరాండం తెలియజేస్తుంది. దత్తతకు వెళ్లినవారు భవిష్యత్తులో తమ మూలాలను తెలసుకోవాలనుకొన్నప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా దత్తత నిబంధనలు-2022 లోని నిబంధన 47(2) ప్రకారం వారికి అవసరమైన పత్రాలను సులభంగా అందించేందుకే దీనిని జారీ చేశారు.
కొన్ని సందర్భాల్లో సంబంధిత ప్రత్యేక దత్తత ఏజెన్సీ (ఎస్ఏఏ), శిశు సంరక్షణ కేంద్రం (సీసీఐ) మూత పడటం, రిజిస్ట్రేషన్ రద్దవడం, విలీనం కావడం లేదా కార్యకలాపాలను మరో సంస్థకు బదిలీ చేయడం వల్ల రికార్డులు అందుబాటులో ఉండటం లేదని గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, సంబంధిత సంస్థ కార్యకలాపాల స్థితితో సంబంధం లేకుండా రికార్డులను భద్రపరిచే, పరిరక్షించే బాధ్యత కొనసాగుతుందని కారా స్పష్టం చేసింది.
మొత్తం భౌతిక, డిజిటల్ రికార్డులను సురక్షితంగా భద్రపరచి, నిర్దేశిత అధికారి లేదా సంస్థలకు బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కారా కోరింది. అలాగే దత్తతకు వెళ్లిన వారు భవిష్యత్తులో తమ మూలాలను సులభంగా తెలుసుకొనేలా వాటిని పరిరక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. చట్టం నిర్దేశించిన విధానంలో మినహా, ఎట్టి పరిస్థితుల్లోనూ రికార్డులను ధ్వంసం చేయరాదని, పారవేయకూడదని లేదా అందుబాటులో లేకుండా చేయకూడదని కారా తేల్చి చెప్పింది. చిన్నారులకు సంబందించిన నివేదికలు, రికార్డుల గోప్యతను తప్పనిసరి చేసే చట్టంలోని సెక్షన్ 99కి అనుగుణంగా వీటిని రూపొందించారు.
జువైనల్ చట్టంలోని సెక్షన్ 74ను కఠినంగా అమలయ్యేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కారా జారీ చేసిన మూడో మెమోరాండం తెలియజేస్తుంది. చట్టవ్యతిరేకమైన పనుల్లో చిక్కుకున్న చిన్నారులు లేదా పోషణ, రక్షణ అవసరమైన చిన్నారుల వివరాలను బహిర్గతం చేయడాన్ని ఈ సెక్షన్ నిషేధించింది.
ప్రత్యేక దత్తత ఏజెన్సీ (ఎస్ఏఏ)లు శిశు సంరక్షణ సంస్థ (సీసీఐ)ల్లో ఆశ్రయం పొందిన చిన్నారుల ఫొటోలు, వీడియోలు, లేదా వారి గుర్తింపును తెలియజేసే వివరాలను సోషల్ మీడియాతో సహా ఇతర మార్గాల ద్వారా బహిర్గతం చేయకుండా సంబంధిత సంస్థలు, అధికారులకు అసవరమైన సూచనలు జారీ చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కారా ఆదేశాలు జారీ చేసింది.
ఏవైనా ఉల్లంఘనలు జరిగిన పక్షంలో తగిన చర్యలు తీసుకోవాలని, చట్టంలోని సెక్షన్ 74(3) ప్రకారం గోప్యతా ప్రమాణాలు, చట్టపరంగా విధించే శిక్షల గురించి అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించింది.
ఈ చర్యల ద్వారా దేశవ్యాప్తంగా చిన్నారులు, దత్తతకు వెళ్లిన పిల్లల హక్కులను, గౌరవాన్ని, గోప్యతను కాపాడుతూ, దత్తత వ్యవస్థలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని, బాలల భద్రతను బలోపేతం చేయడమే కారా లక్ష్యం. భారతదేశంలో దత్తత స్వీకార నియమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు గాను ఈ మార్గదర్శకాలకు లోబడి ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కారా అభ్యర్థించింది.
మెమోరాండంలకు సంబంధించిన పూర్తి వివరాలను దిగువన చూడొచ్చు:-
***
(రిలీజ్ ఐడి: 2240684)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11