బొగ్గు మంత్రిత్వ శాఖ
డబ్ల్యూసీఎల్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
నాడు పోస్టు చేయడమైనది:
14 MAR 2026 11:09AM by PIB Hyderabad
రెండు రోజుల పర్యటన నిమిత్తం వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్)ను సందర్శించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పలు కీలక ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. శుక్రవారం రోజున డబ్ల్యూసీఎల్ పనితీరుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 25 ఎలక్ట్రిక్ వాహనాలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. వీటితో పాటు నాగ్‌పూర్‌లోని కామ్తీలో 'బ్లాక్ డైమండ్ స్పోర్ట్స్ స్టేడియం', వాణిలోని తడలిలో 'స్వామి వివేకానంద ఎకో పార్క్', బల్లార్పూర్‌లోని సాస్తి ఓపెన్ కాస్ట్ గని వద్ద ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌కు శ్రీ కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధిని, పర్యావరణ పరిరక్షణను, గనుల తవ్వకాల్లో ఆధునిక పద్ధతుల అమలును ఈ ప్రాజెక్టులు ప్రోత్సహిస్తాయి.
బొగ్గు ఉత్పత్తి, భద్రత, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించి డబ్ల్యూసీఎల్ పనులను ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో డబ్ల్యూసీఎల్ పని సంస్కృతిని, విధానాలను ప్రశంసించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. బొగ్గు పరిశ్రమలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా డబ్ల్యూసీఎల్ పాత్ర గురించి వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డబ్ల్యూసీఎల్ సాధించిన విజయాల గురించి ఆ సంస్థ సీఎండీ శ్రీ హరీశ్ దుహన్ సమావేశంలో వివరణాత్మక సమాచారాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ మనోజ్ కుమార్ ఝా, కోల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ శ్రీ బి. సాయిరాం.. బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ ఇండియా లిమిటెడ్, డబ్ల్యూసీఎల్ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొనసాగుతున్న గని మూసివేత ప్రక్రియను పరిశీలించేందుకు మార్చి 14, 2026న ముర్పార్ భూగర్భ గనిని కేంద్రమంత్రి సందర్శించనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, గనుల మూసివేత సలహా కమిటీ (ఎంసీఏసీ)తో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో డబ్ల్యూసీఎల్ మైన్ క్లోజర్ నోడల్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓలు), సలహాదారులు, స్థానిక గ్రామ ప్రతినిధులు పాల్గొంటారు.
***
(రిలీజ్ ఐడి: 2240220)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5