బొగ్గు మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలోని భద్రావతిలో రెండు సమగ్ర బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్లకు భూమి పూజ చేయనున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 8:30PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి 2026, మార్చి 13, 14 తేదీల్లో నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్) సందర్శనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా, రెండు సమగ్ర బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్లకు శ్రీ కిషన్ రెడ్డి భూమి పూజ చేస్తారు. ముర్పార్ గని మూసివేత (మైన్ క్లోజర్) స్థలాన్ని మంత్రి పరిశీలిస్తారు. సంబంధిత భాగస్వాములతో మైన్ క్లోజర్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు.
2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫికేషన్ చేయడం లక్ష్యంగా బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ ఏర్పాటయింది. తద్వారా ఈ కీలకమైన వనరు విలువను, ప్రయోజనాన్ని గరిష్ట స్థాయికి చేర్చడం, అలాగే స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలను అనుసరించడం, బొగ్గు సుస్థిర వినియోగాన్ని నిర్ధారించడం దీని ఉద్దేశ్యం.
దేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించడానికి 2024 జనవరిలో రూ. 8,500 కోట్ల ఆర్థిక ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించారు. ఈ చొరవ ద్వారా యూరియా, సహజ వాయువు, ఇథనాల్, కోకింగ్ కోల్ వంటి వాటి దిగుమతుల స్థానంలో స్వదేశీ ఉత్పత్తులను భర్తీ చేయడానికి వీలు కలుగుతుంది. ఇది బొగ్గు వనరుల వినియోగాన్ని కూడా వేగవంతం చేస్తుంది.
బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం నిర్దేశించిన దార్శనికత ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి చంద్రపూర్‌లోని భద్రావతి పారిశ్రామిక ప్రాంతంలో రెండు ప్రైవేట్ సంస్థలైన గ్రేటా ఎనర్జీ అండ్ మెటల్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ ఎరా క్లీన్‌టెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహించి, శంకుస్థాపన చేయనున్నారు. భారత ప్రభుత్వ పథకం కింద ఆర్థిక ప్రోత్సాహకాలు పొందేందుకు ఎంపికైన ఏడు ప్రాజెక్టులలో ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
గ్రేటా ఎనర్జీ అండ్ మెటల్ ప్రైవేట్ సంస్థ డైరెక్ట్ రిడ్యూస్డ్ ఐరన్ (డీఆర్ఐ) ఉత్పత్తి కోసం బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. న్యూ ఎరా క్లీన్‌టెక్ సొల్యూషన్ ప్రైవేట్ సంస్థ అమ్మోనియం నైట్రేట్, హైడ్రోజన్ ఉత్పత్తి కోసం బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును నిర్మిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2240063)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21