అంతరిక్ష విభాగం
పార్లమెంటులో ప్రశ్న: విద్యార్థి పరిశోధకుల భాగస్వామ్యం
నాడు పోస్టు చేయడమైనది:
12 MAR 2026 3:37PM by PIB Hyderabad
వాస్తవిక అంతరిక్ష సాంకేతిక ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యేలా విద్యార్థి పరిశోధకులకు అవకాశాన్నిస్తూ, పలు నిర్మాణాత్మక కార్యక్రమాలను ఇస్రో నిర్వహిస్తోంది:
- విద్యార్థి ఉపగ్రహ ప్రాజెక్టులు: యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రం ఆధ్వర్యంలో ఇస్రో చేపట్టిన కార్యక్రమమిది. విద్యా సంస్థలు, విద్యార్థి బృందాలు ఉపగ్రహాలను, పేలోడ్‌లను రూపొందించి, అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. దీని కోసం ఇస్రో సాంకేతిక మార్గదర్శకత్వాన్నీ, ఏకీకరణలో సహకారాన్నీ, ప్రయోగ అవకాశాలను కూడా అందిస్తుంది.
- ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు ట్రెయినీ పథకాలు: గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ విద్యార్థులకు ఈ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వారికి ఇస్రో కేంద్రాల్లో ప్రత్యక్ష పరిశోధనానుభవాన్ని అందిస్తాయి.
- అంతరిక్ష సాంకేతిక ఇంక్యుబేషన్ కేంద్రం (ఎస్టీఐసీ): స్వదేశీ అంతరిక్ష సాంకేతికతల అభివృద్ధి, అంతరిక్ష పరిశోధనలను ప్రోత్సహించడానికి 6 ఎస్టీఐసీలను ఇస్రో ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ కేంద్రాల పరిధుల్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రొఫెసర్లు, ఇస్రో శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో విద్యార్థులు ఈ ఎస్టీఐసీ ప్రాజెక్టులను నిర్వహిస్తారు.
వీటితోపాటు క్యాన్ సైజ్ ఉపగ్రహాలు (7యూ ఉపగ్రహాలు), మోడల్ రాకెట్ల రూపకల్పన, అభివృద్ధి, తయారీపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో.. భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, ప్రాధికార కేంద్రం (ఇన్-స్పేస్) రెండు పోటీలను నిర్వహించింది. మొత్తం 97 విద్యార్థి బృందాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. వీటిలో దాదాపు 850 మంది విద్యార్థులున్నారు.
ఇప్పటివరకు మొత్తం 17 విద్యార్థి ఉపగ్రహాలు/పేలోడ్‌లకు ఇన్-స్పేస్ అనుమతులివ్వగా.. అందులో 11 విజయవంతంగా ప్రయోగించారు. వాటి వివరాలిలా ఉన్నాయి:
అంతరిక్ష పరిశోధన ఐఐటీలు, ప్రముఖ విద్యాసంస్థలకు మాత్రమే పరిమితం కాకుండా, దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా కింద పేర్కొన్న కీలక కార్యక్రమాలను ఇస్రో చేపట్టింది:
- ప్రాయోజిత పరిశోధన కార్యక్రమం: ‘రెస్పాండ్’ ప్రాజెక్టుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు వివిధ అంతరిక్ష పరిశోధన కార్యకలాపాల్లో పాల్గొని సహకారాన్ని అందించవచ్చు. అంతరిక్ష విజ్ఞానం, అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష అనువర్తనాలకు సంబంధించి పరిశోధన - అభివృద్ధి చర్యలు చేపట్టేలా.. అవసరమైన ఆర్థిక, సాంకేతిక చేయూతను విద్యా సంస్థలకు అందించేందుకు ఈ ‘రెస్పాండ్’ కార్యక్రమాన్ని ఇస్రో రూపొందించింది.
- ప్రాంతీయ అంతరిక్ష విద్యా కేంద్రాలు(ఆర్ఏసీ-ఎస్): దీనిని ప్రాంతీయ స్థాయి కార్యక్రమంగా పేర్కొనవచ్చు. భారత అంతరిక్ష కార్యక్రమ భవిష్యత్తు సాంకేతిక అవసరాలకు, ఇతర కార్యక్రమాలకు అనుగుణంగా.. ఆయా రంగాల్లో అధునాతన పరిశోధనలను కొనసాగించడం దీని ముఖ్యోద్దేశం. అలాగే, ఆయా ప్రాంతాల్లో అంతరిక్ష సాంకేతిక కార్యకలాపాల విస్తరణకు సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. చిన్న పట్టణాలు, కళాశాలలకు చెందిన విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానం, అంతరిక్ష సాంకేతికత, వాటి అనువర్తనాలపై అవగాహన కల్పించే విషయమై.. ఆర్ఏసీ - ఎస్ కేంద్రాలు ఇస్రో కార్యక్రమాలకు అనుసంధాన వేదికలుగా సేవలందిస్తున్నాయి.
- అంతరిక్ష సాంకేతిక ఇంక్యుబేషన్ కేంద్రం (ఎస్టీఐసీ): దేశీయంగా అంతరిక్ష సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి, అంతరిక్ష పరిశోధనలను నిర్వహించడానికి.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆరు ఎస్టీఐసీ కేంద్రాలను ఇస్రో నెలకొల్పింది.
అంతరిక్ష కార్యకలాపాల్లో విద్యాసంస్థలు, విద్యార్థుల భాగస్వామ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా ఇన్ స్పేస్ కింది చర్యలు తీసుకుంది:
- భారత అంతరిక్ష విధానం-2023 ప్రకారం, అలాగే దేశంలో అంతరిక్ష సాంకేతిక విద్య ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. దేశంలో అంతరిక్ష సాంకేతిక విద్యను ప్రవేశపెట్టడం కోసం 2023లో జాతీయ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- అంతరిక్ష సాంకేతిక మైనర్ కోర్సును ఏఐసీటీఈ ఆమోదించింది.
విద్యాపరంగా విద్యార్థుల కార్యకలాపాల కోసం సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ దాదాపు రూ. 1000 లక్షలు.
మోడల్ రాకెట్రీ, కాన్‌శాట్ ఇండియా స్టూడెంట్ కాంపిటీషన్‌ను 2025 అక్టోబరులో ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌లో ఇన్ స్పేస్, ఇస్రో, ఏఎస్ఐ సంయుక్తంగా నిర్వహించాయి. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థల నుంచి దాదాపు 500 మంది విద్యార్థులతో కూడిన 67 బృందాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. విద్యార్థులు మోడల్ రాకెట్లను రూపొందించి, తయారు చేసి.. కాన్‌శాట్ పేలోడ్‌లను దాదాపు కిలోమీటరు ఎత్తుకు ప్రయోగించారు.
ఇన్ స్పేస్ ప్రకటించిన కింది కార్యక్రమాలు/ పథకాలు అంతరిక్ష రంగంలో ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు చేయూతను అందిస్తున్నాయి:
- నిష్ణాతులైన నిపుణుల ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తోంది.
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతనివ్వడం కోసం ముందస్తు శిక్షణ పరమైన సహకారాన్ని అందించే కార్యక్రమం.
- ఇన్ స్పేస్ సాంకేతిక కేంద్రాల్లో సామూహిక పని ప్రదేశాలను ఏర్పాటు చేసి ప్రోత్సహించడం.
కేంద్ర శాస్త్ర సాంకేతికతా శాఖ, భౌగోళిక విజ్ఞాన సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయ, అణు ఇంధన, అంతరిక్ష, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2240061)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17