ఎరువుల విభాగం
azadi ka amrit mahotsav

రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు నకిలీ ఎరువులు, అక్రమ పద్ధతులపై కఠిన చర్యలు ఎరువులను ‘నిత్యావసరాలు'గా ప్రకటించిన ప్రభుత్వం


ట్యాగింగ్, బలవంతపు విక్రయాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు

నాడు పోస్టు చేయడమైనది: 13 MAR 2026 4:27PM by PIB Hyderabad

దేశంలోని రైతులకు నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చూడడానికి.. నకిలీ ఎరువుల తయారీ, విక్రయాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. 

లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ కీలక సమాచారం అందించారు. నిత్యావసర సరకుల చట్టం- 1955 కింద ఉండే 'ఎరువుల (అకర్బన, కర్బన లేదా మిశ్రమ) నియంత్రణ ఉత్తర్వు- 1985' ప్రకారం నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎరువుల తయారీ లేదా విక్రయాలను ఖచ్చితంగా నిషేధించినట్లు ఆమె తెలిపారు. ఈ నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆమె స్పష్టం చేశారు. ఇందులో భాగంగా లైసెన్సుల రద్దు లేదా నిలిపివేతతో పాటు నిత్యావసర సరకుల చట్టం కింద శిక్షార్హమైన చర్యలు కూడా ఉంటాయి. ఈ చట్టం ప్రకారం నేరస్థులకు మూడు నెలల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆమె వివరించారు.

నల్లబజారు క్రయవిక్రయాలు, అక్రమ నిల్వలు, నాణ్యత లేని ఎరువులు, ఎరువుల మళ్లింపు వంటి ఉల్లంఘనలపై రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రతి వారం పర్యవేక్షిస్తుంది. 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,30,541 దాడులు జరిగాయి. వీటి ఫలితంగా 15,544 షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 6,620 లైసెన్సులు నిలిపివేయడం లేదా రద్దు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 794 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం ప్రకారం గత ఐదేళ్లలో నకిలీ రసాయన ఎరువుల తయారీలో ఎటువంటి ఫ్యాక్టరీలు లేదా కంపెనీలు పాల్గొన్నట్లు సంఘటనలను మెజారిటీ రాష్ట్రాలు నివేదించలేదు. అయితే కొన్ని రాష్ట్రాలు వ్యక్తులు లేదా విక్రేతలపై ఇటువంటి కేసులు నమోదైనట్లు పేర్కొంటూ తీసుకున్న చర్యలను వివరించాయి. గత ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌ రెండు, హర్యానా నాలుగు, కర్ణాటక 15 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశాయి. ఇదే కాలంలో మధ్యప్రదేశ్ 16 నకిలీ ఎరువుల కేసులను నివేదించి 14 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. మహారాష్ట్ర నకిలీ ఎరువుల తయారీకి పాల్పడిన 19 తయారీదారులపై కేసులు నమోదు చేసింది. ఒడిశా మూడు కేసులు నివేదించింది. అనుమానాస్పద ఎరువుల తయారీకి పాల్పడిన 42 మందిపై రాజస్థాన్‌ చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్ 36 కేసులను నివేదించింది. 

దీనితో పాటు నిత్యావసర సరకుల చట్టం- 1955 కింద ఎరువులను ఒక 'నిత్యావసరం’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎటువంటి ట్యాగింగ్ లేదా బలవంతపు విక్రయాలనైనా అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన అధికారాలను ఇచ్చింది. అయినప్పటికీ సబ్సిడీ ఎరువులతో పాటు ఇతర ఉత్పత్తులను కలిపి విక్రయించే (ట్యాగింగ్) పద్ధతిని నిరుత్సాహపరచాలని ఎరువుల కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు క్రమ తప్పకుండా ఎరువుల విభాగం (డీఓఎఫ్) ఆదేశాలు జారీ చేస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2240055) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Gujarati