అంతరిక్ష విభాగం
అంతరిక్ష కార్యక్రమాల్లో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచుతున్న ఇస్రో
మార్గదర్శకత్వం, ప్రయోగ అవకాశాల ద్వారా ఇప్పటి వరకు విజయవంతంగా 11 విద్యార్థి ఉపగ్రహాల ప్రయోగం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ఇన్-స్పేస్ నిర్వహించిన ఉపగ్రహ, రాకెట్ డిజైన్ పోటీల్లో దాదాపు 850 మంది విద్యార్థులు పాల్గొన్నారు: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
యువ ఆవిష్కర్తలు ఉపగ్రహాలను నిర్మించేలా మార్గదర్శకత్వం వహిస్తోన్న ఇస్రో: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
విశ్వవిద్యాలయ విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాలకు ప్రయోగ అవకాశాలను కల్పిస్తోన్న ఇస్రో: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ఇస్రో విద్యార్థి ఉపగ్రహ కార్యక్రమం ద్వారా యువ పరిశోధకులకు లభిస్తోన్న వాస్తవ ప్రయోగానుభవం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
జాతీయ మోడల్ రాకెట్రీ పోటీలకు వేదికైన కుశీనగర్: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
12 MAR 2026 7:38PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ (స్వతంత్ర), ప్రధాని కార్యాలయ, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నేడు రాజ్యసభలో కీలక సమాచారం అందించారు. ఉపగ్రహాల అభివృద్ధి, పేలోడ్ ప్రయోగాలు, అంతరిక్ష మిషన్లలో విద్యార్థులు, యువ పరిశోధకులను చురుగ్గా భాగస్వాములను చేయడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వరుసగా నిర్మాణాత్మక కార్యక్రమాలను ప్రారంభించిందని ఆయన వెల్లడించారు.
రాజ్యసభలో శ్రీమతి సుమిత్ర బాల్మిక్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్.. అంతరిక్ష సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని విద్యాసంస్థలతో సహా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ వేగంగా విస్తరిస్తున్న భారత అంతరిక్ష వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఉపగ్రహ డిజైన్, పేలోడ్ అభివృద్ధి, రాకెట్ ప్రయోగాలు వంటి వాస్తవ అంతరిక్ష సాంకేతిక ప్రాజెక్టులపై విద్యార్థి పరిశోధకులు పనిచేయడానికి ఇస్రో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. యూ.ఆర్.రావు ఉపగ్రహ కేంద్రం నేతృత్వంలోని 'విద్యార్థి ఉపగ్రహం కార్యక్రమం' కింద విద్యాసంస్థలు, విద్యార్థి బృందాలు ఇస్రో శాస్త్రవేత్తల సాంకేతిక మార్గదర్శకత్వంతో ఉపగ్రహాలను రూపొందించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ విధంగా విద్యార్థులు నిర్మించిన ఉపగ్రహాలకు ఇస్రో ప్రయోగాల ద్వారా అనుసంధాన మద్దతు, ప్రయోగ అవకాశాలు కూడా లభిస్తున్నాయి.
గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి డిగ్రీ, పీజీ, డాక్టొరల్ విద్యార్థుల కోసం ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్ ట్రైనీ పథకాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు ఇస్రో కేంద్రాల్లో విద్యార్థులకు ప్రయోగాత్మక పరిశోధనా అనుభవాన్ని అందిస్తాయని.. తద్వారా యువ పరిశోధకులకు అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతలతో నేరుగా పని చేసే అవకాశం లభిస్తుందని ఆయన వివరించారు.
విద్యాసంస్థల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలలో ‘అంతరిక్ష సాంకేతిక ఇంక్యుబేషన్ కేంద్రాలు’ (ఎస్టీఐసీ) ఏర్పాటయ్యాయి. ఈ కేంద్రాలు విశ్వవిద్యాలయాలు, ఇస్రో శాస్త్రవేత్తల మధ్య ఉమ్మడి పరిశోధనలను సులభతరం చేస్తాయి. నిపుణుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు స్వదేశీ అంతరిక్ష సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి సహాయపడతాయి.
అంతరిక్ష రంగంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) పాత్రను కూడా కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. కాన్ పరిమాణంలోని ఉపగ్రహాలు, మోడల్ రాకెట్ల రూపకల్పన, అభివృద్ధిపై విద్యార్థుల కోసం పోటీలను ఇన్-స్పేస్ నిర్వహించింది. ఈ పోటీలలో దాదాపు 850 మంది విద్యార్థులతో కూడిన 97 విద్యార్థి బృందాలు పాల్గొన్నాయని ఆయన వెల్లడించారు.
ఇప్పటివరకు 17 విద్యార్థి ఉపగ్రహాలు, పేలోడ్లకు ఇన్-స్పేస్ అనుమతులు ఇచ్చిందన్న డాక్టర్ జితేంద్ర సింగ్.. వాటిలో ఇప్పటికే 11 విజయవంతంగా ప్రయోగించినట్లు సభకు తెలిపారు. ఈ మిషన్లలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఐఐఎస్టీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ), ఆర్‌వీ ఇంజనీరింగ్ కళాశాల, మహారాష్ట్రలోని అమిటీ విశ్వవిద్యాలయం, ఎంఐటీ వరల్డ్ పీస్ విశ్వవిద్యాలయం, అస్సాం డాన్ బాస్కో విశ్వవిద్యాలయం, సీవీ రామన్ గ్లోబల్ విశ్వవిద్యాలయం వంటి దేశవ్యాప్త విద్యాసంస్థలు పాల్గొన్నాయి. విద్యార్థుల నేతృత్వంలోని అంతరిక్ష మిషన్లలో పెరుగుతున్న జాతీయ భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు.
అంతరిక్ష పరిశోధనలను మరింత సమ్మిళితం చేయాలనే ప్రభుత్వ నిబద్ధత ప్రస్తావించిన ఆయన.. ఇస్రో చేపట్టిన రెస్పాండ్ (రెస్పాండ్ - స్పాన్సర్డ్ రీసెర్చ్) కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత, అప్లికేషన్లలో పరిశోధనలు చేయడానికి ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
ఇస్రో కార్యక్రమాలకు ప్రాంతీయ కేంద్రాలుగా వ్యవహరించడానికి 'రీజనల్ అకాడమిక్ సెంటర్స్ ఫర్ స్పేస్' (ఆర్ఏసీ-ఎస్) ఏర్పాటయ్యాయి. చిన్న పట్టణాలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు అంతరిక్ష శాస్త్రం, సాంకేతికతపై అవగాహన, అనుభవం పొందేలా ఈ కేంద్రాలు భరోసా ఇస్తున్నాయి.
కేవలం ఉన్నత స్థాయి విద్యాసంస్థలకే పరిమితం కాకుండా ఆవిష్కరణలను అన్ని ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతోనే అంతరిక్ష సాంకేతికత ఇంక్యుబేషన్ కేంద్రాలను కావాలనే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేసినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇది స్వదేశీ సాంకేతికతల అభివృద్ధి, ప్రముఖ విద్యాసంస్థల వెలుపల కూడా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని ఆయన వివరించారు.
దేశంలో అంతరిక్ష విద్యను బలోపేతం చేయడానికి ఏఐసీటీఈ 'అంతరిక్ష సాంకేతికతకు సంబంధించిన మైనర్ కోర్సు'కు ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అన్నారు. 'భారత అంతరిక్ష విధానం-2023'కి అనుగుణంగా దేశంలో అంతరిక్ష సాంకేతిక విద్యా విధానాన్ని అమలు చేయడానికి ఒక జాతీయ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
విద్యార్థుల్లో పెరుగుతున్న ఉత్సాహాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ఆయన.. 2025 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని కుశీనగర్‌లో ఇన్-స్పేస్, ఇస్రో, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సంయుక్తంగా 'మోడల్ రాకెట్రీ, కాన్‌శాట్ ఇండియా విద్యార్థి పోటీ'ని నిర్వహించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ పోటీలో దాదాపు 500 మంది విద్యార్థులతో కూడిన 67 బృందాలు పాల్గొని సుమారు 1 కిలోమీటరు ఎత్తు వరకు ప్రయాణించే మోడల్ రాకెట్లు.. అవి మోసుకెళ్లే కాన్‌శాట్ పేలోడ్‌లను స్వయంగా రూపొందించి, తయారు చేసి, విజయవంతంగా ప్రయోగించాయి.
అంతరిక్ష శాస్త్రం, సాంకేతికతకు సంబంధించిన విద్యార్థి-కేంద్రీకృత విద్యా కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఏటా సుమారు 10 కోట్ల రూపాయలను కేటాయించిందని మంత్రి వెల్లడించారు.
విషయ నిపుణుల మార్గదర్శకత్వం, ప్రీ-ఇంక్యుబేషన్ వ్యవస్థాపకత మద్దతు కార్యక్రమాలు.. ఇన్-స్పేస్ టెక్నికల్ సెంటర్లలో కో-వర్కింగ్ సౌకర్యాలు వంటి పలు కార్యక్రమాల ద్వారా తదుపరి తరం అంతరిక్ష పారిశ్రామికవేత్తలను ఇన్-స్పేస్ సంస్థ ప్రోత్సహిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
భారత్‌లో ఒక శక్తిమంతమైన, సమ్మిళిత అంతరిక్ష వ్యవస్థను నిర్మించాలనే ప్రభుత్వ విస్తృత దార్శనికతలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ పోషిస్తున్న విస్తృత పాత్రలో విద్యార్థులు, అంకురాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు అన్నీ భాగస్వాములు కావడమే దీని లక్ష్యమని ఆయన వివరించారు.
ఫోటో: గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తున్న దృశ్యం
***
(రిలీజ్ ఐడి: 2239659)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14