ప్రధాన మంత్రి కార్యాలయం
ఎన్‌ఎక్స్‌టీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
మనకు ఉన్నది ఒకే లక్ష్యం ఒకే గమ్యం.. అది 'వికసిత భారత్' : ప్రధాని
అనేక ప్రపంచ సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ వైపు గొప్ప ఆశతో చూస్తున్న ప్రపంచ నాయకులు, నిపుణులు: ప్రధాని
మీరు భవిష్యత్తులో భాగం కావాలనుకుంటే భారత్‌లో ఉండాలి: ప్రధాని
కేవలం పురోగతి సాధించడం మాత్రమే కాకుండా తదుపరి స్థాయికి చేరుకుంటున్న భారత్: ప్రధాని
ప్రపంచ సవాళ్ల భారం నుంచి సొంత రైతులు, పౌరులను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోన్న భారత్: ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
12 MAR 2026 10:02PM by PIB Hyderabad
చారిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఐటీవీ నెట్‌వర్క్ నిర్వహించిన ఎన్ఎక్స్‌టీ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగించారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి, అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రస్తుత లక్ష్యానికి మధ్య ఉన్న పోలికలను ఆయన వివరించారు. 1930 నాటి దండి యాత్ర దేశాన్ని స్వాతంత్య్రం వైపు ఎలాగైతే ఏకం చేసిందో ప్రస్తుత 'వికసిత భారత్' మిషన్ కూడా 140 కోట్ల భారతీయుల ఉమ్మడి లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. “చారిత్రాత్మక దండి యాత్ర ప్రారంభమై దాదాపు 100 సంవత్సరాలు గడిచిన తరుణంలో నేడు భారతీయులమైన మనం మరోసారి 'వికసిత భారత్' సాధన కోసం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం” అని ప్రధాని పేర్కొన్నారు.
21వ శతాబ్దపు విలక్షణమైన సవాళ్లను ప్రస్తావించిన ప్రధానమంత్రి.. ప్రపంచ సంఘర్షణలు, సరఫరా గొలుసుల అంతరాయాల మధ్య కూడా భారత్ ఒక ఆశాకిరణంగా, స్థిరత్వానికి చిహ్నంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి అగ్ర నాయకత్వం, నిపుణులు ఇప్పుడు భారత్‌ను నూతన ప్రపంచ క్రమానికి ప్రధాన చోదక శక్తిగా చూస్తున్నారని ఆయన ప్రముఖంగా చెప్పారు. ఇటీవల తన పర్యటనలో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ మాట్లాడుతూ ప్రపంచ గమనాన్ని ఇకపై 'గ్లోబల్ సౌత్' నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించినట్లు ప్రధాని గుర్తు చేశారు. కెనడాకు చెందిన మార్క్ కార్నీ అభిప్రాయం ప్రకారం రాబోయే మూడు దశాబ్దాలలో ప్రపంచ ఆర్థిక కేంద్రం భారత్ వైపు మళ్లనుందని ప్రధాని తెలిపారు. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారత్ ఒక అనివార్యమైన భాగస్వామి అన్న అభిప్రాయంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. “మీరు భవిష్యత్తులో భాగం కావాలనుకుంటే భారత్‌తో అనుబంధం కలిగి ఉండాలి. మీరు భారత్‌లోనే ఉండాలి” అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారతీయ పౌరులలో మునుపెన్నడూ లేనంత విశ్వాసం, ఆకాంక్షలు ఉన్నాయన్న ఆయన.. ఆర్థిక వృద్ధిపై ప్రజలకు ఉన్న ఆసక్తిని క్రికెట్ పట్ల దేశానికి ఉన్న మక్కువతో పోల్చారు. ఒకప్పుడు అసాధ్యమని భావించిన డిజిటల్ చెల్లింపులు, భారీ స్థాయి సంస్కరణల ద్వారా దేశం ‘తదుపరి స్థాయి’ కార్యకలాపాలకు మారిన తీరును ఆయన వివరించారు. “భారత్ కేవలం పురోగతి సాధించడం మాత్రమే కాదు తదుపరి దశకు దూసుకుపోతోంది” అని ఆయన ఉద్ఘాటించారు.
దేశానికి క్రికెట్ పట్ల ఉన్న మక్కువతో భారత వృద్ధిపై ప్రజలకు ఉన్న ప్రస్తుత ఆసక్తిని పోలుస్తూ ప్రధానమంత్రి ఒక స్పష్టమైన ఉదాహరణను ఇచ్చారు. ప్రజలు టీ-20 ప్రపంచ కప్ స్కోర్‌ను ఎంత ఆత్రుతగా గమనిస్తారో అదేవిధంగా ఇప్పుడు దేశ ఆర్థిక స్థితిగతులపై కూడా 'రన్నింగ్ కామెంటరీ'ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. భారతీయులలో పెరుగుతున్న ఆకాంక్షలు, ఆత్మవిశ్వాసానికి ఈ అపూర్వమైన ఉత్సుకత నిదర్శనమన్న ఆయన.. ఇదే దేశంపై ఉన్న అంతర్జాతీయ నమ్మకానికి పునాది అని అన్నారు. భారత పురోగతిపై ప్రపంచం కళ్లు ఉన్నాయని.. ఈ వేగాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రజలందరికీ పెరిగిందని శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా చెప్పారు. “ఎన్నో అంచనాలు ఉండి ప్రపంచం మన దేశం వైపు చూస్తున్నప్పుడు మన బాధ్యత గణనీయంగా పెరుగుతుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ప్రపంచ స్థాయి భౌతిక, డిజిటల్ ఆస్తుల సృష్టి ద్వారా ఆధునిక భారత్ కేవలం పురోగతి సాధించడం మాత్రమే కాకుండా 'తదుపరి స్థాయి'కి చురుకుగా ఎదుగుతోందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సాధించిన వేగవంతమైన పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థను ఒక కొత్త దశలోకి తీసుకెళ్లిందని.. తద్వారా తక్షణ డిజిటల్ లావాదేవీలలో భారత్‌ను ప్రపంచ దేశాలకే అగ్రగామిగా నిలిపిందని ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలలో వచ్చిన ఈ మార్పు మరింత అనుసంధానమైన, సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థకు ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తోందన్నారు. “నేడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన తక్షణ డిజిటల్ చెల్లింపులు జరుగుతున్న దేశంగా భారత్ అవతరించింది” అని ప్రధానమంత్రి అన్నారు.
ఆధునిక భారత్ ప్రస్తుతం 'తదుపరి తరం సంస్కరణల' దిశగా అత్యంత వేగంగా దూసుకుపోతోందన్న ప్రధానమంత్రి.. గతంలో అసాధ్యమని భావించిన అనేక నిర్ణయాలను విజయవంతంగా దేశం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, జన్ ధన్ ఖాతాల ద్వారా 50 కోట్ల మందికి పైగా పౌరులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేర్చడం, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని ఆమోదించడం వంటి చారిత్రాత్మక విజయాలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతరిక్షం, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాలలో ప్రత్యేక మిషన్ల ద్వారా భారత్ గతంలో ఉన్న సాంకేతిక పరిమితులను చెరిపివేసిందని ఆయన తెలిపారు. “నేడు మూన్ మిషన్, సెమీకండక్టర్ మిషన్, క్వాంటం మిషన్లు భారత్‌ను అధునాతన సాంకేతిక వైపు తీసుకెళ్తున్నాయి” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
కేవలం ఆకాంక్షలు మాత్రమే ఉండే దశను దాటుతూ భారత్ ఇప్పుడు తన లక్ష్యాలను ఖచ్చితంగా అమలు చేసే, సాకారం చేసుకునే దశకు చేరుకుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. దేశ పురోగతిలో వచ్చిన ఈ మార్పును ప్రపంచం కూడా గుర్తించిందని.. దేశ వృద్ధి ఇకపై స్వల్ప మార్పులకే పరిమితం కాకుండా విప్లవాత్మకమైన మార్పుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తన చిరకాల కలలను స్పష్టమైన విజయాలుగా మారుస్తున్న ఒక దేశాన్ని ఈ కొత్త వాస్తవం సూచిస్తోంది. “భారతదేశం కేవలం పురోగతి సాధించడం మాత్రమే కాదు.. తదుపరి స్థాయికి దూసుకుపోతోంది” అని ప్రధాని అన్నారు.
కరోనా మహమ్మారి, ప్రస్తుత అంతర్జాతీయ సంఘర్షణల వంటి ఆకస్మిక ప్రపంచ మార్పులను ఎదుర్కోవడంలో ఒక దేశం చూపే పట్టుదల ఆధారంగానే ఆ దేశ అభివృద్ధి ఉంటుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. సమీప దేశాల్లో జరుగుతున్న ప్రస్తుత యుద్ధం ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభానికి దారితీసిందన్న ప్రధాని.. ఇది జాతీయ వ్యక్తిత్వానికి ఒక క్లిష్టమైన పరీక్ష వంటిదని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులను శాంతి, సహనం, ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. రాజకీయ పార్టీలు, మీడియా, పరిశ్రమల ఉమ్మడి బాధ్యతను గుర్తు చేసిన ఆయన.. మహమ్మారి సమయంలో మనం చూపిన సమష్టి కృషి భారత్ బలాన్ని రెట్టింపు చేసిన తీరును ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా అదే విధమైన సహకార స్ఫూర్తి అవసరమని పిలుపునిచ్చారు. “మనం జాతీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమష్టి కృషితో మన బాధ్యతలను నిర్వహించాలి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ఎల్పీజీకి విషయంలో జరుగుతున్న చర్చల గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో తప్పుడు సమాచారం కంటే వాస్తవాలకే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతమైన రీతిలో చర్చలు జరగాలని ప్రధానమంత్రి కోరారు.
ప్రస్తుత ప్రపంచ సంఘర్షణల ప్రభావం ప్రతి దేశంపై పడిందన్న ప్రధానమంత్రి.. దీనికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం బహుళ స్థాయిల్లో చురుకైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సంక్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి, ప్రపంచ సంక్షోభానికి శాశ్వత పరిష్కారాలను కనుగొనడానికి తాను ప్రపంచ అగ్రనేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. అంతర్జాతీయ సరఫరా గొలుసులలో ఏర్పడిన వివిధ అంతరాయాలను పరిష్కరించడానికి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. “సరఫరా గొలుసులో తలెత్తిన అడ్డంకులను మనం ఎలా అధిగమించగలమనే దానిపై నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఆయన స్పష్టం చేశారు.
భారత ఇంధన భద్రత కోసం ప్రధానమంత్రి రెండు అంచెల వ్యూహాన్ని వివరించారు. దేశాభివృద్ధి వేగవంతం కావడానికి స్వదేశీ మౌలిక సదుపాయాల విస్తరణ, విదేశీ ఆధారితాన్ని తగ్గించడంపై ఆయన దృష్టి సారించారు. గ్యాస్ రంగం వృద్ధిని విశ్లేషిస్తూ.. 2014లో 14 కోట్లుగా ఉన్న ఎల్పీజీ కనెక్షన్లు నేడు సుమారు 33 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ఇది మెజారిటీ భారతీయ గృహాలకు లబ్ధి చేకూరుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విస్తరణకు మద్దతుగా బాట్లింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడం, ఎల్ఎన్‌జీ టెర్మినల్స్‌ను రెట్టింపు చేయడం.. గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను 3,500 కిలోమీటర్ల నుంచి 10,000 కిలోమీటర్లకు విస్తరించడం వంటి చర్యలను ఆయన ప్రముఖంగా చెప్పారు. అంతర్జాతీయంగా దిగుమతి చేసుకుంటున్న 60 శాతం ఎల్పీజీని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రధాన ఓడరేవుల వద్ద దిగుమతి టెర్మినల్ సామర్థ్యాలను ప్రభుత్వం భారీగా పెంచిందని తెలిపారు. “భారతదేశ వేగవంతమైన అభివృద్ధి కోసం విభిన్న ఇంధన వనరులను ప్రోత్సహించడం, ఇంధన రంగంలో స్వయం సమృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం నిరంతరం అవసరం” అని ఆయన వ్యాఖ్యానించారు.
పట్టణ ఇంధన రంగంలో వచ్చిన భారీ మార్పులను ప్రధానమంత్రి ప్రస్తావించారు. 2014 కంటే ముందు కేవలం 25–26 లక్షల ఇళ్లకే పరిమితమైన పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్లు నేడు 1.25 కోట్లకు పైగా గృహాలకు విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. పర్యావరణహిత రవాణా దిశగా వచ్చిన మార్పును ప్రస్తావిస్తూ.. సీఎన్‌జీ వాహనాల సంఖ్య 10 లక్షల కంటే తక్కువ నుంచి 70 లక్షల పైచిలుకు పెరిగిందని తెలిపారు. గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 600 కంటే ఎక్కువ జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “గత పదేళ్లలో దేశంలోని 600 కంటే ఎక్కువ జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లు ఏర్పడటం వల్లే ఇది సాధ్యమైంది” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రపంచ అనిశ్చితి ముఖ్యంగా కీలక రంగాలలో జాతీయ స్వయం సమృద్ధి సాధించాల్సిన వ్యూహాత్మక అవసరాన్ని ప్రముఖంగా తెలియజేసిందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. భారత ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, బాహ్య సంక్షోభాల ప్రభావాన్ని తగ్గించడానికి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఒక సమగ్ర విధానాన్ని అనుసరిస్తోందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్పుల వల్ల దేశ పురోగతికి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడటమే ఈ సమగ్ర వ్యూహానికి ఉన్న ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. “ఏ దేశానికైనా స్వయం సమృద్ధిగా ఉండటం ఎందుకు అంత ముఖ్యమో ఈ ప్రపంచ సంక్షోభం మరోసారి నిరూపించింది”అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
పెట్రోలియంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇథనాల్, జీవ ఇంధనాలపై ప్రభుత్వం అనుసరిస్తోన్న వ్యూహాత్మక దృష్టిని ప్రధానమంత్రి ప్రస్తావించారు. 2014 కంటే ముందు కేవలం 1–1.5 శాతంగా ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ నేడు దాదాపు 20 శాతానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల గత 11 ఏళ్లలో అదనంగా 18 కోట్ల బారెళ్ల చమురును కొనుగోలు చేయాల్సిన అవసరం తప్పిందని.. ఇది జాతీయ నిల్వలను గణనీయంగా బలోపేతం చేసిందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ మార్పు వల్ల భారత్ తన వార్షిక చమురు దిగుమతులను సుమారు 4.5 కోట్ల బారెళ్ల వరకు తగ్గించుకోగలుగుతోందని.. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరిందని ప్రధాని తెలిపారు. “ఇథనాల్ బ్లెండింగ్ ద్వారానే దేశం సుమారు లక్షన్నర కోట్ల రూపాయలను ఆదా చేసింది” అని ఆయన స్పష్టం చేశారు.
జాతీయ ఇంధన పొదుపుపై రైల్వే విద్యుదీకరణ, పునరుత్పాదక ఇంధనం చూపుతున్న విప్లవాత్మక ప్రభావాన్ని ప్రధానమంత్రి చెప్పారు. 2014 నాటికి కేవలం 20 శాతం రైల్వే నెట్‌వర్క్ మాత్రమే విద్యుదీకరణ అయి ఉండగా నేడు దాదాపు 100 శాతం బ్రాడ్-గేజ్ నెట్‌వర్క్ విద్యుత్‌తో నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇదొక్కటే 2024-25లో భారతీయ రైల్వేకు సుమారు 180 కోట్ల లీటర్ల డీజిల్‌ను ఆదా చేసిందని.. తద్వారా ముడి చమురు దిగుమతుల అవసరాన్ని గణనీయంగా తగ్గించిందని ఆయన తెలిపారు. హరిత ఇంధన విప్లవాన్ని మరింతగా వివరిస్తూ.. భారత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం చారిత్రాత్మకమైన 250 గిగావాట్లకు చేరుకుందని తెలిపారు. ఇందులో సౌరశక్తి సామర్థ్యం ఒక్కటే నేడు 130 గిగావాట్లకు పెరిగిందన్న ఆయన.. 2014లో ఇది 2 గిగావాట్లు మాత్రమేనని అన్నారు. 30 లక్షల కుటుంబాలకు పై కప్పు సౌర ఫలకాల ద్వారా విద్యుత్తును అందించిన 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' విజయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. “నేడు మన మొత్తం పునరుత్పాదక సామర్థ్యం 250 గిగావాట్ల చారిత్రక మైలురాయిని దాటింది. మన మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం ఇప్పుడు పునరుత్పాదక వనరుల నుంచే వస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
సామర్థ్య పెంపుదల, 'వ్యర్థాల నుంచి ఇంధనం' తయారీలో ప్రభుత్వం చేస్తున్న పటిష్ఠమైన ప్రయత్నాలను ప్రధానమంత్రి వివరించారు. గోబర్ధన్ పథకం కింద ప్రస్తుతం 100కు పైగా కంప్రెస్డ్ బయో-గ్యాస్ (సీబీజీ) కేంద్రాలు పని చేస్తున్నాయని.. మరో 600 కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 2014 కంటే ముందు నామమాత్రంగా ఉన్న చమురు నిల్వ సామర్థ్యాన్ని నేడు 50 లక్షల టన్నులకు పైగా 'వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు' సృష్టించడం ద్వారా జాతీయ భద్రతలో వచ్చిన గణనీయమైన మార్పును ప్రధాని మోదీ తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో వార్షిక చమురు శుద్ధి సామర్థ్యాన్ని 40 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా పెంచడం వల్ల భారత్ ప్రపంచ చమురు శుద్ధి కేంద్రంగా ఎదిగిందని ప్రధాని గుర్తు చేశారు. ఈ నిర్మాణాత్మక బలాలు ప్రస్తుత ప్రపంచ ఇంధన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దేశానికి సహాయపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. “ఈ యుద్ధం వల్ల తలెత్తిన సంక్షోభాన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కోగలం. భారత్‌ను భారీ స్థాయిలో స్వయం సమృద్ధిగా మార్చే దిశగా మన పనిని కొనసాగిస్తాం” అని ఆయన ఉద్ఘాటించారు.
ప్రస్తుత ప్రపంచ అనిశ్చితులను ఎదుర్కోవడంలో భారత్‌లోని 140 కోట్ల మంది ప్రజల సమష్టి బలంపై ప్రధానమంత్రి ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మహమ్మారి సమయంలో దేశం చూపిన ఐక్య ప్రతిస్పందనను గుర్తు చేసిన ఆయన.. అదే విధమైన క్రమశిక్షణ, పట్టుదల ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాన్ని అధిగమించేలా చేస్తాయని పేర్కొన్నారు. దేశ పురోగతిని కాపాడటానికి తన ప్రభుత్వం అవిశ్రాంత సేవ, చురుకైన చర్యలకు కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. “మేం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ప్రజా ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది” అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ సంఘర్షణల ప్రభావం ప్రపంచ మార్కెట్, ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై ఇంకా కొనసాగుతున్నప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం తన ప్రజలను ఈ బాహ్య ఒత్తిళ్ల నుంచి రక్షించడానికి నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఉదాహరణగా ప్రస్తావించిన ఆయన.. దేశీయంగా ధరలు పెరగకుండా ఉండటానికి ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై భారీగా రాయితీలు అందించిందని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా యూరియా ధర ఒక్కో బస్తాకు రూ. 3000కి చేరుకున్న సమయంలో కూడా వ్యవసాయ స్థిరత్వాన్ని కాపాడటం కోసం ప్రభుత్వం రైతులకు కేవలం రూ. 300 నామమాత్రపు ధరకే అది అందేలా చూసిందని ఆయన వివరించారు. “ఈ సారి కూడా యుద్ధ ప్రభావం దేశంలోని రైతులు, ప్రజల జీవితాలపై వీలైనంత తక్కువగా ఉండేలా చూడటమే మా ప్రతి ప్రయత్నం” అని ఆయన అన్నారు.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని..సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడం, అక్రమ వ్యాపార పద్ధతులను నియంత్రించడం సామాజిక, ఆర్థిక స్థిరత్వానికి అత్యంత కీలకమని ఆయన చెప్పారు. కృత్రిమ కొరత లేదా ధరల అవకతవకల నుంచి వినియోగదారులను రక్షించడానికి మార్కెట్ పరిస్థితులపై కఠినమైన పర్యవేక్షణ ఉంచాలని ఆయన స్థానిక అధికారులను కోరారు. “పరిస్థితిని తీవ్రంగా పర్యవేక్షించడం, నల్లబజారుకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సున్నితమైన పాలన, గత ప్రభుత్వాల వల్ల నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు- వర్గాలకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా గత దశాబ్ద కాలం ప్రత్యేకతను చాటుకుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఆకాంక్షిత జిల్లాల పథకం, పీఎం జన్మన్ వంటి అంకితభావంతో కూడిన కార్యక్రమాల ద్వారా దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు గృహనిర్మాణం, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం విజయవంతంగా అందించిందని ఆయన పేర్కొన్నారు. అంతర్గత భద్రతలో వచ్చిన విప్లవాత్మక మార్పును ప్రస్తావించిన ఆయన.. 2013లో 180 కంటే ఎక్కువ జిల్లాలు మావోయిస్టు ప్రభావితంగా ఉండగా నేడు ఆ సంఖ్య పది కంటే తక్కువకు పడిపోయిందని అన్నారు. భయాన్ని తొలగించి అభివృద్ధి, సమ్మిళిత వృద్ధిని తీసుకురావాలనే జాతీయ సంకల్పాన్ని ఈ మార్పు ప్రతిబింబిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. “నేడు మావోయిస్టు ఉగ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య సింగిల్ డిజిట్‌కు చేరుకుంది” అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
గత ఏడాది కాలంలో అంతర్గత భద్రతలో సాధించిన భారీ విజయాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. 2,100 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోవడం.. 300 మందికి పైగా కరడుగట్టిన మిలిటెంట్లను నిర్వీర్యం చేయడం వల్ల గతంలో సంఘర్షణలతో నిండిన ప్రాంతాల్లో అభివృద్ధి తిరిగి ఊపందుకుందని ఆయన పేర్కొన్నారు. భారత్ పురోగతి ఇప్పుడు అప్రతిహతంగా సాగుతోందన్న ఆయన.. 140 కోట్ల మంది ప్రజల ‘తదుపరి స్థాయి' ఆకాంక్షలే దీనికి చోదక శక్తి అని ఉద్ఘాటించారు. ఈ ఆకాంక్షలు దేశానికి భారం కావన్న ఆయన.. వీటిని ప్రజల నమ్మకానికి ఒక గొప్ప పెట్టుబడిగా అభివర్ణించారు. నిరంతర ప్రజల ఆశీస్సులతో స్వయం సమృద్ధి, అభివృద్ధి చెందిన దేశం అనే జాతీయ స్వప్నాన్ని నెరవేర్చడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలుపుతూ ప్రధాని ప్రసంగాన్ని ముగించారు. “ప్రతి రంగంలోనూ భారత్ స్వయం సమృద్ధి సాధిస్తుంది. ప్రతి పరిస్థితుల్లోనూ భారత్ అభివృద్ధి చెందుతుంది” అని శ్రీ నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2239644)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5