సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 10 MAR 2026 5:00PM by PIB Hyderabad

ఉపాధి కల్పన, సామాజిక భద్రత, స్థానిక ఆర్థికాభివృద్ధి సాధనాలుగా సహకార సంస్థలను శక్తిమంతం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. యాజమాన్యం, నిర్వహణ, విలువ సృష్టికి కేంద్రంగా, డ్రైవర్లు సారథులుగా రవాణా రంగంలో చేపట్టిన పరివర్తనాత్మక కార్యక్రమమే భారత్ టాక్సీ. ఈ కార్యక్రమం అగ్రిగేటర్-ఆధారిత నమూనాలకు సుస్థిరమైన, గౌరవప్రదమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. "భారత్ టాక్సీ" భారత సహకార ఆధారిత తొలి రైడ్-హెయిలింగ్ వేదిక. 'సహకార్ సే సమృద్ధి' దార్శనికతకు అనుగుణంగా... సహకార రంగ బలోపేతం దిశగా... సమ్మిళిత, పౌర-కేంద్రిత రవాణా పరిష్కారాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కీలక ముందడుగు. బహుళ-రాష్ట్ర సహకార సంఘాల చట్టం-2002 కింద నమోదైన, సహకార రంగంలో పనిచేస్తున్న 8 జాతీయ స్థాయి సంస్థలు 6 జూన్ 2025న భారత్ టాక్సీ వేదికను ఏర్పాటు చేయగా... అధికారికంగా ఫిబ్రవరి 5, 2026న భారత్ టాక్సీ సేవలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం భారత్ టాక్సీ సేవలు ఢిల్లీ ఎన్‌సీఆర్ - ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సోమనాథ్, ద్వారకల్లో కొనసాగుతున్నాయి. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా భారత్ టాక్సీ సేవలను దశలవారీగా విస్తరించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.

పేటిఎం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్, ఢిల్లీ టూరిజం-ట్రాన్స్‌పోర్టేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్, జిఎంఆర్ గ్రూప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో భారత్ టాక్సీ అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకుంది. డిజిటల్ చెల్లింపులు, విమానాశ్రయం-మెట్రో కనెక్టివిటీ, ట్రాఫిక్, రవాణా సమన్వయం, ఇ-గవర్నెన్స్ సిస్టమ్‌లు, పర్యాటక సంబంధిత ప్రయాణ సౌకర్యాలు, బీమా కవరేజ్, మౌలిక సదుపాయాల ఏకీకరణ, సంస్థాగత బ్యాంకింగ్ మద్దతు సహా బహుళ రంగాల్లో సహకారాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగాయి. సమష్టిగా ఈ ఒప్పందాలు మరింత సమన్వయంతో కూడిన, పౌరులకు అనుకూలమైన రవాణా వ్యవస్థ అభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.

సహకార నమూనా ద్వారా జీవనోపాధి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ఈ వేదికను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా డ్రైవర్-యజమానులు, నిరుద్యోగులు, యువతకు ఇది ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఇది మరింత అభివృద్ధి చెందుతున్న క్రమంలో సరుకు రవాణా, కమ్యూనిటీ భాగస్వామ్యం, సేవల పంపిణీ సహా దీని అమలులో వివిధ వాటాదారులను భాగం చేయనుంది. భాగస్వామ్యం స్థాయి, వృద్ధి వేగం ఆధారంగా జీవనోపాధి, స్వయం ఉపాధికి ఇది సరికొత్త మార్గాలను సృష్టిస్తుంది.

భారత్ టాక్సీ ప్లాట్‌ఫామ్ జీరో-కమీషన్ నమూనా ఆధారంగా పనిచేస్తుంది. డ్రైవర్లకు నేరుగా లాభాలను అందిస్తుంది. పెట్టుబడి-ఆధారిత అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లకు దేశీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. భారత్ టాక్సీలో పారదర్శక ఛార్జీలు, వినియోగదారుల హితమైన మొబైల్ రైడ్-బుకింగ్ ఇంటర్‌ఫేస్, వాహనం ఉన్న ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే వ్యవస్థ, బహుభాషల్లో మద్దతునందించే ఇంటర్‌ఫేస్‌లతో నిరంతరాయంగా, మరింత మెరుగ్గా అందుబాటులో ఉండే వినియోగదారుల సహాయ కేంద్రం ఉన్నాయి. సమ్మిళిత రవాణాను ప్రోత్సహిస్తూ ఈ ప్లాట్‌ఫామ్ సురక్షితమైన, ధృవీకరణతో కూడిన ఆన్‌బోర్డింగ్‌ సదుపాయాన్ని అందిస్తుంది.

భారత తొలి సహకార రైడ్-హెయిలింగ్ సేవల్లో మహిళా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి 'బైక్ దీదీ', 'సారథి దీదీ' వంటి మహిళా-కేంద్రిత కార్యక్రమాలనూ భారత్ టాక్సీ ప్రారంభించింది. మహిళా స్వయం సహాయక సంఘాలు, సహకార సంస్థల సహకారంతో పాటుగా నిర్ధిష్ట వర్గాలను చేరుకోవడం లక్ష్యంగా... నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఆర్థిక సహాయం, భద్రతా చర్యలు, ప్రాధాన్య ఆన్‌బోర్డింగ్ ద్వారా మహిళా భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహిస్తున్నారు.

కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2237950) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी