రైల్వే మంత్రిత్వ శాఖ
ఉక్కు, ఇనుప ఖనిజం, ఎరువుల రవాణాలో గణనీయమైన వృద్ధి.. ఫిబ్రవరిలో రైల్వేకు రూ.14,571 కోట్ల సరకు రవాణా రాబడి
గతేడాది ఫిబ్రవరిలో 132.48 మిలియన్ టన్నులతో పోల్చితే, 2026 ఫిబ్రవరిలో దాదాపు 4 శాతం వృద్ధితో 137.72 మిలియన్ టన్నులకు చేరుకున్న సరకు రవాణా
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం సరకు రవాణా 1,503.8 మిలియన్ టన్నులకు చేరగా.. ఆదాయం రూ.1.61 లక్షల కోట్లు
నాడు పోస్టు చేయడమైనది:
06 MAR 2026 5:05PM by PIB Hyderabad
భారత ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయటంలో భారతీయ రైల్వే కీలక పాత్రను పోషిస్తూనే ఉంది. ముఖ్యంగా బొగ్గు, ఉక్కు, ఎరువులు, సిమెంట్, ఆహార ధాన్యాలు, కంటైనర్ల వంటి నిత్యవసర వస్తువుల రవాణాను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే, 2026 ఫిబ్రవరిలో సరకు రవాణా కార్యకలాపాలు స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. వివిధ రంగాల్లో రైల్వే ద్వారా రవాణాకున్న నిరంతర డిమాండ్‌ను ఇది తెలియజేస్తుంది.
ఫిబ్రవరి 2026లో భారత రైల్వేలు 137.72 మిలియన్ టన్నుల సరకును రవాణా చేసింది. గతేడాది ఫిబ్రవరిలో 132.48 మిలియన్ టన్నులతో పోల్చితే 3.96 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ నెలలో సరకు రవాణా ద్వారా రూ.14,571.99 కోట్లు కాగా, గతేడాది ఇదే నెలలో వచ్చిన రూ.14,151.96 కోట్ల ఆదాయంతో పోల్చితే 2.97 శాతం పెరుగుదల నమోదైంది.
రవాణా సామర్థ్యంలోనూ రైల్వేలు బలమైన పనితీరును కనబరిచాయి. సరకు రవాణా కదలికల సూచి నెట్ టన్ కిలోమీటర్లు (ఎన్టీకేఎం) ఫిబ్రవరి 2025లో 72,955 మిలియన్లు ఉండగా, ఫిబ్రవరి 2026 నాటికి 76,007 మిలియన్లకు చేరుకుంది. తద్వారా 4.18 శాతం వృద్ధిని నమోదైంది.
కీలక వస్తువుల ద్వారా వృద్ధి
సరకు రవాణాలో ఇప్పటికీ ప్రధాన వాటా కీలక రంగాల వస్తువులదే కొనసాగుతుంది. ఈ నెలలో భారత రైల్వేలు బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, ఎరువులు, సిమెంట్, కంటైనర్ రవాణాను భారీగా చేపట్టాయి. ముఖ్యంగా పూర్తిగా ప్రాసెస్ చేసిన ఉక్కు, ఇనుప ఖనిజం, ఎరువుల వంటి వస్తువుల రవాణాలో నమోదైన వృద్ధి.. మొత్తం సరకు రవాణా పనితీరుపై గణనీయమైన ప్రభావం చూపింది.
ప్రధాన వస్తువుల రవాణాలో పనితీరు ప్రోత్సాహకంగా ఉంది. రోజువారీ సరకు రవాణా గణాంకాల ప్రకారం.. ఇనుప ఖనిజం, పిగ్ ఐరన్, పూర్తిగా ప్రాసెస్ చేసిన ఉక్కు, ఉక్కు కర్మాగారాలకు అవసరమైన ముడి పదార్థాలు (ఇనుప ఖనిజం మినహా), ఎరువులు, మినరల్ ఆయిల్, కంటైనర్ ఎగుమతి, దిగుమతి రవాణా వంటి విభాగాల్లో గతేడాదితో పోలిస్తే గణనీయమైన వృద్ధి నమోదైంది. గతేడాది ఇనుప ఖనిజం రవాణా 0.529 మిలియన్ టన్నులు కాగా, ఈసారి 0.675 మిలియన్ టన్నులకు చేరింది (27.6శాతం). అలాగే పిగ్ ఐరన్, పూర్తిగా ప్రాసెస్ చేసిన ఉక్కు గతేడాది 0.284 మిలియన్ టన్నులు నమోదవగా, ఈఏడాది 0.343 మిలియన్ టన్నులకు చేరుకుంది (20.8శాతం). ఉక్కు కర్మాగారాలకు అవసరమైన ఇతర ముడి సరకు (ఇనుప ఖనిజం మినహా) రవాణా 0.096 మిలియన్ టన్నుల నుంచి 0.141 మిలియన్ టన్నులకు చేరుకుని 46.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎరువుల రవాణా 0.167 మిలియన్ టన్నుల నుంచి 0.184 మిలియన్ టన్నులకు (10.2 శాతం) పెరిగింది. చమురు ఉత్పత్తుల రవాణా 0.146 మిలియన్ టన్నుల నుంచి 0.172 మిలియన్ టన్నుల (17.8శాతం) వృద్ధి నమోదు కాగా, కంటైనర్ ఎగుమతి, దిగుమతి రవాణా 0.213 మిలియన్ టన్నుల నుంచి 0.251 మిలియన్ టన్నులకు (17.8శాతం) చేరింది.
ఫిబ్రవరి నెల మొత్తంలో, గతేడాది ఇదే సమయంతో పోల్చితే పలు వస్తువుల రవాణాలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఎరువుల రవాణా 4.224 మిలియన్ టన్నుల నుంచి 5.396 మిలియన్ టన్నులకు (27.7% వృద్ధి), క్లింకర్ రవాణా 5.421 మిలియన్ టన్నుల నుంచి 6.508 మిలియన్ టన్నులకు (20.1% వృద్ధి), పిగ్ ఐరన్, పూర్తిగా ప్రాసెస్ చేసిన ఉక్కు 5.522 మిలియన్ టన్నుల నుంచి 6.237 మిలియన్ టన్నులకు (12.9% వృద్ధి), ఇనుప ఖనిజం రవాణా 14.925 మిలియన్ టన్నుల నుంచి 16.370 మిలియన్ టన్నులకు (9.7% వృద్ధి) పెరిగింది. కంటైనర్ ఎగుమతి,దిగుమతి రవాణాలో (5.142 మిలియన్ టన్నుల నుంచి 5.6శాతం వృద్ధితో 5.432 మిలియన్ టన్నులకు), కంటైనర్ దేశీయ రవాణాలో (1.970 మిలియన్ టన్నుల నుంచి 2.3శాతం వృద్ధితో 2.015 మిలియన్ టన్నులకు) పెరుగుదల నమోదవటం కీలక పారిశ్రామిక, రవాణా రంగాల్లో నిలకడగా డిమాండ్‌ను సూచిస్తోంది.
భారీ సరకు రవాణాకు రైలు మార్గం అత్యంత తక్కువ ఖర్చుతో, పర్యావరణహితమైనది. ముడి పదార్థాలను, ఉత్పత్తులను సుదూర ప్రాంతాలకు విశ్వసనీయ పద్దతిలో, తక్కువ ఖర్చుతో చేరవేసేందుకు పరిశ్రమలకు ఎంతగానో దోహదపడుతుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం సరకు రవాణా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత రైల్వే సానుకూల వృద్ధిని నమోదు చేసింది.
ఏప్రిల్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు భారత రైల్వేలు 1,503.80 మిలియన్ టన్నుల సరకును రవాణా చేశాయి. గతేడాది ఇదే సమయంలో రవాణా చేసిన 1,456.07 మిలియన్ టన్నులతో పోల్చితే 3.28 శాతం వృద్ధిని నమోదైంది.
ఈ సమయంలో సరకు రవాణా ఆదాయం రూ.1,60,987 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ. 1,58,539.86 కోట్లతో పోల్చితే 1.54% వృద్ధి నమోదైంది.
మొత్తం సరకు రవాణా ఎన్‌టీకేఎంలో లెక్కించినప్పుడు 8,40,000 మిలియన్లుగా నమోదైంది. గతేడాది ఈ సమయంలో 8,26,586 మిలియన్ ఎన్‌టీకేఎంలతో పోల్చితే 1.62% వృద్ధిని సూచిస్తుంది.
ఆర్థిక వృద్ధికి, జాతీయ రవాణాకు మద్దతివ్వటం
భారతీయ రైల్వేల సామర్థ్య పెంపుదల, మెరుగైన టెర్మినల్ మౌలిక సదుపాయాలు, ప్రత్యేక సరకు రవాణా మార్గాలు, డిజిటల్ సరకు రవాణా నిర్వహణ వ్యవస్థల ద్వారా సరకు రవాణాను నిరంతరం బలోపేతం చేస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థల వస్తువులను తక్కువ ఖర్చుతో, మరింత సమర్థవంతంగా రవాణా చేయడంలో ఈ కార్యక్రమాలు సహాయపడుతున్నాయి.
మౌలిక సదుపాయాలు, సరకు రవాణా కార్యకలాపాల్లో నిరంతర పెట్టుబడులతో, రవాణా వ్యవస్థకు వెన్నెముకగా భారత రైల్వే పాత్రను మెరుగుపరుచుకుంటూ దేశ ఆర్థిక వృద్ధికి కట్టుబడి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2236635)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4