నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రీన్ హైడ్రోజన్ ప్రమాణాలు, భద్రతా నియమావళిపై భారత్‌-యూకే సమావేశం.. సురక్షితమైన గ్రీన్ హైడ్రోజన్ విస్తరణకు సహకారం


సురక్షిత గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తును రూపొందించడానికి న్యూఢిల్లీలో విధాన నిర్ణేతలు, పారిశ్రామిక వేత్తలు, సాంకేతిక నిపుణుల ఉన్నతస్థాయి సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 07 MAR 2026 11:01AM by PIB Hyderabad

భారత ప్రభుత్వ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్‌ను సురక్షితంగా వినియోగంలోకి తీసుకురావడంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు 27 ఫిబ్రవరి 2026న న్యూఢిల్లీలో ‘‘గ్రీన్ హైడ్రోజన్ ప్రమాణాలు, భద్రతా నియమావళి’’ పై భారత్-యూకే సదస్సు జరిగింది. ఈ సమావేశంలో భారత్, బ్రిటన్‌ దేశాలకు చెందిన ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రమాణాల సంస్థలు, పరీక్షా కేంద్రాలు, పరిశోధనా సంస్థలు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

భారత్‌లోని బ్రిటిష్ హై కమిషన్, డబ్ల్యూఆర్‌ఐ ఇండియా సహకారంతో జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు మద్దతుగా నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ  పరిధిలో స్థాపించిన జాతీయ హైడ్రోజన్ భద్రతా కేంద్రం (ఎన్‌సీహెచ్‌ఎస్‌) ఈ సమావేశాన్ని నిర్వహించింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, రవాణా, వినియోగం వంటి మొత్తం వ్యవస్థలో పాటించాల్సిన నియంత్రణ విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, భద్రతా నియమావళిపై ఈ సదస్సులో కీలక చర్చలు జరిగాయి.

జాతీయ సౌరశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ మహ్మద్ రిహాన్ ప్రారంభ ఉపన్యాసంతో ఈ సదస్సు మొదలైంది. అనంతరం నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ డైరెక్టర్ అభయ్ బక్రే, భారత్‌లోని బ్రిటిష్ హై కమిషన్ తొలి కార్యదర్శి(వాణిజ్యం) జినూస్ షరియాతి, పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి కార్యదర్శి అంజన్ కుమార్ మిశ్రా, బ్రిటిష్ హై కమిషన్ తొలి కార్యదర్శి (వాతావరణం, శక్తి) లారా అయ్లెట్ ప్రత్యేక ప్రసంగాలు చేశారు.

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం కార్యదర్శి పర్వీందర్ మైని ప్రసంగిస్తూ.. గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికతలను పెద్ద ఎత్తున అమలు చేయడానికి బలమైన భద్రతా చర్యలు, ప్రమాణాల అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం అవసరమని తెలిపారు.

హైడ్రోజన్ భద్రత, ప్రమాణాలకు బాధ్యత వహించే జాతీయ నియంత్రణ సంస్థల భాగస్వామ్యం ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పీఈఎస్‌ఓ), హైడ్రోజన్ వ్యవస్థల భద్రతా నిబంధనల అమలు, ప్రమాద అంచనా, విపత్తు నిర్వహణపై నియంత్రణ దృక్పథాలను పంచుకుంది. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌), అభివృద్ధి చెందుతున్న ప్రమాణాల విధానాలు, భారతీయ హైడ్రోజన్ ప్రమాణాలను అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలతో అనుసంధానించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై వివరణ ఇచ్చింది.

సదస్సులోని సాంకేతిక కార్యక్రమాల్లో పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలకు చెందిన ప్రముఖ నిపుణులు హైడ్రోజన్ వ్యవస్థలో పాటించాల్సిన భద్రతా పద్ధతులపై చర్చలు జరిపారు. భారత ఆటోమొబైల్‌ సంస్థ తయారీదారులు, ఎన్‌టీపీసీ లిమిటెడ్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు, సీఎస్‌ఐఆర్‌-నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ, ఐఐటీ మద్రాస్ వంటి సంస్థల ప్రతినిధులు ఈ చర్చల్లో ప్రసంగించారు. హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, రవాణా వ్యవస్థల సురక్షిత రూపకల్పన, ప్రమాదాల అంచనా పద్ధతులు, గతంలో జరిగిన సంఘటనల విశ్లేషణ, హైడ్రోజన్ భద్రత కోసం ఆధునాతన సెన్సార్ సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణ వంటి అత్యాధునిక ఆవిష్కరణల గురించి  చర్చించారు. విశ్వసనీయమైన, గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికతలను విస్తరించడానికి అవసరమైన ప్రమాణాల అభివృద్ధి, నియంత్రణ సామర్థ్య పెంపు, భద్రతా విధానాల రూపకల్పనలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్-యూకే ఉమ్మడి నిబద్ధతతో ఈ సమావేశం ముగిసింది.

గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికతలను సురక్షితంగా, పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన బలమైన ప్రమాణాలు, నియంత్రణ విధానాలు, భద్రతా నియమావళిని రూపొందించడంలో భారత్-యూకే మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలనే భాగస్వామ్య నిబద్ధతతో ఈ సదస్సు ముగిసింది. ఈ చర్చలు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద కొనసాగుతున్న ప్రయత్నాలకు దోహదపడతాయని, తద్వారా సమగ్రమైన భద్రతా వ్యవస్థను నిర్మించడానికి, దేశంలో విశ్వసనీయమైన, ప్రపంచస్థాయి పోటీనిచ్చే గ్రీన్ హైడ్రోజన్ రంగం వృద్ధి చెందడానికి తోడ్పడతాయని భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2236312) సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil