రక్షణ మంత్రిత్వ శాఖ
నేటి ప్రపంచ అనిశ్చితుల మధ్య ఉనికిని చాటుకోవాలన్నా, సిద్ధంగా ఉండాలన్నా స్వయంసమృద్ధి ఒక్కటే మార్గం: సాగర్ సంకల్ప్ కార్యక్రమంలో రక్షణ మంత్రి
‘‘ఏప్రిల్ 2026 నాటికి రక్షణ ఎగుమతులు సుమారు రూ. 29,000 కోట్లకు చేరుకోనున్న రక్షణ ఎగుమతులు’’
“భారత నావికాదళం సంసిద్ధత, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యల విజయం స్వావలంబన దిశగా వేస్తున్న అడుగులు..
రక్షణ రంగం సరైన దిశలో పయనిస్తోందనేందుకు సూచికలు’’
‘‘నౌకలను సాంకేతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల ఆధునీకరణ ద్వారా
వాటిని ప్రపంచ ప్రమాణాలకు తీసుకురావడమే మా లక్ష్యం”
“2030 నాటికి భారత్‌ను నౌకల నిర్మాణంలో 10 అగ్రగామి దేశాల్లో ఒకటిగా..
2047 నాటికి అగ్రగామి 5 దేశాల్లో ఒకటిగా నిలపడమే ప్రభుత్వం లక్ష్యం”
నాడు పోస్టు చేయడమైనది:
06 MAR 2026 1:08PM by PIB Hyderabad
‘‘ప్రస్తుత అనిశ్చిత కాలంలో మన ఉనికిని చాటుకోవాలన్నా, సిద్ధంగా ఉండాలన్నా స్వయంసమృద్ధి ఒక్కటే మార్గమని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. 2026 మార్చి 06న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ), ఓ ప్రైవేటు మీడియా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ‘‘సాగర్ సంకల్ప్-రీక్లెయిమింగ్ ఇండియాస్ మారిటైమ్ గ్లోరీ’’ రక్షణ, సముద్రయాన సదస్సును రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరఫరా వ్యవస్థల పునర్వ్యవస్థీకరణకు, కొత్త సమీకరణాల ఏర్పాటుకు, సముద్ర కార్యకలాపాల నిరంతర పెరుగుదలకు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు దారితీశాయని, ప్రతి రంగంలో స్వయంసమృద్ధి సాధించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఇది పునరుద్ఘాటిస్తోందని తెలిపారు.
“పాత ఆలోచనలు, పాత ప్రపంచ క్రమం, పాత అభిప్రాయాలు వేగంగా మారుతున్నాయి. ఈ అనిశ్చితులను మనం అర్థం చేసుకోవాలి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులే ఇందుకు ప్రధాన ఉదాహరణ. అక్కడ జరుగుతున్న పరిణామాలు చాలా అసాధారణంగా ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో, మన పొరుగు ప్రాంతాల్లో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పడం కష్టం. హార్ముజ్ జలసంధి, మొత్తం పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ప్రపంచ ఇంధన భద్రతకు అత్యంత కీలకం. ఈ ప్రాంతంలో అశాంతి చమురు, గ్యాస్ సరఫరాపై నేరుగా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఇతర రంగాల్లో కూడా సరఫరాలో అంతరాయాలను మనం చూస్తున్నాం. ఈ అనిశ్చితులు ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వాణిజ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. ప్రపంచ నేడు ఒక అసాధారణ స్థితిలో ఉంది. అంతకంటే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ అసాధారణతే ఇప్పుడు కొత్త సాధారణ స్థితిగా మారుతోంది” అని రక్షణశాఖ మంత్రి అన్నారు.
ప్రస్తుత ప్రపంచంలో ‘‘సాంకేతిక చైతన్యం’’ మరో కీలక అంశమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ప్రతి రంగంలో సాంకేతికత అనేక మార్పులను తీసుకువస్తోందని, ఇది రక్షణ రంగంలో మరింత స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. రక్షణ రంగంలో అత్యాధునిక, ఖచ్చితత్వంతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. కొత్తగా పుట్టుకొస్తున్న, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే రక్షణ సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ, పనితీరు ప్రమాణాలు, పరిశోధనాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, రక్షణ ఉత్పత్తిని గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం అమలు చేసిన నిర్మాణాత్మక, విధానపరమైన సంస్కరణలను రక్షణ మంత్రి వివరించారు. ప్రభుత్వ స్వయంసమృద్ధి దార్శనికతలో రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు కీలకమని పేర్కొన్నారు. నౌకానిర్మాణ రంగంలో దేశీయ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి జీఆర్ఎస్ఈ, ఇతర షిప్‌యార్డులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ‘నౌకలను కేవలం ఉత్పత్తి యూనిట్లుగా మాత్రమే కాకుండా, సాంకేతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. మౌలిక సదుపాయాల ఆధునీకరణ, డిజిటల్ షిప్ డిజైన్ సాధనాలు, మాడ్యులర్ నిర్మాణ పద్ధతులు, సరఫరా విధాన అనుసంధానం ద్వారా వాటిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావడానికి కృషి జరుగుతోంది’’ అని చెప్పారు.
రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. వీటిలో ఎగుమతి-దిగుమతి ప్రక్రియల మెరుగుదల, డీఆర్డీఓ ప్రయోగశాలల అందుబాటు, గ్రీన్ ఛానల్ సర్టిఫికేషన్ సౌకర్యం, రక్షణ కారిడార్ల ఏర్పాటు, డీపీఎస్‌యూల రిజర్వ్డ్ ఆర్డర్లను తెరవడం వంటివి ఉన్నాయి. ఈ చర్యలు కేవలం సహకరించడానికే కాకుండా, ప్రైవేటు రంగం గరిష్ట పనితీరును కనబరిచేలా శక్తిమంతం చేయడానికి ఉద్దేశించినవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సమాన భాగస్వామ్యం ద్వారా దేశాభివృద్ధిని నిర్ధారించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో రూ. 1.50 లక్షల కోట్లను అధిగమించగా, రక్షణ ఎగుమతులు సుమారు రూ. 24,000 కోట్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని చెప్పారు. ఏప్రిల్ 2026 నాటికి రక్షణ ఎగుమతులు సుమారు రూ. 29,000 కోట్లకు చేరుకుంటాయని, 2029-2030 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 50,000 కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
దేశంలో తయారవుతున్న రక్షణ వేదికలు, పరికరాలు, విడిభాగాల్లో ప్రస్తుతం ప్రైవేటు పరిశ్రమలు సుమారు 25 శాతం వాటాను కలిగి ఉన్నాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాబోయే కాలంలో విలువ పరంగా మొత్తం రక్షణ ఉత్పత్తిలో ఈ భాగస్వామ్యం 50 శాతానికి పెరుగుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
భారత నావికాదళం కోసం కొనుగోలు చేసే అన్ని యుద్ధనౌకలు, జలాంతర్గాములను భారతీయ షిప్‌యార్డులలో నిర్మిస్తున్నారని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. రూపకల్పన, ఇంజనీరింగ్, నిర్మాణం నుంచి లైఫ్‌సైకిల్ సపోర్టు (పూర్తి వినియోగ కాల మద్దతు) వరకు అన్న దేశంలోనే జరుగుతున్నాయని చెప్పారు. దీనిని ఆత్మనిర్భరత వైపు ఒక గొప్ప ముందడుగుగా ఆయన అభివర్ణించారు. “ఆత్మనిర్భరత ఇకపై కేవలం ఒక నినాదం మాత్రమే కాదు.. అది ఆచరణాత్మక వాస్తవంగా మారుతోంది. ‘నిర్మిత నౌకాదళం’ అనేది కూడా కేవలం నినాదం కాదు. అది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం” అని ఆయన తెలిపారు.
పెద్ద ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణంలో ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, స్వదేశీ విక్రేతల సహకారాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. యుద్ధనౌక ఉమ్మడి కృషితో రూపొందే ఉత్పత్తి అని, దీనినే కాంగ్లోమరేట్ ఎఫెక్ట్ అని కూడా అంటారని తెలిపారు. ఈ సమష్టి ప్రభావం వల్ల పనిలో సమన్వయం పెరుగుతుందని, సామర్థ్యం మెరుగుపడుతుందని, ప్రమాదం తగ్గుతుందని, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన వివరించారు. భారతదేశ నౌకానిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం అనేక ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టిందని, ఇందులో దీర్ఘకాలిక నిధుల కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు, ఎఫ్ డీఐ నిబంధనలను సరళీకరించడం, పీపీపీ నమూనాను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయని చెప్పారు. మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 కింద ప్రపంచ స్థాయి నౌకానిర్మాణ క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి సుమారు రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రణాళిక చేసినట్లు ఆయన తెలిపారు.
సమన్వయంతో కూడిన ప్రణాళిక, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, సంస్థాగత సమన్వయంతో ముందుకు సాగితేనే దేశ నౌకాయాన సరిహద్దులు సురక్షితంగా, సంపన్నంగా, బలంగా ఉంటాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ‘‘భారత నావికాదళం సంసిద్ధత, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యల విజయం, స్వయంసమృద్ధి దిశగా వేస్తున్న అడుగులు.. భారత్ రక్షణ రంగం సరైన దిశలో పయనిస్తోందని సూచిస్తున్నాయి. ఈ సముద్రయాన దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి మనమందరం కలిసి పనిచేస్తే రాబోయే సంవత్సరాల్లో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవడమే కాకుండా, ప్రపంచ సముద్ర స్థిరత్వానికి గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది. 2030 నాటికి భారత్‌ను ప్రపంచంలోని 10 అగ్రగామి నౌకానిర్మాణ దేశాల్లో ఒకటిగా, 2047 నాటికి 5 అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలపడమే మా లక్ష్యం’’ అని చెబుతూ రక్షణశాఖ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
జీఆర్ఎస్ఈ సీఎండీ, కమోడోర్ పీఆర్ హరి (పదవీ విరమణ) మాట్లాడుతూ.. దేశ చారిత్రక సముద్రయాన వారసత్వాన్ని, స్వదేశీ నౌకానిర్మాణ సామర్థ్య పరిణామాన్ని గురించి ప్రస్తావించారు. ‘‘కొనుగోలు చేసే నౌకాదళం నౌకాదళం నుంచి నిర్మించే నౌకాదళం’’గా మారడం పారిశ్రామిక లోతును పునరుద్ధరించడంలో ఒక నిర్ణయాత్మక మలుపుగా అభివర్ణించారు. 1961లో ఐఎన్ఎస్ అజయ్ పంపిణీ నుంచి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తదుపరి తరం వేదికల వరకు సాగిన ప్రయాణం, సాంకేతిక మార్పునకు, పెరుగుతున్న స్వదేశీకరణకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
దేశ సముద్రయాన భద్రతా నిర్మాణం, నౌకానిర్మాణ వ్యవస్థను బలోపేతం చేయడంపై చర్చించేందుకు ఈ సదస్సు నౌకాదళ ఉన్నతాధికారులను, విధానకర్తలను, పరిశ్రమల భాగస్వాములను ఒక వేదికపైకి చేర్చింది. ఈ సదస్సులో జరిగిన నిపుణుల చర్చలు పలు కీలక అంశాలపై దృష్టి సారించాయి. వాటిలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నౌకానిర్మాణాన్ని సిద్ధం చేయడం, గ్రే-జోన్ ముప్పులు, విస్తృత సముద్ర కార్యకలాపాలను ఎదుర్కోవడం, బలమైన దేశీయ సరఫరా వ్యవస్థ ద్వారా సముద్రంపై సార్వభౌమాధికారాన్ని నిర్మించడం. ప్రపంచ వాణిజ్యం, ఇంధన మార్పు డిమాండ్లను తీర్చడానికి నౌకానిర్మాణ స్థాయిని విస్తరించడం, ప్రగతిశీల ఓడరేవు విధానం, నియంత్రణ సంస్కరణలు, పారిశ్రామిక సహకారం ద్వారా భారత్ ను నౌకానిర్మాణం, నౌకల మరమ్మతు రంగాల్లో ప్రపంచ గమ్యస్థానంగా నిలపడం వంటి అంశాలు ఉన్నాయి.
(రిలీజ్ ఐడి: 2236231)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10