రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలకు చెందిన టోల్ ప్లాజాల్లో 5,100 కన్నా ఎక్కువ మంది మహిళా సిబ్బందిని నియమించిన ఎన్‌హెచ్ఏఐ
ఆ మహిళా సిబ్బందికి, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళా సిబ్బందికి
ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్న ఎన్‌హెచ్ఏఐ
జాతీయ రహదారుల్లోని టోల్ ప్లాజాల్లో మెరుగైన సేవల కోసం
సామాజిక సాధికారితనీ, మహిళలకు అవకాశాల కల్పననీ ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ధ్యేయం
నాడు పోస్టు చేయడమైనది:
06 MAR 2026 3:51PM by PIB Hyderabad
టోల్ కార్యకలాపాల నిర్వహణలో మహిళలకు సాధికారత కల్పననీ, సమ్మిళితత్వాన్నీ ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే వ్యవస్థకు సంబంధించిన 1,140 కన్నా ఎక్కువ టోల్ ప్లాజాల్లో పగటి పూట షిఫ్టులలో 5,100 మందికి పైగా మహిళా సిబ్బందిని ఎన్‌హెచ్ఏఐ నియమించింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి సమర్థమైన, సహానుభూతి పూర్వకమైన, వినియోగదారులకు అనుకూలంగా ఉండే వాతావరణాన్ని ప్రోత్సహిస్తూ, జాతీయ రహదారి ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించడం, జాతీయ రహదారుల టోల్ ప్లాజాల్లో వివాదాలకు ఆస్కారాన్ని తగ్గించడం.. ఇవి ముందు వరుసలోని నిర్వహణ సంబంధిత విధుల్లో కేవలం మహిళా సిబ్బందిని నియమించడంలో ప్రధానోద్దేశాలుగా ఉన్నాయి.
టోల్ ప్లాజా నిర్వాహకులు, నేషనల్ హైవేస్ బిల్డర్ ఫెడరేషన్ (ఎన్‌హెచ్‌బీఎఫ్), హైవే ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఓఏఐ)తో పాటు ఆలిండియా యూజర్ ఫీ కాంట్రాక్టర్స్ ఫెడరేషన్ (ఏఐయూసీఎఫ్) వంటి కీలక పరిశ్రమ సంఘాలు సహా వివిధ ఆసక్తిదారులతో సంప్రదింపుల్నీ, చర్చల్నీ జరిపిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. టోల్ ప్లాజాల్లో వినియోగదారుల నుంచి రుసుమును వసూలు చేయడానికి పగటి షిఫ్టులో మహిళా సిబ్బందిని నియమించడానికి టోల్ ఆపరేటర్లంతా సమ్మతిని తెలియజేశారు. 5,100 కన్నా ఎక్కువ మహిళా టోల్ సిబ్బందిని ఇప్పటికే నియమించారు. త్వరలో మరింత మంది కూడా చేరే అవకాశం ఉంది.
నిర్దేశిత నియమాల ఆచరణను నిర్ధరించడానికి ఈ కార్యక్రమం అమలు తీరును ఎన్‌హెచ్ఏఐ నిశితంగా పర్యవేక్షిస్తుంది. ఈ కార్యక్రమం మహిళలకు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లోనూ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనూ ఉద్యోగావకాశాల్ని కల్పించడంలో సాయపడుతుంది. దీంతో పాటు, జాతీయ రహదారులకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన రంగంలో వారు పాలుపంచుకోవడాన్ని బలోపేతం చేయడమే కాక, ఈ దూర ప్రాంతాలలో ఉపాధి కల్పనకు తోడ్పడుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా, విధుల్లో నియమించిన మహిళా సిబ్బందికి మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు కూడా ఎన్‌హెచ్ఏఐ తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఈ శిక్షణలో.. జాతీయ రహదారులను ఉపయోగించుకొనే వారితో వినమ్రంగా వ్యవహరించడం, అత్యవసర స్థితుల్ని సమర్థంగా ఎదుర్కోవడం, ప్రాథమిక భద్రతా ప్రోటోకాల్స్ పట్ల అవగాహన కలిగించడంతో పాటు టోల్ ప్లాజాను సమర్థంగా నిర్వహించడంపై దృష్టిని కేంద్రీకరిస్తారు. సామర్థ్యాల పెంపుదల దిశగా చేపట్టిన ఈ వ్యవస్థీకృత ప్రయత్నం సురక్షితమైన, వృత్తికుశలతతో కూడిన పని పరిస్థితుల్ని ఏర్పరుస్తూ, సేవల నాణ్యతను పెంచడంలో కూడా తోడ్పడనుంది.
ముందువరుసలో నిలబడి పూర్తి చేయాల్సిన పనుల్లో మహిళల ప్రమేయాన్ని మరింతగా ప్రోత్సహించడం ద్వారా సామాజిక సాధికారతతో పాటు మహిళలకూ అవకాశాల కల్పనని పెంపొందింప చేస్తూనే, దేశమంతటా జాతీయ రహదారుల టోల్ ప్లాజాల్లో సేవల లభ్యతను మెరుగుపరచాలని ఎన్‌హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2236230)
సందర్శకుల సూచీ సంఖ్య : : 63