వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అర్థవంతమైన పుట్టినరోజు వేడుక: 5 ప్రధాన ప్రజాసంక్షేమ కార్యక్రమాల్ని ప్రకటించిన శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్


‘ఉపహార్ నహీ, ఉపకార్’: శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ పుట్టిన రోజున వేలాది మొక్కల పెంపకానికి శుభారంభం

యువతను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఉచితంగా ‘మామ కోచింగ్ క్లాసుల’ ప్రారంభం

ప్రతిభావంతులైన విద్యార్థులను గౌరవించడానికి ‘ప్రేం-సుందర్ ప్రతిభా సమ్మాన్’

విదిశ నలుమూలలా గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణను అందించే ఉద్దేశంతో ‘మామ మొబైల్ హాస్పిటల్’

దివ్యాంగ పౌరులకు సాధికారిత కల్పన లక్ష్యంతో మోటరైజ్డ్ ట్రై సైకిళ్లు

బలమైన సమాజానికి అయిదు సంకల్పాలు: సామాజిక సద్భావన, స్వదేశీ, పౌర బాధ్యత

శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ పుట్టిన రోజున మొక్కలు నాటిన వేలాది ‘శివ్ వృక్ష్ మిత్ర’లు

నాడు పోస్టు చేయడమైనది: 05 MAR 2026 5:44PM by PIB Hyderabad

భోపాల్:  కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ గురువారం తన పుట్టిన రోజును ‘ప్రేమ, సేవా సంకల్ప్ దివస్’గా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా, ఆయన తన కుటుంబంతో కలిసి భోపాల్‌లోని స్మార్ట్ సిటీ పార్కులో మొక్కలను నాటడంతో పాటు తన పార్లమెంటరీ నియోజకవర్గమైన విదిశలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రకటించారు. ఆయన తన జన్మదినాని కన్నా ముందుగానే, ప్రజలు తనకు పూలూ, దండలూ తీసుకు రావద్దనీ, ప్రకటనలూ, బ్యానర్లూ ఏర్పాటు చేయొద్దనీ, వాటికి బదులు కనీసం ఒక్క మొక్కనైనా నాటి ‘ఉపహార్ నహీ, ఉపకార్’ (ఈ హిందీ మాటలకు.. బహుమతులు వద్దు, ఉపకారం చేయండి అని అర్థం) సందేశాన్ని ఆచరణలో పెట్టాలనీ విన్నవించారు. ఈ విన్నపానికి వేలాది శ్రేయోభిలాషులు ప్రతిస్పందించి, దేశవ్యాప్తంగా మొక్కలను నాటడంతో పాటు మంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు కూడా పంచుకున్నారు.


image.png
 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు తమ శుభాకాంక్షలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. వారిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబీన్, రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తదితరులు ఉన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్వ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌లతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌కు శుభాకాంక్షలు తెలిపి, దీర్ఘాయుష్షు కలగాలని అభిలషించారు.
వృక్షాలు ప్రాణవాయువు కర్మాగారాలు
తాను ఇచ్చిన అత్యంత ముఖ్య వాగ్దానాల్లో పర్యావరణాన్ని పరిరక్షించడం ఒకటని శ్రీ చౌహాన్ అన్నారు. మొక్కలు ప్రాణాధారం, అవి ‘ఆక్సిజన్ ఫ్యాక్టరీలు’ అని ఆయన వర్ణించారు. వృక్షాలు మనిషి ప్రాణాన్ని నిలబెట్టడమే కాకుండా ఇతర అసంఖ్యాక ప్రాణులకీ కీలకంగా నిలుస్తాయని ఆయన చెప్పారు. పక్షులకీ, కీటకాలకీ, ఇంకా మరెన్నో జాతులకీ చెట్లు ఆశ్రయాన్నీ, ఆహారాన్నీ అందిస్తాయనీ, వ్యవసాయానికి కీలకమైన వర్షపాతాన్ని ఆకర్షిస్తాయనీ, భూమి కోతకు గురి కాకుండా చూస్తాయనీ, కర్బన ఉద్గారాలని తగ్గిస్తాయనీ, భూమి ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడంలో సాయపడతాయనీ ఆయన వివరించారు.


image.png
 


తల్లితండ్రుల స్మృతిలో ‘ప్రేం-సుందర్ ప్రతిభా సమ్మాన్’
శ్రీ చౌహాన్ తన తల్లితండ్రులకు నివాళులు అర్పిస్తూ, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘ప్రేం-సుందర్ ప్రతిభా సమ్మాన్’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, విదిశ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ 10వ, 12వ తరగతుల పరీక్షల్లో అసాధారణ స్థాయి ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానిస్తారు. అగ్రగాములుగా నిలిచిన వారికి రూ.51,000, రూ. 31,000, రూ.21,000 నగదు బహుమతులను ఇస్తారు. పూర్తి నియోజకవర్గంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచే విద్యార్థులకు ప్రత్యేక పురస్కారాలను కూడా అందిస్తారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతిభ కలిగిన ఏ విద్యార్థీ నిధుల లేమితో వెనుకబడిపోకుండా చూడడమేనని శ్రీ చౌహాన్ తెలిపారు.


image.png

 


యువత కోసం ‘మామ కోచింగ్ క్లాసులు’
పోటీ పరీక్షలు రాయడానికి సన్నద్ధమయ్యే యువతకు అండగా ‘మామ కోచింగ్ క్లాసుల’ పథకాన్ని శ్రీ చౌహాన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విదిశ, రాయ్‌సేన్, భౌరుండా‌లలో మొదలుపెడతారు. దీన్లో భాగంగా బ్యాంకింగ్, ఎస్ఎస్‌సీ, ఎంపీపీఎస్‌సీ, డీఆర్‌డీఓతో పాటు ఫారెస్ట్ సర్వీసుల వంటి పరీక్షల కోసం ఉచితంగా కోచింగును అందిస్తారు.  ఈ ప్రాంతంలో ప్రతిభావంతులైన యువతీయువకులు నిధుల లేమి కారణంగా అవకాశాల్ని చేజార్చుకోకుండా చూడటమే ఈ కార్యక్రమం ధ్యేయమని శ్రీ చౌహాన్ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ లక్ష్యంతో ‘మామ మొబైల్ హాస్పిటల్’
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే ఉద్దేశంతో ‘మామ సంచార ఆసుపత్రి’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా శ్రీ చౌహాన్ ప్రకటించారు. ఈ సంచార వైద్య యూనిట్లు విదిశ నియోజకవర్గంలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పనిచేస్తాయి. ఇవి అర్హత కలిగిన వైద్యులతో సహా గ్రామాలకీ, దూర ప్రాంతాల్లోని జనావాసాలకీ చేరుకొని, ఉచిత వైద్య సలహాలు, చికిత్స, రోగనిర్ధారణ సదుపాయాలను సమకూరుస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఎంపీ స్థానికాభివృద్ధి నిధితో పాటు ప్రజల సహకారంతో నిర్వహిస్తారు.  
దివ్యాంగజనులకు మోటారైజ్డ్ ట్రైసైకిళ్లు
సమాజంలో అన్ని వర్గాల వారినీ కలుపుకొని ముందుకు సాగాలన్న తన నిబద్ధతలో భాగంగా శ్రీ చౌహాన్ విదిశ ప్రాంతంలోని దివ్యాంగులకు మోటారుతో నడిచే మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేసేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించి, వారికి ఈ  త్రిచక్ర వాహనాలను అందించి వారు స్వతంత్రంగా ప్రయాణించేటట్లుగాను, ఇతరులపైన ఆధారపడనక్కరలేకుండానే తమ రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేసుకొనేటట్లుగాను చూసి, వారు ఆత్మగౌరవంతో హుందాగా జీవించేలా సాయపడతారు.
సద్భావనయుక్త, బాధ్యతాయుత సమాజాన్ని నిర్మిద్దామంటూ పిలుపు నిచ్చిన మంత్రి
సామాజిక సద్భావన, కుటుంబ ఏకత, స్వదేశీ ఉత్పాదనలకు ప్రోత్సాహంతో పాటు పౌరులుగా బాధ్యత కలిగి నడుచుకోవాలంటూ శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. సమాజంలో వివక్షకు చోటీయకూడదనీ, ప్రేమ, సోదరభావం, ఒకరంటే మరొకరికి పరస్పర గౌరవ భావన నెలకొనాలని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేస్తూ స్థానిక చేతివృత్తుల కళాకారులకూ, వ్యాపారస్తులకూ అండదండలు అందించాలనీ, హెల్మెట్లను ధరించి భద్రతా నియమాలను పాటిస్తూ పౌరులుగా బాధ్యతాయుతంగా నడుచుకోవాలనీ ఆయన కోరారు.
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలనీ, సద్భావనయుక్త, బాధ్యతాయుత, సమృద్ధి సహిత సమాజాన్ని ఏర్పరిచే దిశగా తోడ్పడాల్సిందిగా పౌరులకు విన్నపం చేస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2235899) సందర్శకుల సూచీ సంఖ్య : : 50
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Hindi_MP , Punjabi , Gujarati , Kannada