|
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా గగనతల పరిస్థితి: పౌర విమానయాన మంత్రిత్వశాఖ కార్యకలాపాల తాజా సమాచారం
నాడు పోస్టు చేయడమైనది:
03 MAR 2026 10:03PM by PIB Hyderabad
పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాల్లో మారుతున్న గగనతల పరిణామాలను, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలపై దాని ప్రభావాన్ని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా భారత విమానయాన సంస్థలు 1,221, విదేశీ విమానయాన సంస్థలు 388 వంతున విమానాలను రద్దుచేశాయి.
నిషేధిత గగనతలాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత విమానయాన సంస్థలు దూర, సుదూర విమానయాన కార్యకలాపాలను క్రమేణా పునరుద్ధరిస్తూ, తమ షెడ్యూళ్లలో క్రమబద్ధ మార్పుచేర్పులు చేపట్టాయి.
ముఖ్యంగా విమానాశ్రయాల్లో, కొన్ని కీలక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు మంత్రిత్వశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీనికి అనుగుణంగా విమానయాన సంస్థలు అవసరమైన మేరకు అదనపు సామర్థ్యాన్ని వినియోగిస్తాయి. ఇందులో భాగంగా ప్రయాణికుల సురక్షిత, క్రమబద్ధ తరలింపుపై విదేశాల్లోని అంతర్జాతీయ విమానయాన సంస్థలు, భారత దౌత్య కార్యాలయాలతో సన్నిహిత సమన్వయం చేసుకుంటాయి. ఈ మేరకు భారత విమానయాన సంస్థలు ఇవాళ మొత్తం 24 విమానాలను నడుపుతుండగా- మరోవైపు ఎమిరేట్స్, ఎతిహాద్ సంస్థలు గత 24 గంటల్లో గల్ఫ్ దేశాల నుంచి 9 విమానాలను నడిపాయి.
ఇక భారత విమానయాన సంస్థలు మార్చి 4న మొత్తం 58 విమానాలను నడిపేందుకు ప్రణాళిక సిద్ధః చేశాయి. వీటిలో ఇండిగో 30, ఎయిర్ ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు 23 వంతున విమానాలను నడుపుతాయి. అదేవిధంగా భారత్, గల్ఫ్ ప్రాంతం మధ్య విమానాలు నడిపే విదేశీ సంస్థలు తమ కార్యాచరణతోపాటు గగనతల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ పరిమిత స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
ప్రయాణిక భద్రత అత్యంత ప్రధానమైనది కాబట్టి, అన్ని విమానయాన సంస్థలు వారితో పారదర్శక చర్చలు చేపట్టాలని మంత్రిత్వశాఖ సూచించింది. అలాగే వాపసు, రీషెడ్యూల్, ప్రయాణికులకు చేయూతపై నియంత్రణ సంస్థల నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేసింది.
విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు కొనసాగించడంతోపాటు ఈ విపత్కర పరిస్థితిలో విచక్షణ రహిత టికెట్ ధరల పెంపు నివారణ దిశగా విమాన ఛార్జీలను నిశితంగా పర్యవేక్షిస్తోంది.
విమానాశ్రయానికి బయల్దేరే ముందే సంబంధిత సంస్థలతో తాజా స్థితిని నేరుగా వాకబు చేసుకోవాల్సిందిగా ప్రయాణికులకు సూచించింది. అలాగే, తాజా సమాచారం కోసం అధికారిక వనరులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. సురక్షిత కార్యకలాపాలు, సేవలను క్రమబద్ధంగా పునరుద్ధరిస్తూ, ప్రభావిత ప్రాంతాల్లోని ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంపై శ్రద్ధ వహిస్తోంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖతోపాటు విమానయాన సంస్థలు, విమానాశ్రయాల నిర్వాహకులు, నియంత్రణాధికారులతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.
పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారం జారీ చేస్తామని ప్రకటించింది.
***
(రిలీజ్ ఐడి: 2235260)
|