శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారత్–డెలావేర్ బయోమాన్యుఫ్యాక్చరింగ్ వర్కింగ్ గ్రూప్‌ను ప్రతిపాదించిన డాక్టర్ జితేంద్ర సింగ్
డెలావేర్ సాంకేతిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు స్టార్టప్, పరిశోధన, అభివృద్ధి అనుసంధానాలను ప్రతిపాదించిన భారత్
భారత్-అమెరికా బయోటెక్ చర్చల్లో సరాఫరా వ్యవస్థ, నియంత్రణ సహకారంపై మంత్రి కీలక వ్యాఖ్యలు
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2026 4:01PM by PIB Hyderabad
భారత్-అమెరికా సంబంధాల్లో భాగంగా అధునాతన బయో-మాన్యుఫ్యాక్చరింగ్ (జీవ ఉత్పత్తి) రంగంలో భారత్-డెలావేర్ భాగస్వామ్యాన్ని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోమవారం పిలుపునిచ్చారు. పరిశోధన, తయారీ, స్టార్టప్ వ్యవస్థల్లో చర్చలను ఆచరణాత్మక సహకారంగా మార్చేందుకు ఒక చిన్న వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
సేవా తీర్థ లో డెలావేర్ గవర్నర్ మాట్ మేయర్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందంతో భేటీ అయిన సందర్భంగా ఈ ప్రతిపాదన వచ్చింది. ఔషధ రంగం, బయోటెక్నాలజీ, స్వచ్ఛ ఇంధనం, ఆవిష్కరణల ఆధారిత పారిశ్రామిక వృద్ధిలో ద్వైపాక్షిక సహకారంపై ఇరు వర్గాలు దృష్టి సారించాయి.
భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో శాస్త్ర, సాంకేతిక, బయోటెక్నాలజీ కీలకమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. బలమైన ఆవిష్కరణ వ్యవస్థలు కలిగిన అమెరికా రాష్ట్రాలతో లోతైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి భారత్ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోందని ఆయన అన్నారు. పరిశోధన, అభివృద్ధి నుంచి భారీ స్థాయి, తక్కువ ఖర్చుతో కూడిన తయారీ వరకు... బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా భారత్ ఎదుగుతోందని తెలిపారు.
ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, అంకుర సంస్థలను అనుసంధానించే దేశ సమగ్ర ఆవిష్కరణా వ్యవస్థ గురించి కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 37 ప్రయోగశాలలు, 7,500 కంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలతో కూడిన శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) దేశంలోని పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి ప్రయత్నాలకు వెన్నెముకగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్, క్వాంటం టెక్నాలజీస్ నుంచి బయోసైన్సెస్, బయోఫార్మా వరకు వివిధ జాతీయ కార్యక్రమాల్లో సీఎస్ఐఆర్ పోషిస్తున్న పాత్రను, కీలకమైన ఔషధాల తయారీ ప్రక్రియలో అందిస్తున్న సహకారాన్ని ఆయన గుర్తుచేశారు.
బయో-ఫార్మాస్యూటికల్స్ తయారీలో ఆవిష్కరణల కోసం జాతీయ సంస్థ (ఎన్ఐఐఎంబీఎల్)తో సహా డెలావేర్ బయో-సైన్స్ వ్యవస్థను ప్రస్తావిస్తూ.. ఆధునాతన బయో మాన్యుఫ్యాక్చరింగ్, కృత్రిమ మేధ ఆధారిత ప్రక్రియలు, వేగవంతమైన భారీ స్థాయి సాంకేతికతలు, భవిష్యత్తు బయోలాజికల్స్, వ్యాక్సిన్ల తయారీలో సహకారానికి బలమైన అవకాశం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన తయారీలో భారత్ సామర్థ్యం, అమెరికాలోని ప్రధాన మందుల తయారీ కంపెనీలకు డెలావేర్ దగ్గరగా ఉండటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరకే లభించే బయోలాజిక్స్, బయోసిమిలర్స్, వ్యాక్సిన్లను కలిసి అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు.
సహకారానికి సంబంధించిన నిర్దిష్ట మార్గాలను కూడా కేంద్రమంత్రి వివరించారు. వాటిలో ఉమ్మడి ఆధునాత బయో-మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాట్‌ఫామ్‌లు, భారతీయ సంస్థలు, డెలావేర్ పరిశోధనా కేంద్రాలను అనుసంధానించే అనువాద పరిశోధన సంస్థలు, అంకుర సంస్థలు, ఇంక్యుబేషన్ అనుసంధానాలను కేంద్రమంత్రి ప్రతిపాదించారు. అలాగే జీఎంపీ తయారీ విధానాలు, నియంత్రణ శాస్త్ర నాణ్యత ప్రమాణాల వ్యవస్థలలో శ్రామిక శక్తికి ఉమ్మడి శిక్షణ అందించడం వంటి అంశాలను ప్రస్తావించారు. నియంత్రణ శాస్త్రంలో సహకారం, ప్రమాణాల ఏకీకరణ సమన్వయం, కీలకమైన బయో ఫార్మాస్యూటికల్ ముడి పదార్థాల కోసం పటిష్టమైన సరఫరా వ్యవస్థను నిర్మించడం వంటివి మరో ప్రాధాన్యతా రంగంగా గుర్తించారు.
ఈ భేటీ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నేరుగా వివిధ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో సుమారు 150 ఇంక్యుబేటర్లకు మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. ప్రైవేటు రంగం, డీప్-టెక్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రూ.1 లక్ష కోట్ల పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణల నిధిని ఏర్పాటు చేసిందని తెలిపారు. డెలావేర్ రాష్ట్రంలోని పరిశోధన, తయారీ, స్టార్టప్ వ్యవస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ వేదికలను ఉపయోగించుకోవచ్చని అన్నారు.
గవర్నర్ మేయర్ మాట్లాడుతూ.. డెలావేర్ రాష్ట్రానికి సుదీర్ఘమైన శాస్త్ర, పారిశ్రామిక వారసత్వం ఉందని వివరించారు. అక్కడి బయో ఫార్మాస్యూటికల్ తయారీ కేంద్రాన్ని, విస్తరిస్తున్న ఓడరేవు మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం గురించి ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక వేత్తలతో కూడిన ప్రతినిధి బృందంలోని సభ్యులు స్వచ్ఛ హైడ్రోజన్, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ ఇంక్యుబేషన్, కార్పొరేట్ సంస్థల నమోదు విధానాలపై చర్చించారు.
ఉమ్మడి పరిశోధనలు, అంకుర సంస్థల మార్పిడి, సంస్థాగత భాగస్వామ్యాల వంటి అంశాలను ఆచరణాత్మక కార్యక్రమాలుగా మార్చడానికి ఒక వ్యవస్థీకృత వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఇరుపక్షాలు అంగీకరిస్తూ సమావేశాన్ని ముగించారు. భారత్, అమెరికా మధ్య ఉన్న విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ భేటీ ఒక రాష్ట్ర స్థాయి ప్రమాణాన్ని అందించింది. భవిష్యత్తు సహకారం కోసం బయోటెక్నాలజీ, అధునాతన తయారీ రంగాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా అవతరించాయి.
***
(రిలీజ్ ఐడి: 2234680)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3