ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
'సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ 2.0’ విజేతలను మొత్తం రూ.6.85 కోట్ల బహుమతులతో సత్కరించిన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, డీఎస్‌సీఐ
నాడు పోస్టు చేయడమైనది:
26 FEB 2026 3:19PM by PIB Hyderabad
'సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ 2.0’ (సీఎస్‌జీసీ 2.0) విజేతలను ఇవాళ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత (ఎంఈఐటీవై) కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్ సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఇండియా డేటా సెక్యూరిటీ కౌన్సిల్ (డీఎస్‌సీఐ) సహకారంతో ఎంఈఐటీవై నిర్వహించింది. జాతీయ సైబర్ భద్రతా సామర్థ్యాన్ని బలోపేతం చేయటం, కీలక సాంకేతిక రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించటం ద్వారా సురక్షితమైన, పటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థకు మద్దతివ్వటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
మొత్తం రూ.6.85 కోట్లను బహుమతిగా అందించిన సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ 2.0 దేశంలోనే అత్యంత కీలకమైనది. ప్రభుత్వ మద్దతుతో సైబర్ సెక్యూరిటీ ఇన్నోవేషన్ ఛాలెంజిలలో ఇది ఒకటిగా నిలిచింది. సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ 2.0 విజేతలకు ట్రోఫీలతో పాటు కోటి రూపాయల నగదు బహుమతిని.. మొదటి, రెండో రన్నరప్‌లకు రూ.50 లక్షలు, రూ.25 లక్షల చొప్పున అందించారు.
విజేతలు, వారు పరిష్కరించిన సమస్యల వివరాలు:
|
|
అంకుర సంస్థ
|
పరిష్కరించిన సమస్య
|
|
విజేత
|
కేంబ్రియాన్ స్కిల్‌దా టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎల్ఎల్‌పీ (సీఎస్‌టీసీఎస్)
|
భవిష్యత్ తరం బయోమెట్రిక్ వ్యవస్థల భద్రత
|
|
మొదటి రన్నరప్
|
క్రిప్సిస్
|
క్లోన్, నకిలీ
యాప్‌ల నియంత్రణ
|
|
రెండో రన్నరప్
|
జిరిజ్.ఏఐ
|
ఏపీఐ సెక్యూరిటీ
|
జనవరి 2025లో మైగవ్ వేదిక ద్వారా ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్.. దేశంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను ప్రోత్సహించటంలో ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆరు కీలక రంగాలైన.. ఏపీఐ భద్రత, డేటా సెక్యూరిటీ, వేరబుల్ డివైస్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, క్లోన్.. నకిలీ యాప్‌లను తగ్గించటం, ప్రమాదాన్ని గుర్తించటం, తక్షణ స్పందనకు ఏఐ, భవిష్యత్ తరం బయోమెట్రిక్ వ్యవస్థల భద్రత వంటి వాటిల్లో నూతన ఆవిష్కరణలను ఇది ప్రోత్సహిస్తుంది. అంకుర సంస్థలు రూపొందించిన పరిష్కారాల మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్) సంబంధిత కంపెనీలకు చెందటం ఈ కార్యక్రమం ప్రత్యేకత.
నాలుగు దశల్లో నిర్వహించిన ఈ పోటీలోని ప్రతి స్థాయిలో ప్రగతిశీల మూల్యాంకనం, ఆర్థిక సహకారం అందించారు. ప్రతి సమస్య పరిష్కారానికి ఆరుగురు చొప్పున, మొత్తం 36 అంకుర సంస్థలను ఎంపిక చేశారు. ఎంపికైన అంకుర సంస్థలు పరిష్కారాలను మెరుగుపరచుకునేందుకు, అభివృద్ధి చేయటానికి ఒక్కో సంస్థకు రూ.5 లక్షల గ్రాంట్‌ను అందించారు. కనీసం ఆమోదించదగిన దశలో ఈ అంకుర సంస్థలు క్రియాత్మక నమూనాలను తయారు చేయటానికి అవసరమైన సాంకేతిక, వాణిజ్య మార్గదర్శకత్వాన్ని పొందాయి. ప్రతి సమస్య పరిష్కారానికి ముగ్గురి చొప్పున 18 అంకుర సంస్థలు తుది దశకు చేరుకున్నాయి. విజేత అంకుర సంస్థలకు ఒక్కొక్కటికీ రూ.10 లక్షల చొప్పున అందించారు. ఈ దశలో పరిష్కారాలను పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాత ఐదు అంకుర సంస్థలను ఎంపిక చేసి ఒక్కోదానికి రూ.25 లక్షల చొప్పున అందించారు. చివరగా గో-టు-మార్కెట్ దశలో వాణిజ్య సంసిద్ధత, విస్తరణ, మార్కెట్ అవకాశాలను అంచనా వేసి, మూడు అంకుర సంస్థలను తుది విజేతలుగా ప్రకటించారు. పోటీలో పాల్గొన్న స్టార్టప్‌లు ఉత్పత్తిని మెరుగుపరచుకోవటానికి, వినియోగ సామర్థ్యాన్ని, మార్కెట్ సంసిద్ధతను పెంపొందించుకోవటానికి నిరంతర సాంకేతిక, వాణిజ్య మార్గదర్శకత్వాన్ని పొందాయి.
ఎంఈఐటీవై కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్ మాట్లాడుతూ.. "దేశంలో బలమైన స్వదేశీ భద్రత సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ 2.0 కీలక ముందడుగు. దేశీయ నైపుణ్యం అత్యంత అవసరమైన రంగాల్లో సైబర్ సెక్యూరిటీ ఒకటి. సైబర్ భద్రతలో స్వదేశీ సాంకేతికత కీలకమైనది. నిరంతరం మారుతున్న సాంకేతికతతో భద్రతాపరమైన సవాళ్లు ఎదుర్కోవటం వాస్తవం. కాబట్టి దేశీయ వ్యవస్థతో అభివృద్ధి చేసిన పరిష్కారాలతో మనం సిద్ధంగా ఉండాలి. కచ్చితమైన మూల్యాంకన ప్రక్రియ ద్వారా ఈ ఛాలెంజ్‌ను నిర్వహించారు. ఇందులో విద్యార్థుల నేతృత్వంలోని బృందాలు, అంకుర సంస్థలు, మహిళా పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున పాల్గోవటం ప్రోత్సాహకరంగా ఉంది. ఈ పోటీలో రూపొందించిన సమస్య పరిష్కారాలు నేటి డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థకు సముచితంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీఐల వంటి విధానాల ద్వారా డేటా షేరింగ్ పెరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన డేటా రక్షణ, భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. శాశ్వత ప్రాతిపదికన దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవటానికి ఈ కార‌్యక్రమం గొప్ప అవకాశం. ఈ వేగాన్ని మున్ముందు కూడా కొనసాగించాలి. సైబర్ సెక్యూరిటీ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించటానికి, నిరంతర సహకారం ద్వారా సంస్థాగత, వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయటానికి ఎంఈఐటీవై కట్టుబడి ఉంది" అని పేర్కొన్నారు.
ఈ పోటీకి సంబంధించి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: https://innovateindia.mygov.in/cyber-security-grand-challenge/
***
(రిలీజ్ ఐడి: 2233277)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9