రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వాగ్దానాలతో కాదు... రుజువులతో రహదారుల నిర్మాణం: రహదారి నాణ్యతను నిర్ధారించే కొత్త సాంకేతికత
నాడు పోస్టు చేయడమైనది:
23 FEB 2026 6:32PM by PIB Hyderabad
దేశంలోని రహదారులు మాటల ద్వారా కాకుండా డేటా, డయాగ్నస్టిక్స్, నిర్ణయాత్మక చర్యల ద్వారా మాట్లాడగలిగితే ఎలా ఉంటుంది? దేశంలో అపూర్వ స్థాయిలో రహదారుల నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు నెట్‌వర్క్‌లను విస్తరించడం నుంచి ప్రపంచ స్థాయి నాణ్యత, భద్రత, విశ్వసనీయతను నిర్ధారించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
మొబైల్ నాణ్యతా నియంత్రణ వాహనాలను ఉపయోగించి జాతీయ రహదారుల నిర్మాణ నాణ్యతను నిశితంగా పర్యవేక్షించేందుకు రహదారుల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ పైలట్ ప్రాజెక్టును రాజస్థాన్, గుజరాత్, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.
లక్ష్యం సరళమైనది, ప్రత్యేక దృష్టి సారించేది
కొనసాగుతున్న జాతీయ రహదారుల పనుల నాణ్యతను త్వరగా నిర్ధారించడానికి ఈ మొబైల్ నాణ్యతా నియంత్రణ వాహనాలను ఉపయోగిస్తారు. ప్రతి మొబైల్ వాహనం ఆన్-ది-మూవ్ ప్రయోగశాలగా పనిచేస్తుంది. పూర్తిగా నాన్-డిస్ట్రక్టివ్ పరీక్షా పరికరాలతో వీటిని సిద్ధం చేశారు. ఈ వాహనంలో అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ మీటర్లు, రీబౌండ్ హామర్లు, తారు సాంద్రత మాపకాలు, రిఫ్లెక్టోమీటర్లు మొదలైన పరికరాలు ఉన్నాయి.
మొబైల్ నాణ్యతా నియంత్రణ వాహనాలు: ప్రయోగశాలనే జాతీయరహదారి వద్దకు తీసుకెళ్లడం
ఎంక్యూసీవీలు ప్రధానంగా నిర్మాణానికి ఎలాంటి హాని కలగకుండా నాణ్యతను తనిఖీ చేయడానికి అనుమతించే అధునాతన నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్ సాధనాల సూట్‌ను కలిగి ఉంటాయి.
రీబౌండ్ హామర్స్: ఉపరితలం గట్టిదనాన్ని అంచనా వేయడానికి, సైట్‌లో గట్టిపడిన కాంక్రీట్ నిర్మాణాల బలాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్షను ఉపయోగిస్తారు.
అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ మీటర్: ఇది కాంక్రీటు ద్వారా ధ్వని తరంగాలను పంపుతుంది. తద్వారా కనిపించకుండా ఉన్న పగుళ్లు, ఖాళీలు, అసమానతలను వెల్లడిస్తుంది.
తారు సాంద్రత మాపకాలు: ఇవి పోర్టబుల్ పరికరాలు. ఇవి సరైన మోతాదులో ఆస్ఫాల్ట్‌ను వినియోగిస్తూ రహదారి తలం ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండేలా నిర్మిస్తున్నట్లు నిర్ధారించడానికి వేగవంతమైన, ఆన్-సైట్ నాన్-న్యూక్లియర్ పరీక్షకు అనుమతిస్తాయి.
తేలికైన డిఫ్లెక్టోమీటర్: ఇది జాతీయ రహదారుల దీర్ఘకాలిక మన్నికను పరిశీలిస్తూ సరిపడా మట్టి, కంకర మిశ్రమంతో స్థిరమైన సబ్-బేస్‌ను నిర్మించారని నిర్ధారించడానికి ఈ సబ్-బేస్ సాంద్రతను అంచనా వేయడంలో సహాయపడుతుంది.
రిఫ్లెక్టోమీటర్లు: ఇది రహదారి చిహ్నాలు, గుర్తులు స్పష్టంగా కనిపించేలా ఉన్నాయా అనే అంశాన్ని అంచనా వేస్తుంది. వాటిని వాహనదారులు పగలు, రాత్రి వేళలో స్పష్టంగా గుర్తించగలిగేలా ఉండేలా నిర్ధారిస్తుంది.
ఈ సాంకేతికతలన్నీ కలిసి భారత రహదారులపై నాణ్యత నియంత్రణను రియాక్టివ్ ప్రక్రియ నుంచి భద్రత, మన్నిక, విశ్వసనీయతలకు భరోసానిచ్చే చురుకైన, ఆన్-సైట్ నిర్ధారణ ప్రక్రియగా మారుస్తాయి.
పరీక్ష ఫలితాలను మంత్రిత్వ శాఖ తన క్షేత్రస్థాయి కార్యాలయాలతో పంచుకుంటుంది. ఏవైనా నాణ్యత లోపాలు కనుగొన్నప్పుడు క్షేత్రస్థాయి కార్యాలయం తగిన చర్యలు తీసుకుంటుంది. పైలట్ ప్రాజెక్ట్ దాని తదుపరి దశలోకి అడుగుపెడుతున్న సందర్భంలో మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల నాణ్యత పర్యవేక్షణ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది ఈ వాహనాల ద్వారా పొందే పరీక్షల నివేదికలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది. ఈ పోర్టల్ మొబైల్ వాహనాల రియల్-టైమ్ జీపీఎస్ ట్రాకింగ్‌నూ అందిస్తుంది. ఇది జాతీయ రహదారుల వ్యాప్తంగా నాణ్యత తనిఖీల పారదర్శక పర్యవేక్షణ, డేటా ఆధారిత పర్యవేక్షణను అనుమతిస్తుంది.
తదుపరి దశ వైపు..
ఈ మొబైల్ నాణ్యత నియంత్రణ వ్యవస్థ మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మేఘాలయ సహా 11 రాష్ట్రాల్లో ఎంక్యూసీవీల తదుపరి దశకు రహదారి రవాణా, జాతీయల రహదారుల మంత్రిత్వ ప్రణాళిక రూపొందించింది. భారత రహదారులను వేగంగా నిర్మించడమే కాకుండా... జవాబుదారీతనంతో నిర్మించాలనే వాగ్దానాన్ని బలోపేతం చేస్తూ ఎంక్యూసీవీల తదుపరి దశ కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించగా, జూన్ 2026 నాటికి పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2232323)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4