కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
గుంటూరులో తపాలాశాఖ ఆధ్వర్యంలో మెగా జీడీఎస్ సమ్మేళనం
· 9,000 మంది గ్రామీణ డాక్ సేవకులనుద్దేశించి ప్రసంగించిన
కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
నాడు పోస్టు చేయడమైనది:
23 FEB 2026 1:26PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ తపాలా శాఖ ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 22న గుంటూరులో భారీ స్థాయిలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ నలుమూలల నుంచి 9,000 మందికి పైగా గ్రామీణ డాక్ సేవకులు హాజరయ్యారు. గ్రామీణ తపాలా సేవలను బలోపేతం చేయడంలో వారి సమష్టి నిబద్ధతనూ, అంకితభావాన్ని ఈ సమ్మేళనం చాటింది.

(గుంటూరులో నిర్వహించిన జీడీఎస్ సమ్మేళనంలో పాల్గొన్న 9,000 మంది గ్రామీణ డాక్ సేవకులు)
ఈ సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, కేంద్ర కమ్యూనికేషన్లు - ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, కేంద్ర కమ్యూనికేషన్లు – గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పోస్టల్ సేవల బోర్డు సభ్యుడు (సిబ్బంది) శ్రీ సువేందు కుమార్ స్వైన్, ఎమ్మెల్యే శ్రీ మహమ్మద్ నజీర్ అహ్మద్, గుంటూరు మేయర్ శ్రీ కోవెలమూడి రవీంద్ర ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

(జీడీఎస్ సమ్మేళనంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్)
పోస్టాఫీసు పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి యోజన, పోస్టల్ జీవిత బీమా, గ్రామీణ పోస్టల్ జీవిత బీమా, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) సేవలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. అత్యుత్తమ పనితీరు కనబరిచిన పది మంది గ్రామీణ డాక్ సేవకులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.

(జీడీఎస్ సమ్మేళనంలో ఓ గ్రామీణ డాక్ సేవకురాలిని సన్మానిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్)
ఈ సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా తపాలా కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని నలుమూలలనూ అనుసంధానించే అత్యంత కీలక శక్తి గ్రామీణ డాక్ సేవకులేనని కొనియాడారు. ప్రస్తుతం ఇండియా పోస్ట్ దాదాపు 38 కోట్ల పొదుపు ఖాతాలను నిర్వహిస్తోందని, వీటిలో దాదాపు రూ. 22 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 3.8 కోట్ల సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో దాదాపు రూ. 2.27 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. తపాలా వ్యవస్థ ద్వారా దేశంలో ఆర్థిక సమ్మిళితత్వం ఎంత భారీ స్థాయిలో సాధ్యపడిందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
తపాలా శాఖ బట్వాడా, రావాణా, అనుబంధ వ్యవస్థను అత్యంత వేగంగా ఆధునికీకరిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కన్వేయర్ వ్యవస్థలు, శాస్త్రీయ వర్గీకరణ, ఆర్ఎఫ్ఐడీ, బార్కోడ్లు, క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెడుతున్నామని వివరించారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి వరకు అనుసంధానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా.. డ్రోన్ ఆధారిత డెలివరీ వ్యవస్థలను కూడా ప్రవేశపెడుతున్నట్టు ఆయన తెలిపారు. ‘సంస్కరణ, ఆచరణ, పరివర్తన’ అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునకు అనుగుణంగా.. 2047 నాటికి వికసిత భారత్‌ను సాకారం చేయాలన్న ఆయన లక్ష్యం దిశగా సమష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని శ్రీ సింధియా స్పష్టం చేశారు.
కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా తపాలా శాఖ దాదాపు 1.65 లక్షల పోస్టాఫీసుల ద్వారా, 4.5 లక్షల మందికి పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తోందని తెలిపారు. శాఖ వార్షిక వ్యయం దాదాపు రూ. 35,000 కోట్లు కాగా, ఆదాయం దాదాపు రూ. 13,000 కోట్లుగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. గతేడాది రూ. 600 కోట్ల ఆదాయం రాగా, వ్యయం రూ. 1,800 కోట్లుగా నమోదైందన్నారు. అయితే ఈ ఏడాది ఆదాయం దాదాపు రూ. 850 కోట్లకు చేరిందన్నారు. లావాదేవీలు లేని పోస్టాఫీసుల సంఖ్య గతంలో లక్షకు పైగా ఉండగా.. నిరంతర పర్యవేక్షణ ద్వారా దానిని ప్రస్తుతం 1,500కు తగ్గించగలిగామని వివరించారు. శాఖ కార్యాచరణ సమర్థతకు ఇది నిదర్శనమన్నారు.
సమ్మేళనాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. క్షేత్రస్థాయి నిర్వహణలో, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో గ్రామీణ డాక్ సేవకుల పాత్ర అద్వితీయమైనదని కొనియాడారు. సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, జీడీఎస్ సిబ్బంది చూపే మానవీయ కోణం, అంకితభావానికి సాటిలేదని స్పష్టం చేశారు. పర్యావరణ హిత కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. జీడీఎస్ సిబ్బందికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దిశగా చేయూతనివ్వడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
ఆర్థిక సమ్మిళితత్వంలోనూ, ప్రజలే కేంద్రంగా క్షేత్రస్థాయిలో సేవలందించడంలోనూ గ్రామీణ డాక్ సేవకుల అంకితభావమూ, వారి సేవలకు గుర్తింపునిచ్చే వేదికగా ఈ సమ్మేళనం నిలిచింది. ఈ కార్యక్రమానికి హాజరై, చారిత్రక విజయం సాధించేలా సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ కృతజ్ఞతలు తెలిపింది.
***
(రిలీజ్ ఐడి: 2231896)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3