వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో ‘ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్’ (ఎఫ్‌డీడీఐ) 5వ స్నాతకోత్సవ వేడుకలు
నాడు పోస్టు చేయడమైనది:
23 FEB 2026 6:00PM by PIB Hyderabad
ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) 5వ స్నాతకోత్సవ వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి తన స్నాతకోత్సవ ప్రసంగంలో తయారీ, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానంగా ప్రస్తావించారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈల) ఉపాధి కల్పన, ఎగుమతులు, వృద్ధికి పాదరక్షలు-తోలు రంగం అందించే సహకారాన్ని ఆయన గుర్తించారు. భారత ప్రపంచ స్థాయి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కోసం సాంకేతికత, సుస్థిరత, డిజైన్ ఆవిష్కరణలను స్వీకరించాలని గ్రాడ్యుయేషన్ విద్యార్థులను ఆయన ప్రోత్సహించారు.
ఎఫ్‌డీడీఐ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వివేక్ శర్మ (ఐఆర్ఎస్) మాట్లాడుతూ కోర్సు పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా సమర్థులైన నిపుణులను అభివృద్ధి చేయడంలో సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటించారు. విద్యార్థులు తమ వృత్తిపరమైన ప్రయాణంలో ఆవిష్కరణలు, సుస్థిరత, నైతిక విలువలతో కూడిన పద్ధతులు, డిజైన్ సంబంధిత ఆలోచనలతో ముందుకు సాగాలని ఆయన కోరారు.
ఈ వేడుకలు ఎఫ్‌డీడీఐ-హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తేజ్ లోహిత్ రెడ్డి (ఐఏఎస్) స్వాగత ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. 2018లో హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటు నుంచి సాధించిన వృద్ధిని ఆయన వివరించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి, ఆధునిక ప్రయోగశాలలు, బలోపేతమైన పరిశ్రమ సహకారాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. 2025 బ్యాచ్‌లో ఫ్యాషన్ డిజైన్, ఫుట్‌వేర్ డిజైన్, లెదర్ గూడ్స్, యాక్సెసరీస్ డిజైన్, మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ల నుంచి 72 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు.
అసమాన విద్యా నైపుణ్యాలతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు, వెండి పతకాలను ప్రదానం చేశారు. ప్రముఖులు, అధ్యాపకులు, పరిశ్రమ ప్రతినిధులు, తల్లిదండ్రుల సమక్షంలో స్నాతకోత్సవ ప్రతిజ్ఞ అనంతరం పట్టభద్రులకు డిగ్రీలను ప్రదానం చేశారు.
నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమ భాగస్వామ్యం ద్వారా పాదరక్షలు, తోలు, ఫ్యాషన్, రిటైల్ వ్యవస్థలకు ఎఫ్‌డీడీఐ దోహదపడుతూనే ఉందని వక్తలు పేర్కొన్నారు. డిజైన్, తయారీలో సుస్థిర పద్ధతులను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ప్రపంచ ప్రమాణాలకు కట్టుబడి ఉండుటను ప్రోత్సహించడంపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారించింది.
***
(రిలీజ్ ఐడి: 2231884)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3