ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026: 5వ రోజు జోరుగా సాగిన ఎక్స్‌పో పెవిలియన్లలో యువత, ఆవిష్కర్తల సందడి

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 8:36PM by PIB Hyderabad

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 ఎక్స్‌పోకు ఐదో రోజు కూడా సందర్శకుల తాకిడి భారీగా కొనసాగింది. ఎక్స్‌పోలోని 10 పెవిలియన్లకు వందలాది మంది తరలివచ్చారు. ముఖ్యంగా యువత వివిధ స్టాళ్ల వద్ద ఎంతో ఉత్సాహంగా ఆవిష్కరణల గురించి అడిగి తెలుసుకుంటూ కనిపించారు. ప్రదర్శనలకు సంబంధించిన కొన్ని విశేషాలు:

భారతదేశ ఎలక్ట్రానిక్స్, ఐటీ ఆవిష్కరణ విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎలక్ట్రానిక్స్- ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ) పాత్రను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ డెమోలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఒక కోటికి పైగా పురాతన రాతప్రతులను డిజిటలైజ్ చేయడంతో పాటు ఒక పటిష్ఠమైన డిజిటల్ రిపోజిటరీ ద్వారా భారత జ్ఞాన వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యాన్ని 'జ్ఞాన్ భారతం' ప్రదర్శించింది. దీనిని సందర్శకులు విశేషమైన ఆసక్తితో వీక్షించారు.

స్థానిక భాషలు, సంస్థలు, ప్రభుత్వ రంగ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారతదేశపు ఏఐ మోడళ్లను 'సర్వం ఏఐ' ప్రత్యక్షంగా ప్రదర్శించింది. ఇది సందర్శకులలో ఎంతో కుతూహలాన్ని నింపింది.

భారతదేశంలోని విభిన్న భాషా, డిజిటల్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన బహుభాషా ఏఐ మోడళ్లను ప్రదర్శించడం ద్వారా 'భారత్-జీపీటీ' సందర్శకులలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది.

ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ) రంగంలో ఏఐ వినియోగంపై 'వేవ్స్ క్రియేటర్స్ కార్నర్' ఒక ఇంటరాక్టివ్ ఇన్నోవేషన్ కేంద్రంగా నిలిచింది. ఇక్కడ 51 అంకురాలు పాల్గొన్నాయి. మీడియా, క్రియేటివ్ టెక్నాలజీలు, ఇమ్మర్సివ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ఏఐ రియల్-టైమ్ అప్లికేషన్లను ఇవి ప్రత్యక్షంగా ప్రదర్శించాయి.

ఈ సదస్సులో 'ఇన్యా వాయిస్-ఓఎస్'ను జ్ఞాని.ఏఐ పరిచయం చేసింది. ఇది 5-బిలియన్ల స్థిరాంకాలతో కూడిన వాయిస్-ఫస్ట్ ఏఐ మోడల్. వివిధ భాషల్లో సంభాషణల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సాంకేతికత ద్వారా ప్రభుత్వ- ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ అప్లికేషన్‌లలో సహజమైన ‘వాయిస్-టు-వాయిస్’ సంభాషణలు సాధ్యమవుతాయి.

యువత ఉత్సాహపూరిత శక్తి, వినూత్న ఆలోచనల మధ్య ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 ఎక్స్‌పో ఐదో రోజు ముగిసింది. ఏఐ ప్రపంచంలో విజ్ఞానాన్ని పొందేందుకు మరో ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. రేపు ఎక్స్‌పో ముగిసేలోపు ప్రతి కొత్త అంశాన్ని తెలుసుకునేందుకు పరిశ్రమల నాయకులు, విద్యావేత్తలు, విద్యార్థులు సిద్ధమవుతున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2231332) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Kannada