ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

బాధ్యతాయుత.. సమ్మిళిత ఏఐ విప్లవంలో భారత్‌ ముందంజ దిశగా “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026”లో ప్రపంచ ఏఐ అగ్రగాములు.. పారిశ్రామిక దిగ్గజాల సమావేశం


· వికసిత భారత్‌-2047 సాకారంలో ఏఐ ఒక వినూత్న శక్తి: ముకేష్‌ అంబానీ

· పరిమాణం.. స్థాయి రీత్యా పారిశ్రామిక విప్లవాన్ని అధిగమించనున్న ఏఐ విప్లవం: డీప్‌మైండ్‌ సీఈవో డెమిస్ హస్సాబిస్

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 6:51PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026”లో భాగంగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ఇవాళ నాలుగు కీలక ఉపన్యాస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ ధీరూభాయ్ అంబానీ, డీప్‌మైండ్‌ టెక్నాలజీస్ సీఈవో డెమిస్ హస్సాబిస్, వియనై సిస్టమ్స్ ఇంక్ సీఈవో విశాల్ సిక్కా, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వీటిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధ్యతాయుత, సమ్మిళిత, భారీ విస్తరణ ద్వారా భారత్‌ను ప్రపంచ ఏఐ రూపాంతరీకరణలో ముందంజలో నిలపడంపై వారు తమతమ దృక్కోణాలను వివరించారు.

ముందుగా ముఖేష్ ధీరూభాయ్ అంబానీ మాట్లాడుతూ- ఈ సదస్సును దేశాన్ని మలుపు తిప్పే ఘట్టంగా అభివర్ణించారు, ఈ మేరకు “అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ భారత సాంకేతిక చరిత్రలో ఒక నిర్ణయాత్మక ఘట్టం. వికసిత భారత్ స్వప్న సాకారంలో ‘ఏఐ’ని ఒక చోదక శక్తిగా మారుస్తామని ప్రతినబూనిన క్షణమిది. స్వాతంత్ర్య అద్భుత శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే 2047 నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్నది మన దార్శనికత” అన్నారు. అలాగే, అధికార కేంద్రీకరణకన్నా ప్రజాస్వామ్యీకరణ ప్రాధాన్యాన్ని వివరిస్తూ- “అయితే, ఇందుకు మరో మార్గం కూడా ఉంది: అదేమిటంటే- అందరికీ ప్రయోజనకరంగా అందుబాటులో, సరసమైన ధరకు లభించే భవిష్యత్‌ కృత్రిమ మేధ. భారత్‌ ఇప్పుడు ఈ రెండో భవిష్యత్తుపై విశ్వాసం పెంచుకుంది” అన్నారు. మరోవైపు భారత్‌ ప్రగతి వేగం పెంచడంలో కీలకమైన సావరిన్ కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్-పవర్డ్ డేటా సెంటర్లు, ఎడ్జ్ ఇంటెలిజెన్స్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడతామని ఆయన ప్రకటించారు.

డీప్‌మైండ్ టెక్నాలజీస్ సీఈవో డెమిస్ హస్సాబిస్ మాట్లాడుతూ, ఏఐ నుంచి లభించే శాస్త్రీయ భరోసా, ఇప్పుడు ప్రపంచం ముందున్న పరిమితులను ప్రస్తావించారు. ఈ మేరకు “ప్రస్తుతం మనం 2026 ఉన్నాం.. రాబోయే ఐదేళ్లలో ఏజీఐ శకంలోకి ప్రవేశించబోతున్నాం” అని పేర్కొన్నారు. రాబోయే మార్పుల స్థాయిని వివరిస్తూ- “ఏఐ విప్లవ ప్రభావం మునుపటి పారిశ్రామిక విప్లవంకన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం.. అంటే- ఇది 10 రెట్ల వేగంతో దూసుకొస్తుందని భావిస్తున్నాను” అని చెప్పారు. మానవాళికి ఏఐ ద్వారా భారీ ప్రయోజనం లభించేలా శాస్త్రీయ కాఠిన్యం, అంతర్జాతీయ సహకారం, సమగ్ర చర్చల అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.

వియానై సిస్టమ్స్ ఇంక్ సీఈవో విశాల్ సిక్కా ప్రసంగిస్తూ- ఏఐ ద్వారా ఇప్పటికే ఒనగూడుతున్న అసాధారణ ఉత్పాదకత ప్రయోజనాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే, ఈ క్రమంలో ఉదాసీనతకు తావుండరాదని హెచ్చరించారు. “కృత్రిమ మేధను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకున్న వ్యక్తులు దానితో ఆశ్చర్యకర రీతిలో ప్రభావవంతంగా పనిచేస్తారు” అని ఆయన అన్నారు. అదే సమయంలో భద్రత, విశ్వసనీయత, ఇంధన సమస్యల పరిష్కారం ఆవశ్యకతను స్పష్టం చేశారు. భారత్‌ కృత్రిమ మేధను అనుసరించడమే కాకుండా ఇందులో భవిష్యత్‌ సాంకేతికను రూపొందించాలని కోరారు. “నేటి ‘ఏఐ’లో నైపుణ్య సాధనతోపాటు మనం దాన్ని వేగంగా అధిగమిస్తూ మరింత ఉన్నత స్థాయిని అందుకోవాలి” అన్నారు.

విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ- ఆచరణాత్మక అనువర్తనం, పారిశ్రామిక స్థాయి రూపాంతరీకరణలపైఐ దృష్టి సారించాలన్నారు. “ఒక తరంలో ఒకసారి, మనం చేయగలిగినదాన్ని మార్చలేని సాంకేతికత ఒకటి ఉద్భవిస్తూంటుంది. అయితే, అది మనం చేయాల్సినదేమిటో దిశానిర్దేశం చేస్తూ మార్పు తెస్తుంది. అదే ఈ నిర్దిష్ట కృత్రిమ మేధ సాంకేతికత” అన్నారు. వాస్తవ ప్రపంచ వినియోగం నుంచే విలువ లభ్యమవుతుందని స్పష్టం చేశారు. “వాస్తవ ప్రపంచ సమస్యలను బాధ్యతాయుతంగా, విశేష స్థాయిలో పరిష్కరించేందుకు ఉపయోగపడితేనే సాంకేతికత ఒక విలువను సృష్టించగలదు” అన్నారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ప్రజా సేవల ప్రదానాన్ని ఈ సందర్భంగా ఉదాహరిస్తూ- భారత్‌ను అనువర్తిత ఏఐ ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కలదిగా ఆయన పేర్కొన్నారు.

ఈ నాలుగు కీలకోపన్యాస కార్యక్రమాలు సదస్సు కీలక సందేశాన్ని బలోపేతం చేశాయి: భారత ఏఐ ప్రస్థానం బాధ్యతతో, భారీ స్థాయితో కొనసాగిస్తూ సమ్మిళితత్వాన్ని, సాంకేతిక నాయకత్వాన్ని ప్రపంచ సహకారంతో మేళవించాలి. ఆ మేరకు మేధస్సు కేంద్రీకృతమై పోకుండా జాతీయ ప్రగతి, ప్రపంచ ఉమ్మడి పురోగమనం దిశగా విస్తృతమయ్యేలా చూసుకోవాలి.

 

***


(రిలీజ్ ఐడి: 2230519) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati