రక్షణ మంత్రిత్వ శాఖ
వైజాగ్‌లో మిలన్-2026ను ప్రారంభించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
పెరుగుతున్న సముద్ర సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవడానికి ప్రపంచ సమాజం చేతులు కలపాలని పిలుపు
" సముద్ర చట్టాలపై ఐక్యరాజ్యసమితి సదస్సు విధాన ప్రణాళికలు
సమగ్ర ప్రపంచ నావికా వ్యవస్థ ద్వారా మరింత బలోపేతమవుతాయి"
అంతర్జాతీయ నియమాలు, నావిగేషన్ స్వేచ్ఛ ఆధారంగా
అందరికీ సమాన హక్కులు గల నౌకా వాణిజ్య వ్యవస్థ ఏర్పాటు భారత్ ఆకాంక్ష
"సాగర్ నుంచి మహాసాగర్ దాకా ప్రధానమంత్రి శ్రీ మోదీ దార్శనికత పరిణామం... ఈ ప్రాంతంతో పాటు విదేశీ భాగస్వాములతో పరస్పర సహకారం బలోపేతం పట్ల భారత్ లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది"
"భారత్ విశ్వసనీయమైన విశ్వ-మిత్రగా, ఈ ప్రాంతంలో
నిర్మాణాత్మక, ఆధారపడదగిన పాత్రను పోషిస్తూనే ఉంటుంది"
నౌకా వాణిజ్యంలో సహకారాత్మక భాగస్వామ్యం, భద్రత-నియమ ఆధారిత సమష్టి నౌకా వాణిజ్య వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా భారత నావికాదళం నిర్వహిస్తున్న
మిలన్-2026లో పాల్గొన్న 74 దేశాల నావికాదళ అధిపతులు, ప్రతినిధులు
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 3:25PM by PIB Hyderabad
సముద్ర రంగంలో పెరుగుతున్న సంక్లిష్ట, పరస్పర అనుసంధానిత సవాళ్లను అన్ని దేశాలు సమర్థంగా ఎదుర్కోవాలనీ, ఇందుకోసం అన్ని దేశాలు పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకునే స్ఫూర్తితో వ్యవహరించాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మిలన్-2026ను ప్రారంభించిన ఆయన 74 దేశాల నావికా దళాల అధిపతులు, ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.
"అంతర్జాతీయ శాంతి స్థాపనలో నావికాదళాల పాత్ర కాలక్రమేణా పెరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా విపరీతమైన ఆర్థిక వృద్ధి సాధ్యపడింది. ఇది అంతర్జాతీయ వాణిజ్యం, రవాణాలో భారీ వృద్ధికి దారితీసింది. జలసంధి, జల మార్గాల యాజమాన్యం విషయంగా పోటీ పెరిగింది. ఇది కొన్నిసార్లు ఉద్రిక్తతలకూ దారితీస్తున్నది. నీటి అడుగున గల వనరులపై, ముఖ్యంగా రేర్ ఎర్త్ ఖనిజాలపై అంతర్జాతీయంగా అన్ని దేశాల దృష్టి పెరగడం ఈ ఉద్రిక్తతకు కొత్త కోణాన్ని జోడిస్తోంది. అదనంగా ఆయా దేశాలు, ప్రాంతాలకు సామ్రాజ్యాన్ని విస్తరించాలనే దుర్మార్గపు ఉగ్రవాద కార్యకలాపాల నుంచి మన జలాలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని రక్షణ మంత్రి అన్నారు.
సాంప్రదాయిక ముప్పులు పైరసీ, సముద్ర ఉగ్రవాదం, అక్రమంగా చేపలు పట్టడం, అక్రమ రవాణా, సైబర్ దాడులు, కీలకమైన సరుకు రవాణా వ్యవస్థలను అడ్డుకోవడం వంటి కొత్త సవాళ్లతో ముడిపడి ఉన్నాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు ప్రకృతి వైపరీత్యాలను తీవ్రతరం చేస్తున్నాయనీ... ఇవి మానవతా కార్యకలాపాలు, విపత్తు సహాయ కార్యకలాపాలు మరింత తరచుగా, తప్పనిసరిగా చేపట్టాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాయన్నారు. ఏ ఒక్క నావికాదళం... ఎంత సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ... ఈ సవాళ్లను ఒంటరిగా పరిష్కరించలేదనీ... సురక్షితమైన, మరింత భద్రత గల భవిష్యత్తును నిర్ధారించడానికి నావికాదళాల మధ్య మెరుగైన సహకారం అవసరమని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
అంతర్జాతీయ జలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల సమావేశం (యూఎన్‌సీఎల్‌వోఎస్) అందించిన దృఢమైన విధాన ప్రణాళికను సమగ్ర ప్రపంచ నౌకా వాణిజ్య వ్యవస్థ ఏర్పాటు ద్వారా మరింత బలోపేతం చేయవచ్చని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. దేశాల మధ్య వివాద పరిష్కారం, శాంతియుత సహజీవనం కోసం యూఎన్‌సీఎల్‌వోఎస్ సమగ్రమైన, సమర్థమైన యంత్రాంగాన్ని అందిస్తుందన్నారు. సమగ్ర ప్రపంచ నౌకా వాణిజ్య వ్యవస్థ సమాచార భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తుందనీ... కమ్యూనికేషన్ల సంబంధాలను పరిరక్షించడంతో పాటు ప్రపంచ స్థాయిలో జాతీయ సరిహద్దుల రక్షణ సహా సముద్ర సంబంధిత ఉగ్రవాదం వంటి నేర కార్యకలాపాలనూ అణిచివేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రస్తావించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్... మిలన్ వంటి వేదికలు వృత్తిపరమైన నైపుణ్యాన్ని ఒకచోట చేర్చి, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించి, పరస్పర సామర్థ్యాలనూ పెంపొందించి, ఉమ్మడి సవాళ్లకు సమన్వయంతో కూడిన ప్రతిస్పందనలను సుసాధ్యం చేస్తాయని పేర్కొన్నారు. "మన ఓడలు కలిసి ప్రయాణించినప్పుడు, మన నావికులు కలిసి శిక్షణ పొందినప్పుడు, మన కమాండర్లు కలిసి చర్చించినప్పుడు, భౌగోళిక-రాజకీయాలను అధిగమించి, సహకారాత్మక ఆలోచనపై చర్చించడానికి ఒక అనుకూలమైన సమయాన్ని అందించే ఉమ్మడి అవగాహనను మనం నిర్మిస్తాం" అని ఆయన అన్నారు.
ఈ సహకారం అవసరాన్ని భారత్ చాలా కాలం కిందటే గుర్తించిందన్న రక్షణ మంత్రి... "ప్రాంతంలోని అందరికీ భద్రత, వృద్ధి" (సాగర్) దార్శనికతతో రూపొందించిన సముద్రాల పట్ల మన దేశపు విధానం "ప్రాంతాల అంతటా భద్రత, వృద్ధి కోసం పరస్పర, సమగ్ర పురోగతి" (మహాసాగర్) దార్శనికతగా పరిణామం చెందిందన్నారు. "సాగర్" అంటే సముద్రాల నుంచి “మహాసాగర్” అంటే మహాసముద్రాలకు సాగిన ఈ పరిణామం... ఈ ప్రాంతానికి చెందిన, విదేశీ భాగస్వాములతో కలిసి పనిచేయడం పట్ల భారత్ లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను వివరించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్... “మేం బహుపాక్షిక నిఘా, సమన్వయంతో కూడిన గస్తీని నిరంతరం కొనసాగిస్తున్నాం. మానవ సంబంధిత సంక్షోభాల సమయంలో మా దళాలు వేగంగా స్పందించాయి. తుఫానుల సమయాల్లో మేం అనేక ఉమ్మడి ప్రత్యేక ఆర్థిక మండలాల నిఘా, హైడ్రోగ్రాఫిక్ సహాయం, సహాయక మిషన్లలో పాలుపంచుకున్నాం” అని తెలిపారు. విశ్వసనీయమైన విశ్వ-మిత్ర (ప్రపంచ మిత్రునిగా)గా భారత్ ఈ ప్రాంతంలో నిర్మాణాత్మక, నమ్మదగిన బాగస్వామి పాత్రను పోషిస్తూనే ఉంటుందన్నారు. సమగ్ర నౌకా వాణిజ్య భద్రత, పరస్పర శ్రేయస్సు విడదీయరానివని... సారూప్య భావాలు కలిగిన దేశాల మధ్య సహకారం, పరస్పర నమ్మకం, భాగస్వామ్య నిబద్ధత ద్వారా మాత్రమే దీనిని సాధించవచ్చని ఆయన అన్నారు.
74 దేశాల భాగస్వామ్యంతో జరిగిన మిలన్-2026... విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన నౌకా వాణిజ్య భాగస్వామిగా ప్రపంచ నౌకా వాణిజ్య సమాజం భారత్ పట్ల ఉంచిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి తెలిపారు. “మిలన్-2026 భాగస్వామ్య దేశాలు నావికాదళాల పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి... వృత్తిపరమైన అనుభవాలు, అభ్యాసాలను పంచుకోవడం ద్వారా వృత్తిపరమైన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి... పరస్పర ప్రయోజనకరమైన బంధాలను అభివృద్ధి చేయడం ద్వారా స్నేహాలను మరింతగా విస్తచరించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అంతర్జాతీయ నియమాలు, నావిగేషన్ స్వేచ్ఛ ఆధారంగా అన్ని దేశాలకు సమానమైన హక్కులు, బాధ్యతలు గల సమగ్ర నౌకా వాణిజ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేం కోరుకుంటున్నాం” అని ఆయన అన్నారు.
అంతర్జాతీయ నౌకాదళాల సమీక్ష-2026 ప్రపంచ నౌకాదళాల మధ్య సద్భావన, వృత్తి నైపుణ్యం, పరస్పర గౌరవానికి స్పష్టమైన ప్రతీక అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వారి జెండాలు భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ దేశాలన్నీ ఒకే సముద్ర భాషను మాట్లాడుతూ... ప్రపంచ వనరులను, ఆయా దేశాల జల సరిహద్దులను సురక్షితంగా, భద్రంగా, స్థిరంగా ఉంచడం పట్ల సమష్టి నిబద్ధతను ప్రదర్శిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
తన ప్రారంభ వ్యాఖ్యల్లో నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఈ మిలన్‌ను సముద్ర రంగ మహాకుంభ్‌తో పోల్చారు. దీనిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నౌకా వాణిజ్య రంగ నిపుణులంతా కలిసి సముద్రాలను సురక్షితంగా, భద్రంగా, అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉమ్మడి నిబద్ధత, ఉద్దేశంతో ఏకమయ్యారని తెలిపారు. భారత్ వంటి నౌకా వాణిజ్య దేశం నేటి సముద్ర సవాళ్లు సంక్లిష్టమైనవి, పరస్పరం అనుసంధానితమైనవి, బహుళ దేశాలకు సంబంధించినవి స్పష్టంగా గుర్తించిందన్నారు. వీటిని పరస్పర సహకారం, భాగస్వామ్యం ద్వారా ఉత్తమంగా పరిష్కరించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
నౌకా వాణిజ్య వాతావరణానికి సంబంధించిన ఈ సంక్లిష్ట విధానం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహాసాగర్ దార్శనికతతో ముడిపడి ఉందని నావికాదళ ప్రధానాధికారి పేర్కొన్నారు. భాగస్వామ్యం, సమష్టి బాధ్యత ఆధారంగా సమ్మిళిత, సహకార భావనలు కలగలసిన విధానం ఇది... భారత నౌకా వాణిజ్య శక్తిని స్పష్టం చేస్తూ భారత నావికాదళం ఈ సమ్మిళిత దార్శనికత మార్గనిర్దేశంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. కలిసి పనిచేయడం ద్వారా భారత నావికాదళం... సమష్టి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నౌకా వాణిజ్య సవాళ్లకు వ్యతిరేకంగా ఉమ్మడి సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మిలన్-2026 సందర్భంగా నావికాదళాలు సంక్లిష్టమైన సముద్ర విన్యాసాలు, డ్రిల్స్, సాధనలు, వృత్తిపరమైన నైపుణ్యాలను పంచుకోవడం, అర్థవంతమైన చర్చల్లో పాల్గొంటాయని అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి తెలిపారు. పరస్పర అవగాహన, నమ్మకం, కలిసి పనిచేయడాన్ని మెరుగురుస్తూనే ఈ పరస్పర సంభాషణలు... అనుభవం, నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడంలోనూ సహాయపడతాయని ఆయన అన్నారు.
రక్షణ రంగ పరిశోధన-అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, తూర్పు నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, భారత నావికాదళ మాజీ అధిపతులు, నావికాదళ అధిపతులు, మిత్ర దేశాల ప్రతినిధులు, భారత నావికాదళ సీనియర్ అధికారులు, నౌకల కమాండింగ్ అధికారులు, సభ్య దేశాల సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది ఈ కార్యక్రమ దౌత్య, వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని స్పష్టం చేసింది.
మిలన్-2026 ఇప్పటివరకు జరిగిన భారత నౌకాదళ కార్యక్రమాల్లోనే అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైన ఎడిషన్లలో ఒకటిగా నిలుస్తుంది. ఇది 74 దేశాలకు చెందిన నావికాదళ నౌకలు, విమానాలు, వృత్తి నిపుణులైన ప్రతినిధులను ఒకచోట చేర్చింది. వృత్తిపరమైన సంబంధాలను మరింతగా పెంచుకోవడం, కార్యాచరణ అనుకూలతను మెరుగుపరచడం, పెరుగుతున్న పరస్పర అనుసంధాన భద్రతా వాతావరణంలో సమకాలీన నౌకా వాణిజ్య సవాళ్లపై భాగస్వామ్య అవగాహనను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
ఈ మిలన్-2026 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘ప్రాంతాల వ్యాప్తంగా భద్రత, వృద్ధి కోసం పరస్పర, సమగ్ర పురోగతి (మహాసాగర్)’ దార్శనికతకు అనుగుణంగా ఉంది. సముద్ర వనరులు, సరిహద్దుల అంతటా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించే దిశగా భారత్ అనుసరిస్తున్న చురుకైన విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
ఈ కార్యక్రమాన్ని హార్బర్ దశ, సముద్ర దశ అను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. హార్బర్ దశ వృత్తిపరమైన పరస్పర సంభాషణలను బలోపేతం చేయడం, పరస్పర అవగాహనను పెంపొందించడం, సమగ్రమైన భాగస్వామ్య కార్యక్రమం ద్వారా సహకారాన్ని, ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తుంది. ఈ దశలోని కీలక కార్యకలాపాల్లో అంతర్జాతీయ నౌకా వాణిజ్య సదస్సు, ఈ రంగంలోని నిపుణుల మధ్య చర్చలు, ద్వైపాక్షిక భాగస్వామ్యాలు, యువ అధికారుల మిలన్, సభ్య దేశాల నావికాదళాల మధ్య క్రాస్-డెక్ సందర్శనలు బాగంగా ఉన్నాయి. హార్బర్ దశలో ప్రీ-సెయిల్ ప్లానింగ్ సమావేశాలు, కార్యాచరణ-సాంకేతిక ప్రదర్శనలు, నగర-సాంస్కృతిక పర్యటనలు, క్రీడా కార్యక్రమాలు, మిలన్ సాంస్కృతిక సాయంత్రం వంటి కార్యక్రమాలు భాగంగా ఉన్నాయి. ఇవి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే సిబ్బంది, ప్రతినిధి బృందాలకు కార్యాచరణ భాగస్వామ్యానికి మించి అర్థవంతమైన సంభాషణ అవకాశాలను అందిస్తాయి.
సముద్రంలో అధునాతన కార్యాచరణ ప్రక్రియల శ్రేణి సముద్ర దశలో భాగంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే నౌకాదళాల మధ్య నౌకా వాణిజ్య సహకారం, పరస్పరం సామర్థ్యాలను పెంపొందించుకోవడం లక్ష్యంగా వీటిని రూపొందించారు. ఈ కార్యక్రమాల్లో నౌకా వాణిజ్య భద్రతా కార్యకలాపాలు, వ్యూహాత్మక విన్యాసాలు, కమ్యూనికేషన్ ప్రక్రియలు భాగంగా ఉంటాయి. ఇవి పరస్పర విశ్వాసం, కార్యాచరణ సహోత్తేజాన్ని, సామూహిక సంసిద్ధతను బలోపేతం చేస్తాయి.
మిలన్-2026 ద్వారా సహకారాత్మక నౌకా వాణిజ్య బాగస్వామ్యం, సామూహిక భద్రత-నియమాల ఆధారిత సమగ్ర నౌకా వాణిజ్య వ్యవస్థను ప్రోత్సహించడం పట్ల తన నిబద్ధతను భారత నావికాదళం బలోపేతం చేస్తుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతాలకు భారత్ నమ్మకమైన భాగస్వామిగా, నికర భద్రతా ప్రదాతగా తన పాత్రను పునరుద్ఘాటిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2230387)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11