రక్షణ మంత్రిత్వ శాఖ
గగన్‌యాన్ డ్రోగ్ పేరాషూట్ అర్హత పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీఓ
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 3:45PM by PIB Hyderabad
భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమం ‘గగన్‌యాన్’కు సంబంధించిన డ్రోగ్ పేరాషూట్‌కు అర్హత స్థాయి లోడ్ టెస్టును విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఒక గొప్ప సాఫల్యాన్ని సాధించినట్లయింది. ఈ పరీక్షను చండీగఢ్‌లో గల టర్మినల్ బాలిస్టిక్ రిసర్చ్ లేబరేటరీ (టీఆర్బీఎల్) లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు చెందిన రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (ఆర్‌టీఆర్‌ఎస్) కేంద్రంలో పూర్తి చేశారు. ఆర్‌టీఆర్‌ఎస్ ఒక ప్రత్యేక గతిశీల పరీక్షా కేంద్రం. దీనిని అధిక వేగవంతమైన ఏరోడైనమిక్, బాలిస్టిక్ మూల్యాంకనాల్ని దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా ఉపయోగిస్తుంటారు.

ఈ పరీక్షను 2026 ఫిబ్రవరి 18వ తేదీన విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం, ఇస్రో, ఏరియల్ డెలివరీ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, డీఆర్‌డీఓ లతో పాటు టీఆర్‌బీఎల్‌కు చెందిన వివిధ బృందాలతో కలిసి నిర్వహించారు. ఆర్‌టీఆర్‌ఎస్ గతిశీలత పరీక్ష సామర్థ్య స్థాయి భారాన్ని అనుకరిస్తుంది. ఇది వాస్తవిక ఫ్లయిట్ తాలూకు గరిష్ఠ భారానికన్నా ఎక్కువ ఉంటుంది. ఇది పేరాషూట్‌కు అదనపు డిజైన్ రక్షణ హంగును అమర్చడాన్ని సూచిస్తుంది.
ఈ పరీక్ష అధిక సామర్థ్యం కలిగిన రిబ్బన్ పేరాషూట్‌ను రూపకల్పన చేయడంలోనూ, నిర్మాణంలోనూ భారత్‌కు ఉన్న ప్రావీణ్యాన్ని నిరూపించింది. అంతరిక్ష, రక్షణ శాఖ కార్యక్రమాల కోసం ఉన్నత స్థాయి పరీక్షా సదుపాయాలనూ, ఉపకరణాలనూ, సాంకేతిక నైపుణ్యాన్నీ అందించడంలో టీబీఆర్ఎల్ అందిస్తున్న అపార సేవలను ఈ విజయం మరోసారి చాటిచెప్పింది.
గగన్‌యాన్ డ్రోగ్ పేరాషూట్‌ను విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీఓకూ, ఇస్రోకూ, పరిశ్రమ రంగానికీ అభినందనలను తెలిపారు. ఈ పరీక్ష ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకు పోయే దిశలో మరో పెద్ద అడుగని ఆయన వర్ణించారు.
అర్హత స్థాయి లోడ్ టెస్టును విజయవంతంగా ముగించడంలో పాలుపంచుకున్న బృందాలను రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్‌డీఓ అధ్యక్షుడైన డాక్టర్ సమీర్ వి. కామత్ కూడా అభినందించారు.
***
(రిలీజ్ ఐడి: 2230382)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6