ప్రధాన మంత్రి కార్యాలయం
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా గౌరవ ఫిన్లాండ్ ప్రధాని పెట్టేరి ఓర్పోతో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 5:10PM by PIB Hyderabad
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా 2026 ఫిబ్రవరి 18న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో గౌరవ ఫిన్లాండ్ ప్రధానమంత్రి పెట్టేరి ఓర్పోతో సమావేశమయ్యారు.
16వ భారత్ - ఈయూ సమ్మిట్ సందర్భంగా భారత్ – ఐరోపా యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారవడాన్ని వారిద్దరూ స్వాగతించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల ఉమ్మడి పురోగతికీ, శ్రేయస్సుకూ ఉత్ప్రేరకంలా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్-ఐరోపా యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేలా నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు.
భవిష్యత్తు ఆర్థిక వికాసం, అభివృద్ధిలో డిజిటలీకరణ, స్థిరత్వమూ కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానులిద్దరూ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన ప్రముఖ సాంకేతిక కంపెనీలు కార్యకలాపాలను విస్తరిస్తూ, భాగస్వామ్యాలను పెంచుకుంటూ.. ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థల్లో పరస్పరం కీలకంగా వ్యవహరిస్తుండడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ పరిణామాన్ని స్వాగతించారు. న్యాయబద్ధమైన, సమ్మిళిత కృత్రిమ మేధ అభివృద్ధి దిశగా భారత దార్శనికతను ఫిన్లాండ్ ప్రధానమంత్రి ప్రశంసించారు.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనీ, అలాగే సాంకేతిక సహకారాన్ని మరింత పెంచుకోవాలనీ వారిద్దరూ పిలుపునిచ్చారు. ముఖ్యంగా క్వాంటం, 6జీ, పునరుత్పాదక ఇంధనం, వర్తుల ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగాల్లో పురోగతి దిశగా సమష్టిగా కృషిచేయాలని నిర్ణయించారు.
ప్రాంతీయ - అంతర్జాతీయ పరిణామాలపైనా, అలాగే అంతర్జాతీయ స్థాయిలో పలు పాలనాపరమైన అంశాల్లో మరింత మెరుగైన సహకారంపైనా వారు చర్చించారు.
ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు. ఈ ఏడాది జరగనున్న మూడో భారత్ - నార్డిక్ సదస్సులో మరోసారి సమావేశమయ్యేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.
***
(రిలీజ్ ఐడి: 2230163)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Gujarati
,
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil