శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కృత్రిమ మేధ అనేది ఇకపై కేవలం ఒక ఐచ్ఛికం మాత్రమే కాదని జీవితంలోని ప్రతి విషయంలో పని చేయడానికి అది ఒక అత్యవసరమైన అంశంగా మారిందన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రభుత్వ యాజమాన్యంలోని భారతదేశపు మొట్టమొదటి సార్వభౌమ
'లార్జ్ లాంగ్వేజ్ మోడల్'ను ప్రశంసించిన కేంద్ర మంత్రి
బహుభాషా ఏఐ వ్యవస్థ రూపుదిద్దుకుంటున్న తీరును వివరించిన కేంద్ర మంత్రి
భారత్-జెన్ సెషన్‌లో ప్రభుత్వంలోని అన్ని విభాగాల సమన్వయంతో సాగుతున్న
'ఏకోన్ముఖ ప్రభుత్వ' నమూనాకు నిదర్శనమని పేర్కొన్న మంత్రి
ఎన్ఎం-ఐసీపీఎస్ కింద రూ. 235 కోట్లతో భారత్‌జెన్ ప్రాజెక్ట్‌కు మద్దతు లభించినదన్న మంత్రి
ఇండియా ఏఐ మిషన్ కింద రూ. 10,585 కోట్ల భారీ నిధులతో
భారత్‌జెన్ ప్రాజెక్టు మరింత బలోపేతమైందన్న మంత్రి
17 బిలియన్ల స్థిరాంకాలతో కూడిన 17 భాషల పరమ్-2 టెక్స్ట్ ఫౌండేషన్ మోడల్‌తో
సహా భారత్-జెన్ సరికొత్త మోడళ్లను ప్రారంభించారన్న మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 5:49PM by PIB Hyderabad
భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రభుత్వ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, బహుభాషా ఏఐ స్టాక్‌ను కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ (స్వతంత్ర బాధ్యత), భూవిజ్ఞాన శాఖ, ప్రధాని కార్యాలయ, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నేడు ప్రశంసించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 'భారత్‌జెన్ మోడల్స్: విజన్ అండ్ టెక్నికల్ ఎగ్జిక్యూషన్ 2026' కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నేటి కాలంలో కృత్రిమ మేధ అనేది కేవలం ఒక ఐచ్ఛికం మాత్రమే కాదని జీవితంలోని ప్రతి రంగంలో పని చేయడానికి అది ఒక అత్యవసర భాగమని స్పష్టం చేశారు.
గ్లోబల్ ఏఐ సదస్సులో భాగంగా జరిగిన ఈ సెషన్‌ను ఇండియా ఏఐ మిషన్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ), శాస్త్ర సాంకేతికత విభాగం (డీఎస్‌టీ) సహకారంతో 'భారత్‌జెన్' నిర్వహించింది.
భారత్‌జెన్ బృందాన్ని అభినందిస్తూ సాంకేతిక స్వయంసమృద్ధి దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన కీలక ఘట్టమని మంత్రి పేర్కొన్నారు. భారత్‌జెన్ అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని సార్వభౌమ బహుభాషా మల్టీమోడల్ 'లార్జ్ లాంగ్వేజ్ మోడల్' (ఎల్ఎల్ఎం) అని పేర్కొన్న ఆయన.. ఇది భారతదేశ సామాజిక-సాంస్కృతిక నేపథ్యం, భాషా వైవిధ్యానికి అనుగుణంగా రూపొందిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఎల్ఎల్ఎం మోడల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ సాంకేతిక పరిణామం చెందుతున్న ప్రాథమిక దశలోనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక సార్వభౌమ మోడల్‌ను రూపొందించడం భారత్‌జెన్ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.
‘సంపూర్ణ శాస్త్ర విజ్ఞానం, సంపూర్ణ ప్రభుత్వం, సంపూర్ణ దేశం’ అనే నమూనాకు భారత్‌జెన్ ప్రాజెక్టు నిదర్శనమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని ఐఐటీ బాంబేలోని 'టీఐహెచ్ ఫౌండేషన్ ఫర్ ఐఓటీ, ఏఓఈ' నేతృత్వంలోని కన్సార్టియం అమలు చేస్తోంది. ఇందులో ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మండీ, ఐఐటీ కాన్పూర్, ఐఐఎం ఇండోర్, ఐఐటీ మద్రాస్ భాగస్వామ్య సంస్థలుగా ఉన్నాయి. ‘నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ (ఎన్ఎం-ఐసీపీఎస్)’ ద్వారా రూ. 235 కోట్ల నిధులతో డీఎస్‌టీ దీనికి మద్దతు అందిస్తోంది. ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఇండియా ఏఐ మిషన్ ద్వారా మరో రూ. 10,585 కోట్ల భారీ కేటాయింపులతో ఈ ప్రాజెక్టు మరింత బలోపేతమైంది.
ఈ ప్రాజెక్టు సాంకేతిక పరిధిని వివరిస్తూ.. భారత్‌జెన్ కేవలం టెక్స్ట్‌కే పరిమితం కాకుండా టెక్స్ట్-టు-స్పీచ్, ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ వంటి శ్రవణ సాంకేతికతలు, డాక్యుమెంట్ విజన్-లాంగ్వేజ్ మోడల్స్ వంటి పలు రకాల ఏఐ విభాగాల్లో విస్తరించి ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా పరిపాలన, వైద్యం, విద్య, వ్యవసాయం, న్యాయ వ్యవస్థల్లో భారతీయ అవసరాలకు అనుగుణంగా భారత్‌జెన్ ఫౌండేషనల్ మోడల్స్ రూపొందినదని ఆయన తెలిపారు. భాషా వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా అందరికీ అందుబాటులో ఉండేలా ఈ అప్లికేషన్లను తీర్చిదిద్దినట్లు ఆయన వెల్లడించారు.
ఇటీవలి పరిణామాలను ప్రస్తావిస్తూ.. ఆయుర్వేదం కోసం 'ఆయుర్ పరామ్', వ్యవసాయ రంగం కోసం 'అగ్రి పరామ్', భారత న్యాయ వ్యవస్థ కోసం 'లీగల్ పరమ్' వంటి నిర్దిష్ట రంగాలకు చెందిన ప్రత్యేక ఏఐ మోడళ్లను భారత్‌జెన్ ఇప్పటికే విడుదల చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 17 బిలియన్ స్థిరాంకాలతో 22 అధికారిక భారతీయ భాషల్లో పనిచేసే 'పరామ్-2' టెక్స్ట్ ఫౌండేషన్ మోడల్, 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న 'శ్రుతమ్' స్పీచ్-టు-టెక్స్ట్ మోడల్స్, 12 భాషల్లో 'సూక్తం' టెక్స్ట్-టు-స్పీచ్ మోడల్స్, క్లిష్టమైన భారతీయ పత్రాలను వివిధ భాషల్లో సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా 'డాక్‌బోధ్' ఫ్రేమ్‌వర్క్ కింద రూపొందించిన 'పత్రమ్' మోడళ్లతో సహా భారత్‌జెన్ సరికొత్త మోడళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
భారతదేశ భాషా వైవిధ్యం కేవలం 22 అధికారిక భాషలకే పరిమితం కాదని.. విస్తృతంగా మాట్లాడే ప్రాంతీయ భాషలు, మాండలికాలను కూడా చేర్చుకుంటూ డేటాసెట్‌లను నిరంతరం విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రధానంగా చెప్పారు. శాస్త్రీయ పురోగతి అనేది పరిపాలనాపరమైన సరిహద్దులకు లోబడి ఉండకూడదని.. వాస్తవ ప్రపంచంలోని భాషా వైవిధ్యానికి అనుగుణంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా డిజిటల్ ఆరోగ్యం, ప్రభుత్వ సేవల లభ్యత వంటి రంగాల్లో ఇది అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
భారత్‌జెన్ వ్యవస్థ విద్యా సంస్థలు, ప్రభుత్వం, పరిశ్రమలను సమన్వయం చేస్తూ ఉమ్మడి నిధుల వ్యవస్థ ద్వారా ముందుకు సాగుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధానంగా చెప్పారు. ఈ కార్యక్రమం ఇప్పుడు 'భారత్‌జెన్ టెక్నాలజీ ఫౌండేషన్' అనే సెక్షన్-8 కంపెనీగా రూపాంతరం చెందిందని.. దీనివల్ల జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. అలాగే 'భారత్ డేటా సాగర్' వంటి కార్యక్రమాల ద్వారా మన దేశపు డేటా, ఏఐ మోడళ్లపై మనకే పూర్తి సార్వభౌమాధికారం ఉండేలా ఈ సంస్థ కృషి చేస్తుందని ఆయన వివరించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలని మంత్రి కోరారు. కృత్రిమ మేధ వంటి వర్ధమాన సాంకేతికతలకు విడివిడిగా కాకుండా సమష్టిగా పనిచేసే విధానాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. సహాయక విధానాలు, ప్రాథమిక దశలోనే నిధుల మంజూరు, ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఉద్ఘాటించారు. తద్వారా ప్రపంచ దేశాలతో సమానంగా భారత్ ముందడుగు వేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో భారత్‌జెన్ సీఈఓ శ్రీ రిషి బాల్, ఐఐటీ బాంబే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ గణేష్ రామకృష్ణన్, ఐఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ ఎస్. రవికిరణ్, భారత్‌జెన్ ఉపాధ్యక్షులు డాక్టర్ అమోల్ గీతేలు ప్రజెంటేషన్లు ఇచ్చారు. భారత్‌జెన్ వ్యవస్థ, డేటా ప్రయాణం, వినియోగానికి సిద్ధంగా ఉన్న ప్లాట్‌ఫామ్‌లు, వివిధ రంగాల భాగస్వామ్యాల గురించి వారు వివరించారు. ఎన్ఎంఐసీపీఎస్ ఛైర్మన్ డాక్టర్ క్రిస్ గోపాలకృష్ణన్, ఎలక్ట్రానిక్స్- ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్, డీఎస్‌టీ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరందీకర్, ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్‌లు ఈ సందర్భంగా ప్రసంగించారు. ఇదే వేదికపై మంత్రి సమక్షంలో భారత్‌జెన్, ఐఐటీ బాంబే హెరిటేజ్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదిరింది.
తన ప్రసంగాన్ని ముగిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.. భారత్‌జెన్ అనేది భారతదేశ ఏఐ ప్రయాణంలో ఒక నూతన అధ్యాయమని పేర్కొన్నారు. ఇది దేశపు సార్వభౌమ సామర్థ్యాన్ని, సమష్టి కృషి, అందరినీ కలుపుకుపోయే సమ్మిళిత రూపకల్పనను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. 'వికసిత్ భారత్' లక్ష్య సాధనకు అనుగుణంగా దేశంలో పటిష్ఠమైన ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో భారత్‌జెన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2229559)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8