ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ పాలనలో సాక్ష్యాధారిత ఏఐ వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026
బ్యాంకింగ్, ఆర్థిక రంగాలలో అధునాతన ఏఐ వినియోగానికి పటిష్టమైన, నాణ్యమైన డేటానే కీలకం
కృత్రిమ మేధ ద్వారా ప్రజా సేవలను అందించడానికి శాస్త్రీయ ధృవీకరణ, బాధ్యతాయుతమైన విధివిధానాలు అత్యంత ఆవశ్యకం
లబ్ధిదారుల గుర్తింపు కోసం ఏఐ వ్యవస్థలను విస్తరించే ముందు తగిన జాగ్రత్తలు తప్పనిసరి
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 6:25PM by PIB Hyderabad
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 రెండో రోజున “పాలనలో ఏఐ - ప్రభుత్వ సామర్థ్యంలో విప్లవాత్మక మార్పులు” అనే అంశంపై సమావేశం జరిగింది. ఇందులో ప్రపంచ స్థాయి పరిశోధకులు, సీనియర్ విధానకర్తలు కలిసి ప్రభుత్వ సేవలను భారీ స్థాయిలో మెరుగుపరచడానికి కృత్రిమ మేధను ఎలా ఉపయోగించవచ్చనే అంశంపై చర్చించారు. ఈ చర్చ కేవలం పైలట్ ప్రాజెక్టులు, హామీలకే పరిమితం కాకుండా, పరిగణించదగిన ప్రభావం చూపే దిశగా సాగింది. ఇందులో భాగంగా కఠినమైన మూల్యాంకనం, బాధ్యతాయుతమైన అమలు, ప్రభుత్వ యంత్రాంగం అంతటా వ్యవస్థాగత సంసిద్ధతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
టోగోలో నిర్దేశిత ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా చేరవేయడానికి మెషీన్ లెర్నింగ్‌ను ఎలా ఉపయోగించారో వివరిస్తూ డీన్ కర్లాన్ పరిశోధనా పత్రం సమర్పించడంతో ఈ సెషన్ ప్రారంభమైంది. ఏఐ మద్దతుతో లబ్ధిదారులను గుర్తించి సేవలు అందించినప్పుడు.. ఆహార భద్రత, మానసిక ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక సూచీల్లో గణనీయమైన మెరుగుదలలు కనిపించినట్లు ఈ అధ్యయనం నిరూపించింది. అదే సమయంలో, ఈ అధ్యయనం కొన్ని కీలక పరిమితులను కూడా బయటపెట్టింది: కేవలం ఫోన్ మెటాడేటా ఆధారంగా సేవల ప్రభావాన్ని అంచనా వేయడం సాధ్యపడలేదు. ఇది మోడల్ డ్రిఫ్ట్ సమస్యను, స్వల్పకాలికంగా ఆర్థికంగా దెబ్బతినే స్థితిని ముందుగా ఊహించడంలో ఉన్న సవాళ్లను స్పష్టం చేసింది.

పరిశోధన ఫలితాలు కఠినమైన ప్రయోగాలు, పునరావృత పరీక్షలు, సాక్ష్యాధారిత ఏఐ స్వీకరణ అవసరాన్ని స్పష్టం చేశాయి. ముఖ్యంగా లబ్ధిదారులను గుర్తించడం, వనరుల కేటాయింపు లేదా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐ వ్యవస్థలను ఉపయోగించేటప్పుడు వాటిని భారీ స్థాయిలో అమలు చేయడానికి ముందే క్షుణ్ణంగా అంచనా వేయాలని వక్తలు స్పష్టం చేశారు.
తదుపరి చర్చ ప్రభుత్వంలో ఏఐ అమలుకు భారత్ ఎంతవరకు సిద్ధంగా ఉందనే అంశంపై సాగింది. కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచడం, డేటా విభజన అడ్డంకులను తొలగించడం, ప్రభుత్వ రంగ ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించడంలో పురోగతి కనిపిస్తున్నప్పటికీ, ఇంకా కొన్ని కీలక సవాళ్లు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా వ్యవస్థల విస్తరణ, విభిన్న రకాల డేటా నిర్వహణ, నైతిక స్పష్టత వంటి అంశాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. కేవలం కొద్దిమంది ఏఐ నిర్వాహకులకు మాత్రమే తమ నైతిక విధివిధానాలపై పూర్తి అవగాహన ఉందని ఈ సందర్భంగా గుర్తించారు. సాంకేతిక సామర్థ్యంతో పాటు, పాలనలో ఉన్న ఈ లోపాన్ని కచ్చితంగా సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఈ చర్చ స్పష్టం చేసింది.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) కు చెందిన ఇండియా ఏఐ మిషన్ డైరెక్టర్ శ్రీ మహమ్మద్ వై. సఫీరుల్లా ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తూ, అధిక నాణ్యత కలిగిన వ్యవస్థీకృత డేటా అందుబాటులో ఉండటం వల్ల బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు వంటి రంగాల్లో ముఖ్యంగా పన్ను విశ్లేషణ, వ్యయాల ట్రాకింగ్ లో ఏఐ వినియోగం గణనీయంగా పురోగమించిందని తెలిపారు.
దీనికి భిన్నంగా, విద్య, ఇతర పౌర కేంద్రీకృత సేవల వంటి రంగాలు డేటా వైవిధ్యం, నిర్ణయాల్లో ఉండే అస్పష్టత కారణంగా మరిన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ రంగాల్లో ఏఐ వినియోగాన్ని భారీ స్థాయిలో విస్తరించాలంటే, లోతైన ప్రయోగాలు, థర్డ్-పార్టీ ఆడిట్లు, పటిష్టమైన ధృవీకరణ ప్రోటోకాల్స్ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో నిర్వహించిన ఒక అన్‌సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ ప్రక్రియను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అధిక నాణ్యత కలిగిన డేటా అందుబాటులో ఉండటం వల్ల, ముందస్తు చర్యలు తీసుకోవడం ఎలా సాధ్యమైందో ఆయన వివరించారు.
వ్యవస్థాగత మార్పుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నించే ముందే, తక్షణమే పరిష్కరించాల్సిన కార్యాచరణ లోపాలను గుర్తించి, ఏఐ ద్వారా వాటికి పరిష్కారాలు చూపడం. అధిక ప్రభావం చూపే నిర్దిష్ట సమస్యలను ముందుగా పరిష్కరించాలని వక్తలు సూచించడం ప్రధానాంశంగా మొత్తం సెషన్ సాగింది. వక్తలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా, ఏఐ వ్యవస్థల ద్వారా వచ్చే మధ్యంతర ఫలితాలను కొలవడం, కఠినమైన పైలట్ ప్రాజెక్టులను నిర్వహించడం థర్డ్ పార్టీ ఆడిట్‌లను తప్పనిసరి చేయడం వంటివి ప్రభుత్వ పాలనలో ప్రజల నమ్మకాన్ని నిర్మించడానికి అత్యంత కీలకం. ఇవి ఏఐ వినియోగాన్ని సమర్థవంతంగా, అందరికీ సమానంగా ఉండేలా చూస్తాయి.
ఏఐ ప్రభుత్వ సామర్థ్యాన్ని, సేవల నాణ్యతను గణనీయంగా పెంచగలదని, అయితే పటిష్టమైన డేటా, శాస్త్రీయ ధృవీకరణ, బాధ్యతాయుతమైన పాలనా విధివిధానాల ప్రాతిపదికన అమలు చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమని ఈ సమావేశం స్పష్టం చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2229324)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3