ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026: సామాజిక ప్రయోజనం,

డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాల కోసం మహిళల నేతృత్వంలో ఏఐ ప్రదర్శన

బాధ్యతాయుతమైన ఏఐ వ్యవస్థను మలుస్తున్న మహిళా ఆవిష్కర్తలకు

గుర్తింపునిస్తోన్న ‘ఏఐ బై హర్' గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్

సమ్మిళిత, విస్తరణకు వీలైన, సామాజిక ప్రభావమే లక్ష్యంగా ఏఐ పరిష్కారాలను

రూపొందిస్తున్న పది మహిళా నాయకత్వంలోని అంకురాలకు సత్కారం

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2026 8:47PM by PIB Hyderabad

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో భాగంగా నిర్వహించిన 'ఏఐ బై హర్' గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్.. సామాజిక ప్రభావమే లక్ష్యంగా సమ్మిళిత, బాధ్యతాయుతమైన ఏఐ వ్యవస్థల నిర్మాణం కోసం మహిళా ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, పరిశోధకులు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమంలో రోజు మొత్తం చర్చలు, అంకురాల ప్రదర్శనలు కొనసాగాయి. పాఠశాల స్థాయి సమస్యల పరిష్కారం, డీప్-టెక్ పరిశోధనల నుంచి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, భద్రత, ప్రజా మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో విస్తరించే సామర్థ్యం ఉన్న అంకురాల వరకు భారతదేశపు ఏఐ ప్రయాణాన్ని మహిళల నేతృత్వంలోని ఆవిష్కరణలు మలిచే తీరును ఈ ఛాలెంజ్ ప్రత్యేకంగా చాటిచెప్పింది.

 

 

 

ఈ కార్యక్రమం వివిధ అంశాలపై ప్యానెల్ చర్చలు, ర్యాపిడ్ అంకుర ప్రదర్శనలు, నిపుణుల నేతృత్వంలోని సంభాషణలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. సానుభూతి, నమ్మకం, దీర్ఘకాలిక దార్శనికతతో కూడిన ఏఐ ఆవిష్కరణలు సమాజంలో ఉత్తమ ఫలితాలను ఎలా తీసుకురాగలవో ఈ చర్చలు సమష్టిగా నిరూపించాయి.

 

 

 

ఈ కార్యక్రమం 'ఆమె మొదటి ఆల్గారిథమ్: భారతదేశపు తదుపరి సంచలనం' అనే ప్యానెల్ చర్చతో ప్రారంభమైంది. ఆవిష్కరణలు అనేవి తరచుగా సానుభూతి, జిజ్ఞాస, వ్యక్తిగత అనుభవాల నుంచి ఉద్భవించే తీరును ఈ సెషన్‌లో చర్చించారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రోగ్రామ్ లీడ్ శ్రీమతి దీపాలి ఉపాధ్యాయ ఈ చర్చా కార్యక్రమానికి సారథ్యం వహించారు. ఇందులో నాగార్జున మోడల్ పాఠశాల (ఆంధ్రప్రదేశ్), డెల్ పబ్లిక్ పాఠశాల (గ్రేటర్ ఫరీదాబాద్), ఆదర్శ్ పబ్లిక్ పాఠశాలలకు (ఢిల్లీ) చెందిన యువ మహిళా ఆవిష్కర్తలు పాల్గొన్నారు. కళాకారుల జీవనోపాధి, ధాన్యపు నిల్వ సామర్థ్యం పెంచడం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన ఏఐ పరిష్కారాలను వారు ప్రదర్శించారు. పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, అంకురాల్లో ఆవిష్కరణలను ఒక వ్యవస్థాగత రూపంలోకి తీసుకురావడంలో 'అటల్ ఇన్నోవేషన్ మిషన్' వంటి జాతీయ కార్యక్రమాలు పోషిస్తోన్న పాత్రను ఈ చర్చా వేదిక ప్రధానంగా తెలియజేసింది.

 

 

 

‘పరిశోధనల నుంచి ప్రజల వరకు: ఆవిష్కరణలను ప్రభావవంతమైన పరిష్కారాలుగా మార్చడం' అనే ప్యానెల్ చర్చ ప్రధానంగా పరిశోధనల ఆధారిత ఆవిష్కరణలను ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఆర్థిక సాంకేతికతలు వంటి రంగాల్లో భారీగా ఉపయోగించగల పరిష్కారాలుగా ఎలా మార్చవచ్చనే అంశంపై దృష్టి సారించింది. ఎస్య సెంటర్ డైరెక్టర్ శ్రీమతి మేఘనా బాల్ ఈ చర్చకు సారథ్యం వహించగా.. అశోక విశ్వవిద్యాలయ బయోసైన్సెస్ అండ్ హెల్త్ రీసెర్చ్ డీన్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్, భారత్ ఇన్నోవేషన్ ఫండ్- థింక్‌ఏజీ సహ వ్యవస్థాపకులు శ్రీ హేమేంద్ర మాథుర్, ఓపీఎల్ ఇన్నోవేట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ శ్రీ రవీంద్ర మిశ్రా ఇందులో పాల్గొన్నారు. కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా నిరంతర సామాజిక ప్రభావాన్ని చూపించేందుకు నమ్మకం, రంగాల వారీగా ప్రత్యేక డిజైన్లు, బాధ్యతాయుతమైన డేటా వినియోగం, భారతదేశపు డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాన్ని వినియోగించుకోవడం అత్యంత కీలకమని ఈ చర్చా వేదిక ప్రధానంగా పేర్కొంది.

‘అంకుర విజయ సూత్రాల మార్పు: ఆమెను దాటుకొని కాదు.. ఆమెతోనే సాధ్యం' అనే చర్చా కార్యక్రమం.. స్పష్టత, సంసిద్ధత, దీర్ఘకాలిక పట్టుదలతో బలమైన, విస్తరించదగ్గ వ్యాపారాలను మహిళా వ్యవస్థాపకులు ఎలా నిర్మిస్తున్నారో విశ్లేషించింది. ట్రైలీగల్ పార్ట్నర్ శ్రీ రాహుల్ మత్తన్ ఈ చర్చకు సారథ్యం వహించగా.. జెట్‌సెట్‌గో ఏవియేషన్ సర్వీసెస్ వ్యవస్థాపకులు- సీఈఓ శ్రీమతి కనికా టేక్రివాల్, మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవసాయ పరికరాల వ్యాపార అధునాతన సాంకేతికతల చీఫ్ శ్రీమతి రుచా నానావతి, బాట్‌ల్యాబ్ డైనమిక్స్ ఎండీ - సహ వ్యవస్థాపకులు శ్రీమతి సరితా అహ్లావత్ ఇందులో పాల్గొన్నారు. క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, బలమైన అనుబంధ వ్యవస్థలు, నిరంతర కృషి ద్వారా మహిళా వ్యవస్థాపకులు మారుతున్న సమస్యలను ఎలా అధిగమిస్తున్నారో, సంక్లిష్టమైన పరిశ్రమల్లో తమ వ్యాపారాలను ఎలా విస్తరిస్తున్నారో ఈ సంభాషణ తెలియజేసింది.

 

వ్యవస్థాపకులు కేవలం స్వల్పకాలిక ఆవిష్కరణలకే పరిమితం కాకుండా వ్యవస్థాగత లోపాలను పరిష్కరించే ఆధారభూతమైన ఏఐ పరిష్కారాలను ఎలా నిర్మించవచ్చనే అంశంపై 'మార్పు కోసం నవ నిర్మాణం: మూస ధోరణులను విడనాడటం’ అనే చర్చా సెషన్ దృష్టి సారించింది. నీతి ఆయోగ్ విశిష్ట సభ్యులు- ఫ్రాంటియర్ టెక్ హబ్ ఇనిషియేటివ్ చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీమతి దేబజాని ఘోష్ ఈ చర్చకు సారథ్యం వహించారు. ఈ ప్యానెల్‌లో ది టెలిరాడ్ గ్రూప్ చీఫ్ డ్రీమర్ డాక్టర్ సునీత మహేశ్వరి, సీఏఆర్‌పీఎల్.ఏఐ వ్యవస్థాపకులు- సీఈఓ శ్రీ విదుర్ మహాజన్, క్యూపీఐఏఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ- వ్యవస్థాపకులు డాక్టర్ నాగేంద్ర నాగరాజ పాల్గొన్నారు. దీర్ఘకాలిక విశ్వాసం, వ్యవస్థల మధ్య సహకారం.. సంక్లిష్టమైన సాంకేతికతలను విస్తరించదగ్గ, సుస్థిరమైన వ్యాపార నమూనాలుగా మార్చవలసిన ఆవశ్యకతను ఈ చర్చలో ప్రధానంగా ప్రస్తావించారు.

 

ఈ రోజంతా వివిధ 'అంకుర స్పాట్‌లైట్' సెషన్‌లను నిర్వహించారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన, ఎంపిక చేసిన మహిళల నేతృత్వంలోని అంకురాలు వినూత్న పరిష్కారాలను 10 నిమిషాల ప్రదర్శనల ద్వారా వివరించాయి:

 

స్పాట్‌లైట్ 1 – కాగ్నిటీ: సాంకేతికత ఆధారిత, అభ్యాసకుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అభ్యాస పరిష్కారాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్న ఏఐ ప్లాట్‌ఫాం.

 

స్పాట్‌లైట్ 2 – సెల్‌వర్స్ సంస్థ: ఫార్మాస్యూటికల్, కాస్మొటిక్ పరిశోధనల కోసం జంతువులపై పరీక్షలు అవసరం లేకుండా ఏఐ ద్వారా ద్రువీకరించిన '3డీ బయోప్రింటెడ్ డిసీజ్ మోడల్స్'ను ఇది అభివృద్ధి చేస్తోంది.

 

స్పాట్‌లైట్ 3 – బెటర్‌ల్యాబ్: ఇది ఏఐ ఆధారిత ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫాం. ఇది పరిశోధన, అభివృద్ధి పనితీరును మెరుగుపరుస్తూ ఆవిష్కరణల వేగాన్ని పెంచుతుంది.

 

స్పాట్‌లైట్ 4 – సెక్యూర్ బ్లింక్: అప్లికేషన్, ఏపీఐ భద్రత కోసం రూపొందించిన ఏఐ ప్లాట్‌ఫాం. ఇది నిరంతరం లోపాలను గుర్తిస్తూ భద్రతాపరమైన పరిష్కారాలను వేగంగా అందిస్తుంది.

 

స్పాట్‌లైట్ 5 – క్రాటిక్ ఏఐ: కర్మాగారాల్లో పనిచేసే వారి కోసం రూపొందించిన బహుభాషా ఏఐ సహోద్యోగి. ఇది భద్రతను పెంపొందించడమే కాకుండా పనితీరు, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

 

స్పాట్‌లైట్ 6 – బేరు: వాయిస్-ఆధారిత డేటా సేకరణ ద్వారా సముద్రపు ప్లాస్టిక్ వ్యర్థాల గుర్తింపు, సేకరణను నిజసమయంలో పర్యవేక్షించే ఏఐ ప్లాట్‌ఫాం.

 

స్పాట్‌లైట్ 7 – అర్ఘ్యం : నీళ్ల విషయంలో ప్రభుత్వ పరిపాలన, సేవల పంపిణీని బలోపేతం చేయడానికి ఏఐ, డిజిటల్ ప్రజా సదుపాయాన్ని వినియోగిస్తున్న మహిళల నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థ.

 

స్పాట్‌లైట్ 8 – ట్రూప్రెన్యూర్స్.ఏఐ: పాఠశాల విద్యార్థులలో (కే-12) వ్యవస్థాపకతను ప్రోత్సహించే ప్రపంచపు మొట్టమొదటి ఏఐ ప్లాట్‌ఫాం. ఇది సృజనాత్మకత, వాస్తవ సమస్యల పరిష్కారం ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతుంది.

 

స్పాట్‌లైట్ 9 – సైకెడెలిక్ : ఇంటెలిజెంట్, ఇమ్మర్సివ్ శ్రవణ అనుభూతుల ద్వారా వ్యక్తిగత ఆడియోను సరికొత్తగా ఆవిష్కరిస్తున్న ఏఐ ఆధారిత హెడ్‌ఫోన్‌లు.

 

స్పాట్‌లైట్ 10 – ఆక్వాఎయిర్-ఎక్స్: క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో నిజసమయ నిర్ణయాలు తీసుకోవడానికి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను సమన్వయం చేసే ఏఐ స్వయంప్రతిపత్త వ్యవస్థలు.

 

స్పాట్‌లైట్ 11 – రోష్ని ఏఐ: నమ్మకమైన మహిళా నెట్‌వర్క్‌ల ద్వారా స్థానిక భాషల్లో వ్యక్తిగతీకరించిన విద్యను అందించే వాయిస్-ఆధారిత ఏఐ అభ్యాస ఉపకరణ సాధనం.

 

స్పాట్‌లైట్ 12 – క్లిప్రి ఏఐ: వాతావరణ, ప్రాకృతిక ముప్పుల నిర్వహణను డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాన్ని ప్రతిపాదిస్తున్న ప్లాట్‌ఫాం. ఇంధనం, వ్యవసాయం, పట్టణ వ్యవస్థలలో ముందస్తు రక్షణ కోసం 'నేషనల్ క్లైమేట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ'ను రూపొందించడమే దీని లక్ష్యం.

ఈ రోజంతా జరిగిన కార్యక్రమాలు 'ప్రవేశం నుంచి ప్రగతి దాకా: మహిళా స్టార్టప్‌లకు డబ్ల్యూఈపీ ఇచ్చే ప్రోత్సాహం’ అనే సెషన్‌తో ముగిశాయి. నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఉమెన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫాం (డబ్ల్యూఈపీ) మిషన్ డైరెక్టర్ శ్రీమతి అన్నా రాయ్ ఈ సెషన్‌లో పాల్గొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనల స్థాయి నుంచి వ్యాపార విస్తరణ వరకు ఎదుగుదల సాధించేలా ఒక సమగ్రమైన మద్దతు వ్యవస్థను రూపొందించడంలో డబ్ల్యూఈపీ పోషిస్తున్న పాత్రను ఆమె వివరించారు. “ డబ్ల్యూఈపీ ప్రధాన లక్ష్యం మహిళా శక్తిని బలోపేతం చేయడం. మేం సానుకూల ప్రవర్తనా మార్పులను ప్రోత్సహిస్తూ సరైన సమయంలో సరైన విజ్ఞానాన్ని అందిస్తూ మహిళా వ్యవస్థాపకులు సంస్థలను ఉన్నత శిఖరాలకు చేర్చేలా తోడ్పాటునందిస్తాం” అని శ్రీమతి అన్నా రాయ్ పేర్కొన్నారు. ఎంపిక చేసిన 150 మహిళా నేతృత్వంలోని ఏఐ అంకురాల కోసం ప్రత్యేక సామర్థ్య పెంపు కార్యక్రమాన్ని ఆమె ప్రకటించారు. ఇందులో భాగంగా వివిధ రంగాల భాగస్వాములతో కలిసి వీరికి క్రమబద్ధమైన మార్గదర్శకత్వం, నెట్‌వర్కింగ్ మద్దతు అందుతోంది. పారిశ్రామిక విజయం సాధించాలంటే అన్ని కోణాల్లో సమగ్ర మద్దతు అవసరమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

 

 

టాప్ 10 విజేతల పేర్లను ప్రకటించడంతో శ్రీమతి అన్నా రాయ్ ఈ రోజంతా జరిగిన కార్యక్రమాలను ముగించారు. విజేతలుగా నిలిచిన అంకుర సంస్థలు: ఏబుల్ క్రెడిట్, అసో ఏఐ, పవర్ లైఫ్‌లైన్, వెరిఫై టెక్నాలజీస్, ప్రాజెక్ట్ డ్రైవ్స్, ప్రోసిగో లాంగ్వేజ్, వీడియోస్ హెచ్ఆర్, దట్ క్రియేటింగ్, వాటర్ అల్ట్రా ఏఆర్, జికో ఏఆర్. వివిధ పరిశీలన అంచెల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచినందుకు గాను ఆమె ఈ పది అంకురాలను అభినందించారు.

***

 


(రిలీజ్ ఐడి: 2229050) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Malayalam