రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే ‘పీఎం రాహత్’ పథకం ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
14 FEB 2026 6:59PM by PIB Hyderabad
'సేవా తీర్థ్'కు ప్రధానమంత్రి కార్యాలయం మారిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి నిర్ణయంగా 'పీఎం రాహత్' (పీఎం రాహత్ - రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి నివాసం, నిశ్చయ వైద్యం) పథకం ప్రారంభానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. సేవ, కరుణ, ప్రజల రక్షణే పునాదిగా సాగుతున్న ప్రభుత్వ పరిపాలనా విధానానికి ఇది నిదర్శనంగా ఉంది. రోడ్డు ప్రమాదం తర్వాత తక్షణ వైద్య సహాయం అందకపోవటంతో ఏ ఒక్క ప్రాణం కూడా నష్టపోకూడదనే ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయాన్ని తెలియజేస్తోంది.
భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల గణనీయమైన సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో చాలా వరకు సకాలంలో వైద్యం అందించటం ద్వారా నివారించొచ్చు. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు బాధితులను ఆసుపత్రిలో చేర్పించగలిగితే దాదాపు 50 శాతం మరణాలను నివారించొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. సేవా తీర్థ్ నుంచి 'పీఎం రాహత్'ను ఆమోదించడం ద్వారా ప్రాణాలను రక్షించే తక్షణ వైద్యానికి, ఆసుపత్రులకు ఆర్థిక భరోసా, ప్రమాద బాధితుల కోసం ఒక నిర్మాణాత్మక అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థకు ప్రధానమంత్రి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు.
ఈఆర్ఎస్ఎస్ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్) 112 హెల్ప్‌లైన్‌తో ఈ పథకాన్ని అనుసంధానించడం ద్వారా ప్రమాద బాధితులు 'గోల్డెన్ అవర్'లోపు ఆసుపత్రికి చేరుకునేలా చర్యలు తీసుకుంటారు. రోడ్డు ప్రమాద బాధితులు, 'రాహ్-వీర్' (సహాయం చేసే వ్యక్తులు) లేదా ప్రమాద స్థలంలో ఉన్న ఎవరైనా సరే 112 నంబర్‌కు డయల్ చేయడం ద్వారా సమీపంలోని గుర్తింపు పొందిన ఆసుపత్రి వివరాలను పొందొచ్చు. అంబులెన్స్ సహాయాన్ని కోరచ్చు. ఇది అత్యవసర సేవా సిబ్బంది, పోలీసు యంత్రాంగం, ఆసుపత్రుల మధ్య వేగవంతమైన సమన్వయానికి వీలు కల్పిస్తుంది.
ఈ పథకం కింద ఏ రకమైన రోడ్డుపైన ప్రమాదం జరిగినప్పటికీ అర్హులైన ప్రతి బాధితుడికి రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందుతుంది. ప్రమాదం జరిగిన తేదీ నుంచి 7 రోజుల వరకు ఈ సదుపాయం వర్తిస్తుంది. ప్రాణాపాయం లేని సందర్భాల్లో 24 గంటల వరకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు 48 గంటల వరకు బాధితుడి ఆరోగ్యాన్ని స్థిరపరిచే చికిత్స అందిస్తారు. అయితే ఇది సమగ్ర డిజిటల్ వ్యవస్థ ద్వారా పోలీసు ధ్రువీకరణకు లోబడి ఉంటుంది.
పీఎం రాహత్ పథకాన్ని అత్యంత పటిష్ఠమైన, సాంకేతిక ఆధారిత ఫ్రేమ్‌వర్క్ ద్వారా అమలుచేయనున్నారు. ఇది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన 'ఈ-డార్ (ఎలక్ట్రానిక్ డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్)' ప్లాట్‌ఫారమ్‌ను, నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన ట్రాన్సాక్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో (టీఎంఎస్ 2.0) అనుసంధానిస్తుంది. దీనిద్వారా ప్రమాదం జరిగినట్లు రిపోర్ట్ చేయటం నుంచి మొదలుకొని ఆసుపత్రిలో చేరడం, పోలీసు ధ్రువీకరణ, చికిత్స అందించడం, చివరిగా ఆసుపత్రులకు చెల్లింపులు చేయటం వరకు అంతా డిజిటల్ రూపంలో నిరంతరాయంగా జరుగుతుంది. జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రాణాపాయం లేని కేసుల్లో 24 గంటల్లోపు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న కేసుల్లో 48 గంటల్లోపు పోలీసు ధ్రువీకరణ పూర్తి కావాల్సి ఉంటుంది.
ఆసుపత్రులకు చేసే చెల్లింపులు (రీయింబర్స్‌మెంట్) 'మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్' (ఎంవీఏఎఫ్) ద్వారా జరుగుతాయి. ప్రమాదానికి కారణమైన వాహనానికి బీమా ఉంటే ఆ మొత్తాన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తీసుకుంటారు. ఒకవేళ బీమా లేకపోయినా లేదా అది 'హిట్ అండ్ రన్' కేసు అయినా సరే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ద్వారా ఆసుపత్రులకు చెల్లింపులు చేస్తారు. రాష్ట్ర ఆరోగ్య సంస్థ ఆమోదించిన క్లెయిమ్‌లను 10 రోజుల్లోపు చెల్లిస్తారు. దీనివల్ల ఆసుపత్రులకు ఆర్థిక భరోసా లభించి చికిత్సకు ఎలాంటి ఆటంకం కలగదు.
బాధితుల ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మెజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన ఉండే జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ఒక అధికారిని నియమిస్తుంది. ఇది జిల్లా స్థాయిలో జవాబుదారీతనం నిర్ధారిస్తుంది.
'సేవా తీర్థ్' నుంచి ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది 'పౌరుడే ప్రథమం' అనే ప్రభుత్వ విధానానికి ప్రతీకగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క బాధితుడికి ప్రాణరక్షక చికిత్స అందకుండా ఉండకూడదన్న లక్ష్యంతో భారతదేశ అత్యవసర వైద్య సేవా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఒక నిర్ణయాత్మక కార్యక్రమమే ఈ పీఎం రాహత్.
(రిలీజ్ ఐడి: 2228342)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9