అణుశక్తి విభాగం
అణుశక్తి విస్తరణ పనుల వేగవంతంపై రాజ్యసభలో వివరాలు వెల్లడించిన డాక్టర్ జితేంద్ర సింగ్.. 2031-32 నాటికి మూడు రెట్లు పెరగనున్న ఉత్పత్తి సామర్థ్యం
అనుకున్న సమయానికే కూడంకుళం 3 నుంచి 6 యూనిట్ల పనులు పూర్తి.. భౌగోళిక రాజకీయ మార్పుల ప్రభావం, వ్యయం పెంపు, ఆలస్యం వంటివి జరగవని డాక్టర్ జితేంద్ర సింగ్ హామీ
డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. పురోగతిలో ఉన్న జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు చర్చలు, సిద్ధమైన 6x1600 మెగావాట్ల సామర్థ్యం గల ముసాయిదా, వాణిజ్యపరమైన అంశాలపై కొనసాగుతున్న చర్చలు
"కేవలం విదేశీ యురేనియంపై ఆధారపడని భారత్.. 2014 నుంచి రెట్టింపైన అణు విద్యుత్ సామర్థ్యం, 2035 వరకు సుంకం మినహాయింపులతో 2032 నాటికి 22 గిగావాట్లు, 2047 నాటికి 100 గిగావాట్ల లక్ష్యం"
'భద్రతకు తొలి ప్రాధాన్యం-తర్వాతే ఉత్పత్తి' సిద్ధాంతం, సమాన అణుశక్తి కేటాయింపు విధానం.. గాడ్గిల్ ఫార్ములా ద్వారా ఆతిథ్య రాష్ట్రానికి 50% విద్యుత్ కేటాయింపులపై డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టత
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 4:30PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. విధానపరమైన సంస్కరణలు, ప్రైవేట్ భాగస్వామ్యం, 2047 వరకు నిర్దేశించుకున్న స్పష్టమైన సామర్థ్య లక్ష్యాల మద్దతుతో.. భారతదేశ అణుశక్తి కార్యక్రమం ప్రస్తుతం నిర్ణయాత్మకమైన విస్తరణ దశలో ఉందని వెల్లడించారు.
2014లో 4,780 ఎండబ్ల్యూగా ఉన్న భారత అణుశక్తి సామర్థ్యం ప్రస్తుతం 8,780 ఎండబ్ల్యూకి పెరిగిందని మంత్రి తెలిపారు. ఇది 2031-32 నాటికి 22,380 ఎండబ్ల్యూకు, 2037 నాటికి 47 జీడబ్ల్యూకు, 2042 నాటికి 67 జీడబ్ల్యూకు, 2047 నాటికి 100 జీడబ్ల్యూకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. భారతదేశం స్వావలంబన దిశగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని, భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రస్తుతం కొనసాగుతున్న అణుశక్తి ప్రాజెక్టులను అడ్డుకోలేవని స్పష్టం చేశారు.
ఆర్. గిరిరాజన్, జైరాం రమేశ్, రాంగోపాల్ యాదవ్, ఎం. తంబిదురైలు లేవనెత్తిన అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రాజెక్టుల కాలపరిమితి, అంతర్జాతీయ చర్చలు, ఇంధన భద్రత, సీఎస్ఆర్ కార్యక్రమాలు, విద్యుత్ పంపిణీ ఒప్పందాలకు సంబంధించిన అంశాలను మంత్రి వివరించారు.
కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. 3, 4 యూనిట్ల పనులను 2026-27 నాటికి.. 5, 6 యూనిట్ల పనులను 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. భారత్-అమెరికా సంబంధాల్లో మార్పులతో సహా, ఇటీవల భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల ఈ ప్రాజెక్టులకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు చరిత్రను వివరిస్తూ కూడంకుళం ప్రాజెక్టు 1988లో రూపదిద్దుకోగా 2002లో నిర్మాణ పనులు ప్రారంభమై, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2014లో మొదటి యూనిట్ అందుబాటులోకి వచ్చినట్లు మంత్రి తెలిపారు. దశాబ్ద కాలంలో మొదటి రెండు యూనిట్లు కార్యకలాపాలను ప్రారంభించటం, స్పష్టమైన అమలు విధానాన్ని, కాలపరిమితులకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేయటాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.
16 కిలోమీటర్ల అత్యవసర ప్రణాళికా పరిధిలో చేపడుతున్న కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. అన్ని అణుశక్తి కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని ప్రజల కోసం సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)గా, పునరావాస, పునరుద్ధరణ (ఆర్ అండ్ ఆర్) కార్యకలాపాలను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తుందని తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టులన్నింటికీ రూ.168 కోట్లు వెచ్చించగా, సీఎస్ఆర్ ద్వారా గణనీయమైన కేటాయింపులు జరిగినట్లు ఆయన సభకు తెలియజేశారు. గత నాలుగేళ్లలో కూడంకుళం ప్రాజెక్టుకు సంబంధించి కచ్చితమైన గణాంకాలను విడిగా సమర్పిస్తామని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు, స్థానిక ప్రజలకు ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తాయని తెలిపారు.
జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టులో ప్రతిపాదిత ఆరు 1600 ఎండబ్ల్యూ రియాక్టర్లకు సంబంధించిన చర్చలపై అడిగిన ప్రశ్నకు డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ.. చర్చలు కొనసాగుతున్నాయని, సాంకేతిక ఒప్పంద ముసాయిదా సిద్ధంగా ఉన్నప్పటికీ, కొన్ని వాణిజ్యపరమైన అంశాలు ఇంకా పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ, సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
యూరేనియం దిగుమతులు, అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితుల వల్ల సరఫరా సమస్యలపై వ్యక్తమైన ఆందోళనలకు డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. గత దశాబ్ద కాలంలో ఇంధన భద్రతను భారత్ గణనీయంగా బలోపేతం చేసుకుందని తెలిపారు. 2014 నుంచి అణుశక్తి సామర్థ్యం రెట్టింపు కంటే అధికమైందని, దేశీయ సామర్థ్యాన్ని వేగవంతం చేసేందుకు ఇటీవల కాలంలో అణు విద్యుత్ ప్లాంట్ పరికరాల దిగుమతులపై 2035 వరకు సుంకం మినహాయింపులు వంటి విధానపరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. భారతదేశం కేవలం బాహ్య వనరులపైనే ఆధారపడటం లేదని, స్వదేశీ సామర్థ్యాన్ని స్థిరంగా పెంపొందించుకుంటున్నట్లు ఈ విస్తరణ ప్రణాళికలు స్పష్టం చేస్తున్నాయన్నారు.
విద్యుత్ కేటాయింపులపై అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ.. అణు విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ పంపిణీ గాడ్గిల్ ఫార్ములా ప్రకారం జరుగుతుందని, ఉత్పత్తయిన విద్యుత్తులో 50% వాటాను ఆతిథ్య రాష్ట్రం నిలుపుకుంటుందని, 35% పొరుగు రాష్ట్రాలకు కేటాయిస్తుందని, మిగిలిన 15% కేంద్ర గ్రిడ్‌కు వెళ్తుందని చెప్పారు. ఈ విధానం ప్రాంతాల మధ్య సమాన పంపిణీని సూచిస్తుంది.
కుడంకుళం ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనలు, గతంలో వెలువడిన అభ్యంతరాలపై మంత్రి సమాధానమిచ్చారు. "భద్రతకే తొలి ప్రాధాన్యత.. తర్వాతే ఉత్పత్తి" అనే సూత్రంపై భారత అణు కార్యక్రమం పనిచేస్తుందని స్పష్టం చేశారు. కుడంకుళంలో వాడేసిన ఇంధనాన్ని ఒకే చోట నిల్వ చేస్తున్నారన్న ఆరోపణలకు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రతి రియాక్టర్.. దానికి సంబంధించిన ఇంధన ప్రక్రియను స్వయంగా నిర్వహిస్తుందని వివరించారు.
అణువిస్తరణకు ప్రభుత్వం స్పష్టమైన సమయపాలనను నిర్ణయించిందని, వాటిని నిర్మాణాత్మకంగా, క్రమశిక్షణతో అమలు చేస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. భారతదేశ దీర్ఘకాలిక ఇంధన పరివర్తన వ్యూహంలో అణుశక్తి కీలకంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2227198)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12