రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హరిత హైవేలతో పాటు పర్యావరణానుకూల రహదారి మౌలిక సదుపాయాల కల్పన

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2026 8:17PM by PIB Hyderabad
హరిత హైవేలు (మొక్కల పెంపకం, అంటుకట్టడం, సౌందర్యీకరణ, నిర్వహణ) విధానం-2015తో పాటు భారతీయ రోడ్డు కాంగ్రెస్ (ఐఆర్‌సీ): ఎస్‌పీ: 21-2009కు కూడా అనుగుణంగా.. జాతీయ హైవేలలో అందుబాటులో ఉన్న మార్గాలు, మధ్య భాగాలతో సహా వీలు ఉన్న చోట్ల మొక్కలను పెంచే కార్యకలాపాలను చేపడుతున్నారు. ఈ క్రమంలో, దీర్ఘకాలం పాటు జీవించి ఉండే, వాతావరణంలోకి ప్రవేశించిన కర్బన అవశేషాల్ని పీల్చుకొనే సామర్థ్యం కలిగిన దేశీయ జాతుల మొక్కలు పెంచడంపై శ్రద్ధ తీసుకుంటున్నారు.
రీసైకిలింగ్ పూర్తి చేసిన సామగ్రినీ, వ్యర్థాలతో తయారు చేసిన ఉత్పాదనలనీ, పర్యావరణానుకూల సాంకేతికతలనీ జాతీయ హైవే ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణల్లో సంబంధిత ఏజెన్సీలు ఉపయోగిస్తుండడమే కాకుండా ఈ  పద్ధతిని నిరంతర ప్రాతిపదికన అనుసరిస్తున్నాయి.
హైవే ప్రాజెక్టుల్లో సాంకేతిక విశిష్టతలకు అనుగుణంగా మన్నికయిన సామగ్రినీ, రీసైకిలింగ్ పూర్తి చేసిన సామగ్రినీ ఉపయోగిస్తుంటారు. ఉదాహరణగా చెప్పాలంటే గట్టు కట్టడం, నిర్మాణ సంబంధి పనుల్లో ఫ్లయ్ యాష్, బిటుమిన్ పొరలను పరుస్తూ రీక్లెయిమ్‌డ్ ఆస్ఫాల్ట్ పేవ్‌మెంట్ (ఆర్ఏపీ) ఏర్పాటు, నిర్మాణ పనుల్లో కూల్చివేతల్లో (సీ అండ్ డీ) పోగుపడే వ్యర్థాలు.. ఇలాంటివి వాడుతారు.
పర్యావరణానికి సంబంధించిన ఆందోళనలను దూరం చేయడానికీ, రోడ్డు పనితీరును మెరుగుపరచడానికీ సాధ్యమైనంత మేరకు మార్గదర్శక సూత్రాలను పాటిస్తూ బిటుమిన్‌తో కూడిన మిశ్రమాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల ఉపయోగం, నేచురల్ జియో టెక్స్‌టైల్స్‌తో పాటు శ్లాగు, క్రంబ్ రబ్బరు, ఇతర రీసైకిల్ చేసిన లేదా పారిశ్రామిక ఉప ఉత్పాదనల వంటి మన్నిక కలిగి ఉండే సామగ్రి ఉపయోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.

ఈ విధమైన కార్యక్రమాలు.. భూమిపై జీవరాశి మనుగడ కొనసాగడానికి అవసరమైన మోతాదులో భూతాపాన్ని సంతులితంగా ఉంచడానికి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్ని తగ్గించడంతో పాటు, హైవేల నిర్మాణంలో పర్యావరణ భ్రష్టతకు దారి తీసే కొన్ని చర్యల్ని కనీస స్థాయులకు పరిమితం చేయడంలో గొప్ప తోడ్పాటును అందిస్తూ వాతావరణ పరిరక్షణ విషయంలో భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలకు దోహదపడుతున్నాయి. అంతేకాక, వనరుల సామర్థ్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా సర్కులర్ ఎకానమీ (సామగ్రిని పునరుపయోగించడాన్నీ, సరికొత్త రూపాల్లో వినియోగించడాన్నీ బలపరిచే ఆర్థిక ప్రణాళిక) సిద్ధాంతాలకూ ఊతం లభిస్తోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ జైరాం గడ్కరీ రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో అందించారు.
 
 
***

(రిలీజ్ ఐడి: 2227053) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी