సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ ట్యాక్సీ

నాడు పోస్టు చేయడమైనది: 10 FEB 2026 5:12PM by PIB Hyderabad

ఉపాధి కల్పన, సామాజిక భద్రత, క్షేత్రస్థాయిలో ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించే సాధనాలుగా సహకార సంస్థలను బలోపేతం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. యాజమాన్యంలో, పాలనలో, విలువను సృష్టించడంలో కేంద్రంగా, సారథులుగా డ్రైవర్లను వ్యవహరిస్తూ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుగా భారత్ ట్యాక్సీని పరిగణిస్తున్నారు. తద్వారా అగ్రిగేటర్ల విధానానికి సుస్థిరమైన, గౌరవప్రదమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. భారత్‌లో సహకార ఆధారిత రైడ్ అందించే తొలి వేదిక ‘‘భారత్ ట్యాక్సీ’’. సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి, ‘సహకార్ సే సమృద్ధి’ అనే దార్శనికతకు అనుగుణంగా, సమగ్రమైన, పౌర కేంద్రీకృత రవాణా పరిష్కారాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిలో ఇదొక ప్రధాన మైలురాయి. బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం-2002 కింద భారత్ టాక్సీ నమోదయింది. సహకార రంగంలో పనిచేస్తున్న 8 జాతీయ స్థాయి సంస్థల తోడ్పాటుతో 2025, జూన్ 6న ఇది ప్రారంభమైంది. సున్నా కమిషన్ నమూనాలో ఈ వేదిక పనిచేస్తుంది. దీనిలో వచ్చే లాభాలను నేరుగా డ్రైవర్లకే పంపిణీ చేస్తారు. ఇది పెట్టుబడి ఆధారిత అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లకు పూర్తి స్వదేశీ, ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

 

ప్రస్తుతానికి భారత్ టాక్సీ సేవలు ఢిల్లీ ఎన్సీఆర్- ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడాలోనూ, గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సోమనాథ్, ద్వారకల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లో ఇప్పటివరకు 990,082 మంది వినియోగదారులు, 3 లక్షల కంటే ఎక్కువ మంది డ్రైవర్లు నమోదు చేసుకున్నారు. వీరు ఇప్పటివరకు 291,665 రైడ్‌లను పూర్తి చేశారు. దశలవారీగా 2029 నాటికి దేశవ్యాప్తంగా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భారత్ ట్యాక్సీ లక్ష్యంగా పెట్టుకుంది.

 

ప్రస్తుతానికి, యాప్ ద్వారా ప్రయాణికులు లేదా డ్రైవర్ల నుంచి సేవా సౌలభ్య రుసుము, ప్లాట్‌ఫారమ్ ఫీజు లేదా కమీషన్ రూపంలో ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. అయితే, భారత్ టాక్సీ నిర్వహిస్తున్న విమానాశ్రయ ప్రీపెయిడ్ బూత్‌ల వద్ద, నిర్వహణ ఖర్చుల కోసం ఛార్జీపై 7 శాతం సేవా రుసుము వర్తిస్తుంది.

 

ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పదవీ విరమణ పొదుపు, డ్రైవర్లకు తోడ్పాటు అందించే ప్రత్యేక వ్యవస్థ ద్వారా సారథుల సామాజిక భద్రతకు భారత్ టాక్సీ ప్రాధాన్యతనిస్తుంది. ఇది ఢిల్లీలోని ఏడు కీలక ప్రాంతాలలో సహాయ కేంద్రాలను నిర్వహిస్తోంది. అత్యవసర సమయాల్లో వేగవంతమైన సహాయాన్ని, ధృవీకరించిన రైడ్ సమాచారాన్ని అందిస్తుంది. డ్రైవర్లపై ఎలాంటి నియంత్రణలను విధించకుండా, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తుంది. అంతేకాకుండా, ‘బైక్ దీదీ’ లాంటి కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 150 మందికి పైగా మహిళా డ్రైవర్లు దీనిలో చేరారు.

 

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, నగరాలకు సేవలను విస్తరించాలని, ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, డ్రైవర్ల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాలని భారత్ ట్యాక్సీ యోచిస్తోంది. అలాగే జాతీయ డిజిటల్ ప్రజా మౌలిక వసతులతో బలమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. తద్వారా సుస్థిరమైన, సమగ్రమైన, సహకార ఆధారిత రవాణా వ్యవస్థను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అందించారు.

 

****


(రిలీజ్ ఐడి: 2226147) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी