వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నూతన వ్యవసాయ పద్దతులు, డిజిటల్‌ సేవలు

నాడు పోస్టు చేయడమైనది: 10 FEB 2026 6:42PM by PIB Hyderabad

ప్రభుత్వం రైతు ఆదాయాన్ని, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి నూతన వ్యవసాయ పద్ధతులు, డిజిటల్ సేవలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. అవి:

జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్  (ఎన్‌ఎంఎస్‌ఏ) కింద సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి అనేక పథకాలు ప్రారంభించారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) పథకం ద్వారా బిందు, తుంపర సేద్యం వంటి సూక్ష్మ నీటి పారుదల సాంకేతికతలను ఉపయోగించి భూస్థాయిలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. వర్షాధారిత ప్రాంతాల అభివృద్ధి పథకం సమగ్ర వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించి ఉత్పాదకతను పెంచడంతో పాటు వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడంపై దృష్టి సారిస్తుంది. నేల ఆరోగ్యం, సారవంతం (ఫర్టిలిటీ) పథకం రసాయన ఎరువులను సముచితంగా ఉపయోగించడం ద్వారా సమగ్ర పోషకాల నిర్వహణను ప్రోత్సహిస్తుంది. సమీకృత ఉద్యానవన అభివృద్ధి మిషన్ (ఎంఐడీహెచ్‌), ఆగ్రో ఫారెస్ట్, నేషనల్ బాంబూ మిషన్ కూడా వ్యవసాయంలో వాతావరణాన్ని మార్పులను తట్టుకునే శక్తిని పెంపొందిస్తాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీఐ)తోపాటు వాతావరణ ఆధారిత పునర్వ్యవస్థీకృత పంట బీమా పథకం ఊహించని ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇది ఆర్థిక సహాయం అందిస్తుంది. పంట నష్టానికి సమగ్ర బీమా రక్షణను అందిస్తుంది.

వ్యవసాయ యాంత్రీకరణపై ఉప-మిషన్ (ఎస్‌ఎంఏఎం) 2014-15 నుంచి తమిళనాడుతో సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా అమలవుతోంది. ప్రస్తుతం ఈ పథకం కేంద్ర ప్రభుత్వ పథకమైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పరిధిలో కొనసాగుతోంది. ‘‘అందని వారికి చేరువ కావడం’’ ఈ పథకం ప్రధాన లక్ష్యం. అంటే చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులను కేంద్రంగా చేసుకుని వ్యవసాయ యాంత్రీకరణ ప్రయోజనాలను వారికి అందించడం. ఇందుకోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రోత్సహించడం, హైటెక్, అధిక విలువ కలిగిన వ్యవసాయ పరికరాల కేంద్రాలను సృష్టించడం, వివిధ రకాల వ్యవసాయ పనిముట్ల పంపిణీ, ప్రదర్శనలు, శిక్షణా కార్యక్రమాల ద్వారా రైతుల్లో, ఇతర భాగస్వాముల్లో అవగాహన కల్పించడం జరుగుతోంది. ఈ పథకం కింద 2014-15 నుంచి 2025-26 (నేటి వరకు) కాలంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు రూ. 9,404.47 కోట్ల నిధులు విడుదల చేసింది. సబ్సిడీపై రైతులకు 21,61,202 యంత్రాలను పంపిణీ చేయగా.. 27,554 యంత్రాల అద్దె కేంద్రాలు 646 హైటెక్ కేంద్రాలు, 25,608 వ్యవసాయ యంత్రాల బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఈ చర్యల ఫలితంగా వ్యవసాయ పనుల కోసం అవసరమైన వ్యవసాయ శక్తి లభ్యత 2013-14లో హెక్టారుకు 1.73 కిలోవాట్లు ఉండగా 2018-19 నాటికి అది 2.49 కిలోవాట్లకు పెరిగింది.

ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (డీడీవైకే)ను కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రకటించారు. ఈ పథకాన్ని 2025 అక్టోబర్ 11న అధికారికంగా ప్రారంభించి.. 100 జిల్లాలకు విస్తరించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యీకరణ, సుస్థిర వ్యవసాయ పద్ధతుల అవలంబనను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. గ్రామ పంచాయతీ, మండల స్థాయిల్లో కోత అనంతరల నిల్వ సౌకర్యాలను పెంపొందించడం, నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, అలాగే రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల లభ్యతను సులభతరం చేయడం ప్రధాన ఉద్దేశం. ఈ పథకాన్ని 11 ప్రభుత్వ శాఖలకు చెందిన 36 ప్రస్తుత కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో ఎంపిక చేసిన 100 డీడీకేవై జిల్లాల్లో అమలు చేస్తున్నారు.

రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా దేశంలో డిజిటల్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వాటిలో ముఖ్యమైనవి కింది విధంగా ఉన్నాయి.

1. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద వ్యవసాయం కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అగ్రిస్టాక్, కృషి నిర్ణయ సహాయక వ్యవస్థ, సమగ్ర భూసారం, నేల ప్రొఫైల్‌ మ్యాప్‌, దేశంలో బలమైన వ్యవసాయ వ్యవస్థను ప్రారంభించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఇతర ఐటీ కార్యక్రమాలు ఉన్నాయి. వీటి ద్వారా రైతు కేంద్రీకృతమైన వినూత్న డిజిటల్ పరిష్కారాలను ప్రోత్సహించడమే కాకుండా వాటిని మరింత నమ్మదగినవిగా మారుస్తాయి. దీనివల్ల పంటకు సంబంధించిన సమాచారం రైతులకు సరైన సమయంలో అందుబాటులోకి వస్తుంది. అగ్రిస్టాక్ అనే డిజిటల్ మౌలిక సదుపాయం వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు ప్రాథమిక రిజిస్ట్రీలు లేదా డేటాబేస్‌లను కలిగి ఉంటుంది. అవి జియో-రిఫరెన్స్ విలేజ్ మ్యాప్‌లు, క్రాప్ సోన్ రిజిస్ట్రీ,రైతుల రిజిస్ట్రీ. వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వయంగా రూపొందించి నిర్వహిస్తాయి. ఇది రైతు గుర్తింపు , భూమి వివరాలు, పంటల సమాచారం కోసం ఒకే ఖచ్చితమైన సమాచార వనరుగా పనిచేస్తాయి.

రైతు గుర్తింపు కార్డు ద్వారా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, కనీస మద్దతు ధర ఆధారిత కొనుగోళ్లు, రుణాల లభ్యత, విత్తనాలు, ఎరువుల పంపిణీ, ప్రకృతి విపత్తు సహాయం వంటి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) పథకాలతో సులభంగా సమన్వయం సాధ్యమవుతుంది. 04-02-2026 నాటికి దేశవ్యాప్తంగా 8.48 కోట్లకు పైగా రైతు గుర్తింపు కార్డులు కల్పించారు.

డిజిటల్ పంట సర్వే ద్వారా ప్రతి పొలం స్థాయిలో ఏ పంట వేశారో స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల వివిధ కాలాల్లో సాగు విధానాలను  మెరుగ్గా అంచనా వేయడానికి వీలవుతుంది. ఈ సమాచారం ఆధారంగా పంట సేకరణ, ఎరువులు/విత్తనాల సరఫరా, రవాణా ఏర్పాట్లను ముందస్తుగా, ప్రణాళిక ద్వారా రూపొందించుకోవడానికి ప్రభుత్వానికి సాధ్యమవుతుంది.

2. కృషి నిర్ణయ సహాయక వ్యవస్థ అనేది శాటిలైట్ చిత్రాలు, వాతావరణం, నేల పంట వివరాలను భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా అనుసంధానించే ఒక జియో-స్పేషియల్ ప్లాట్‌ఫామ్. ఇది వ్యవసాయ ప్రణాళికలు, నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.  పంటలు, వాతావరణం, నేల స్వభావానికి సంబంధించిన నిర్ధిష్టమైన సలహాలను రూపొందించడానికి ఉపయోగపడే ఒక విశ్లేషణాత్మక వేదికగా పనిచేస్తుంది.

3. కిసాన్ ఈ-మిత్ర అనేది కృత్రిమ మేధ ఆధారిత వాయిస్ చాట్‌బాట్. ఇది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రైతుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి రూపొందించారు. ఈ వ్యవస్థ ప్రస్తుతం 11 ప్రాంతీయ భాషల్లో సేవలను అందిస్తోంది. భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ పథకాలకు కూడా సహాయపడేలా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఇది రోజుకు సగటున 8,000కు పైగా రైతుల ప్రశ్నలకు సమాధానమిస్తోంది. ఇప్పటివరకు 95 లక్షలకుపైగా ప్రశ్నలకు సమాధానాలు అందించింది.

4. జాతీయ తెగులు పర్యవేక్షణ వ్యవస్థ: వాతావరణ మార్పుల వల్ల పంట దిగుబడి తగ్గకుండా చూసేందుకు జాతీయ తెగులు నిఘా వ్యవస్థ పనిచేస్తుంది. ఇది పంటలలో  తెగులు ఉధృతిని గుర్తించడానికి ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగిస్తుంది. దీనివల్ల సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టి పంటను ఆరోగ్యంగా ఉంచవచ్చు. ప్రస్తుతం 10,000 మందికి పైగా విస్తరణాధికారులు దీనిని ఉపయోగిస్తున్నారు. రైతులు తెగుళ్ల ఫోటోలను తీసి పంపడం ద్వారా పురుగుల దాడులను అరికట్టవచ్చు. పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం ఇది 65 రకాల పంటలు, 400 కంటే ఎక్కువ రకాల తెగుళ్ల సమాచారాన్ని అందిస్తోంది.

5.సాథి (విత్తన ప్రామాణికత ట్రేసబిలిటీ, హోలిస్టిక్ ఇన్వెంటరీ): ఇది విత్తనోత్పత్తి, నాణ్యత ధృవీకరణ, పంపిణీ, ట్రేసిబిలిటీని దేశవ్యాప్తంగా క్రమబద్ధీకరించే ఒక డిజిటల్ వేదిక. ఈ ప్రయత్నం జాతీయ విత్తన సీడ్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది విత్తన రంగానికి చెందిన వాటాదారులందరినీ ఒకే జాతీయ డిజిటల్ వేదిక కిందకు తీసుకువస్తుంది.

ఈ సమాచారాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ నేడు లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2226127) సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी