రక్షణ మంత్రిత్వ శాఖ
హెల్లెనిక్ రిపబ్లిక్ రక్షణ మంత్రితో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపిన రక్షణ మంత్రి
రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఉమ్మడి అంగీకార ఒప్పందం ఖరారు
పరస్పరం మార్చుకున్న ద్వైపాక్షిక సైనిక సహకార ప్రణాళిక-2026
నాడు పోస్టు చేయడమైనది:
09 FEB 2026 6:56PM by PIB Hyderabad
హెల్లెనిక్ రిపబ్లిక్ రక్షణ మంత్రి నికోలస్ జార్జియోస్ డెండియాస్‌తో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 09 ఫిబ్రవరి 2026న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ, పరస్పర గౌరవంపై భారత్-గ్రీస్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఆధారపడి ఉందని ఇద్దరు మంత్రులు స్పష్టం చేశారు.
భారతదేశ 'ఆత్మనిర్భర్ భారత్’, హెల్లెనిక్ రక్షణ సంస్కరణలు 'అజెండా 2030’ మధ్య భాగస్వామ్యం ద్వారా స్వదేశీ రక్షణ పారిశ్రామిక సామర్థాన్ని విస్తరించాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. భారత్, గ్రీస్ మధ్య రక్షణ పారిశ్రామిక సహకార బలోపేతానికి సంతకం చేసిన ఉమ్మడి అంగీకార ఒప్పందం.. ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు కీలకం కానుంది.
ప్రాంతీయ శాంతి, భద్రతకు సంబంధించిన పలు అంశాలపై ఇరుదేశాల రక్షణ మంత్రులు చర్చించారు. ద్వైపాక్షిక రక్షణ సహకారం, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడుతున్నాయని అంగీకరించారు. ఇరుదేశాల సాయుధ దళాల మధ్య సైనిక కార్యకలాపాల కోసం ద్వైపాక్షిక సైనిక సహకార ప్రణాళిక-2026ను పరస్పరం మార్చుకున్నారు.
పురాతన సముద్రయానం గల రెండు దేశాల మధ్య, వివిధ కీలక సముద్ర వ్యవహారాల్లో ఏకాభిప్రాయాన్ని స్పష్టం చేశారు. గురుగ్రామ్‌లోని ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్-ఇండియన్ ఓషన్ రీజియన్ (ఐఎఫ్ సీ-ఐఓఆర్)లో ఒక గ్రీక్ అంతర్జాతీయ సమన్వయ అధికారిని నియమిస్తున్నట్లు గ్రీస్ ప్రకటించింది.
సమావేశానికి ముందు, జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి, దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు గ్రీస్ రక్షణ మంత్రి నివాళులర్పించారు. అనంతరం, మానెక్ షా సెంటర్‌లో త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
పర్యటనలో భాగంగా హెల్లెనిక్ ప్రతినిధి బృందం బెంగళూరులోని కీలక రక్షణ, పారిశ్రామిక సంస్థలను సందర్శించటమే కాక, న్యూఢిల్లీలోని డీపీఎస్‌యూలు, రక్షణ పరిశ్రమలు, అంకుర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ పర్యటన భారత్, హెల్లెనిక్ రిపబ్లిక్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ బంధం ఇరుదేశాల ప్రజల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహపూర్వక, సన్నిహిత సంబంధాలపై ఆధారపడి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2225816)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5