శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇతర తీరప్రాంత రాష్ట్రాలతో కలిసి భారత బ్లూ ఎకానమీ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్


2026-27 కేంద్ర బడ్జెట్‌కు మూలస్తంభాలుగా ఉత్పాదకత, సమర్థత, సమ్మిళితత్వం

బడ్జెట్ అధికారికంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదే అయినా... వాస్తవానికి ఇది రాబోయే పాతికేళ్ల భారత ఆర్థిక వ్యవస్థకు వ్యూహాత్మక రోడ్‌మ్యాప్

సముద్ర, మత్స్య రంగ సంస్కరణలు, వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు బడ్జెట్ ప్రోత్సాహంతో లబ్ది పొందనున్న ఆంధ్రప్రదేశ్

పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు, రేర్ ఎర్త్ కారిడార్, హైస్పీడ్ రైలు కారిడార్లకు ప్రోత్సాహంతోనూ ఆంధ్రకు ప్రయోజనం: డాక్టర్ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 07 FEB 2026 6:28PM by PIB Hyderabad

ఇతర తీరప్రాంత రాష్ట్రాలతో కలిసి భారత బ్లూ ఎకానమీ పరివర్తనకు ఆంధ్రప్రదేశ్ మార్గదర్శనం చేస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, ఎర్త్ సైన్సెస్, ఎమ్‌వోఎస్ పీఎమ్‌వో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు వ్యాఖ్యానించారు.

బ్లూ ఎకానమీని జాతీయ ప్రాధాన్య లక్ష్యంగా రూపొందించాలని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ... మత్స్య సంపద, సముద్ర ఎగుమతులు, తీరప్రాంత మౌలిక సదుపాయాలు, సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను భారత దీర్ఘకాలిక వృద్ధి వ్యూహంలో కేంద్రంగా ఉంచడం ద్వారా 2026–27 కేంద్ర బడ్జెట్ ఈ దార్శనికతకు దృఢమైన రూపాన్ని ఇస్తుందని మంత్రి తెలిపారు.

శ్రీ కనక దుర్గమ్మ ఆశీర్వాదం గల పవిత్ర నగరం విజయవాడలో మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రభావశీలురను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగించారు. 2047 వికసిత్ భారత్‌ కోసం వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌గా 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ఆయన అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి సమయంలోనూ భారత్ సుస్థిరత, స్పష్టత, స్థిరమైన పెట్టుబడి ఆధారిత వృద్ధి మార్గాన్ని ఎంచుకుందని ఆయన తెలిపారు.

మత్స్య సంపద, సముద్ర అభివృద్ధితో ప్రారంభించి, భారత ప్రత్యేక ఆర్థిక మండలిలో లోతైన సముద్ర ప్రాంతంలో చేపల వేటను అనుమతించడం, విదేశీ ఓడరేవుల్లో చేపల పెంపకాన్ని ఎగుమతులుగా గుర్తించడం వల్ల మత్స్యకారుల ఆదాయ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ విధాన మార్పు ఆహార భద్రతను బలపరుస్తుందని, ఎగుమతి రంగంలో పోటీతత్వాన్ని పెంచుతుందని, నీలి సముద్ర దేశంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు. పొడవైన తీరప్రాంతం, సుస్థిర ఆక్వాకల్చర్ వ్యవస్థ కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ చర్యల ద్వారా గణనీయ ప్రయోజనం పొందుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

జలాశయాల ఆధునీకరణ, తీరప్రాంతంలో మత్స్యరంగ మౌలిక సదుపాయాలు, కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌లు, ప్రాసెసింగ్ సౌకర్యాలను బలోపేతం చేయడం ద్వారా సమగ్ర సముద్ర ఆర్థిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధానం జీవనోపాధి, ఎగుమతులు, సరుకు రవాణా, విలువ జోడింపులను అనుసంధానిస్తూ తీరప్రాంత రాష్ట్రాలను జాతీయ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చోదకాలుగా చేస్తుందన్నారు.

దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యూహాత్మక పారిశ్రామిక కారిడార్‌లతో బ్లూ ఎకానమీ మిషన్‌ను మంత్రి అనుసంధానించారు. ఆంధ్రప్రదేశ్‌లో రేర్ ఎర్త్, క్రిటికల్ మినరల్స్ కారిడార్ రాష్ట్రాన్ని తదుపరి తరం తయారీ, పునరుత్పాదక ఇంధన విభాగాలు, అధునాతన పదార్థాల రంగాల్లో ముందంజలో ఉంచుతుందని తెలిపారు. దీంతో పాటు తూర్పు తీరంలోని పారిశ్రామిక కారిడార్లు లాజిస్టిక్స్ ఏకీకరణను బలోపేతం చేస్తాయనీ, ప్రపంచ సరుకు రవాణా భాగస్వామ్యాన్ని మెరుగుపరుస్తాయని కేంద్ర మంత్రి వివరించారు.

అభివృద్ధి చెందుతున్న రంగాల గురించి ప్రస్తావిస్తూ... పరిశుద్ధ ఇంధన పరివర్తనకు అవసరమైన పదార్థాలను సంగ్రహించడానికి, ప్రాసెస్ చేయడానికి, తయారు చేయడానికి, పంపిణీ చేయడానికి అవసరమైన సమగ్ర, పరస్పర అనుసంధానితమైన, పెరుగుతున్న డిజిటలైజ్డ్, సుస్థిర, వ్యూహాత్మక కార్యకలాపాల నెట్‌వర్క్ సహా ప్రత్యేక కారిడార్ల అభివృద్ధి భారత సముద్ర, ఎగుమతి లక్ష్యాలను సాకారం చేస్తుందని ఆయన అన్నారు. ఓడరేవులు, కంటైనర్ తయారీ, రైలు కనెక్టివిటీ, పారిశ్రామిక క్లస్టర్ల ఏకీకరణ తీరప్రాంతాలను తయారీ కేంద్రాలతో అనుసంధానిస్తూ సజావైన ఆర్థిక నిర్మాణాన్ని సృష్టిస్తుందన్నారు.

అమరావతికి మౌలిక సదుపాయాల మద్దతు, మూలధన పెట్టుబడుల విస్తరణ, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు నిరంతర మద్దతు గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. దీర్ఘకాలిక ఉత్పాదకత, నీటి భద్రతకు పునాదిగా ఈ పెట్టుబడులను ఆయన అభివర్ణించారు. వ్యవసాయం, అధిక విలువ కలిగిన తోట పంటలు, ఎమ్ఎస్ఎమ్ఈ వృద్ధి నిధులు, మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాల వ్యాపారాలను సమ్మిళిత అభివృద్ధిలో కీలకమైన భాగాలుగా బడ్జెట్ విధాన ప్రణాళికలో పేర్కొన్నట్లు ఆయన వివరించారు.

ఉత్పాదకత, సమర్థత, సమ్మిళితత్వాన్ని మిళితం చేస్తూ, అధిక స్థాయి మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూ బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారిస్తోందని ఆయన అన్నారు. మత్స్య సంపద, ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ముడి ఖనిజాల నుంచి తుది ఉత్పత్తులను తయారు చేయు కార్యకలాపాలు, వ్యవసాయ ఎగుమతుల్లో విస్తరించిన ఆంధ్రప్రదేశ్ పాత్ర... భారత్ వృద్ధి ప్రయాణంలో కీలకంగా మారిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం, ఎగుమతి ఆధారిత, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారడం దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్ భారత్‌ను నిర్ణయాత్మకంగా ముందుకు నడిపిస్తుందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. తీరప్రాంత రాష్ట్రాలు బ్లూ ఎకానమీ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నాయనీ, పారిశ్రామిక కారిడార్లు అధునాతన తయారీని నడిపిస్తున్నాయని ఆయన తెలిపారు. వికసిత్ భారత్ 2047 దిశగా భారత ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా నిలిచిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2225170) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी