శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
జాతీయ క్వాంటం మిషన్ కోసం వ్యూహాత్మక వేదికగా ఆంధ్రప్రదేశ్
భారత క్వాంటం భవిష్యత్తు అమరావతి నుంచే ప్రారంభం
"అమరావతి క్వాంటం సెంటర్"కు శంకుస్థాపన
రూ.6,000 కోట్ల "నేషనల్ క్వాంటం మిషన్"తో ఎలైట్ దేశాల సరసన భారత్
భారత్ ప్రపంచ క్వాంటం ఆశయాన్ని బలపరుస్తున్న అమరావతి కేంద్ర ప్రారంభం
1,000 క్యూబిట్‌లు, 2,000 కిలోమీటర్ల క్వాంటం కమ్యూనికేషన్ నెట్‌వర్క్ భారత్ లక్ష్యం
రక్షణ, సైబర్ భద్రత, ఆరోగ్య సంరక్షణలో పరివర్తన కోసమే క్వాంటం టెక్
17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థల పరిధిలో జాతీయ క్వాంటం మిషన్
ప్రభుత్వ, దేశవ్యాప్త సమగ్ర విధానం ద్వారా అమరావతి క్వాంటం వ్యాలీకి ఊతం: డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
08 FEB 2026 2:12PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), ఎమ్‌వోఎస్ పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, "ఇది కేవలం ఒక భవన శంకుస్థాపన మాత్రమే కాదు, ఇది భారత క్వాంటం భవిష్యత్తుకు పునాది రాయి" అని ప్రకటించారు.
క్వాంటం టెక్నాలజీని ఒక ఐచ్ఛికంగా కాకుండా వ్యూహాత్మక అవసరంగా అభివర్ణించిన కేంద్ర మంత్రి... రాబోయే దశాబ్దాల్లో భారత్ తన కమ్యూనికేషన్ వ్యవస్థలు, రక్షణ వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి సాంకేతికతలో తన స్థానాన్ని సురక్షితం చేసుకోవడం కోసం ఈ రంగంలో నాయకత్వమే ఏకైక మార్గమని అన్నారు.
అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు... రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్... భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్... శాస్త్ర-సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్... ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి... డాక్టర్ అమిత్ సింఘీ (ఐబీఎం రీసెర్చ్ ఇండియా)... డాక్టర్ హారిక్ విన్ (టీసీఎస్)... శ్రీ ఎం.వీ. సతీష్ (ఎల్ అండ్ టీ) సహా ఈ రంగానికి చెందిన సీనియర్ ప్రముఖులు, రాష్ట్ర సీనియర్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శంకుస్థాపన శిలాఫలకాన్ని, అమరావతి క్వాంటం వ్యాలీ లోగోను ఆవిష్కరించడం... ఐబీఎం, టీసీఎస్ క్వాంటం క్లౌడ్ సేవలను ప్రారంభించడం... ఐబీఎం–టీసీఎస్ క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు... క్వాంటం టాలెంట్ హబ్ ప్రకటన... ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయం ద్వారా క్వాంటం రిఫరెన్స్ కేంద్రం... క్వాంటం-సేఫ్ అప్లికేషన్స్ కార్యక్రమం... తొమ్మిది మంది పరిశ్రమ భాగస్వాములతో బహుళ అవగాహన ఒప్పందాలపై సంతకాలు... పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రభుత్వాల మధ్య సమన్వయంతో కూడిన భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలిచాయి.
ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ఎంతగానో ప్రశంసించారు. ఆయనను "రేపటిలో జీవిస్తూ, ఎల్లుండి గురించి కలలు కనే నాయకుడు"గా కేంద్ర మంత్రి అభివర్ణించారు. హైదరాబాద్‌లోని హై-టెక్ సిటీలో ముఖ్యమంత్రి సాంకేతికత ఆధారిత పాలనను మొదటిసారిగా చూసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ... గత సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన వేగవంతమైన పురోగతి సహకార సమాఖ్య స్ఫూర్తిని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్ణించే "డబుల్-ఇంజిన్" విధానాన్ని అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్నీ ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
గత వారం విశాఖపట్నంలో తాను పర్యటించిన విషయాన్ని ప్రస్తావించిన కేంద్ర మంత్రి... ఆ సందర్భంలో ప్రారంభించిన ఒక ప్రాజెక్టు ఉదాహరణను ఉటంకించారు. 2006లో ప్రతిపాదించి, దాదాపు రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన జాతీయ సముద్ర విజ్ఞాన కేంద్రం ప్రాజెక్టును ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే పూర్తి చేసిందని ఆయన తెలిపారు. ఇది భారత డీప్ ఓషన్ మిషన్‌కు కీలక కేంద్రంగా పని చేస్తుందనీ, తద్వారా ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ప్రకటించిన బ్లూ ఎకానమీ దార్శనికతను మరింత బలోపేతం చేస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.
ప్రత్యేక జాతీయ క్వాంటం మిషన్ కలిగిన దేశాల సరసన ఈ రోజు భారత్ నిలిచిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. సుమారు రూ.6,000 కోట్ల కేటాయింపుతో ఈ మిషన్ 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థల్లో విస్తరించి ఉందన్నారు. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్, మెట్రాలజీ, క్వాంటం మెటీరియల్స్, పరికరాలపై దృష్టి సారించే నాలుగు థీమాటిక్ కేంద్రాల నిర్వహణలో ఇది ఉంటుందని ఆయన తెలిపారు. ఎనిమిది సంవత్సరాల్లోపు 1,000 ఫిజికల్ క్యూబిట్‌లతో క్వాంటం కంప్యూటర్‌లను అభివృద్ధి చేయడం, సురక్షితమైన గ్రౌండ్-టు-గ్రౌండ్ క్వాంటం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడం, సుదూర క్వాంటం కమ్యూనికేషన్‌ను ప్రారంభించడం, 2,000 కిలోమీటర్లలో ఇంటర్-సిటీ క్వాంటం కీ పంపిణీని సాధించడం జాతీయ లక్ష్యాల్లో భాగంగా ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, తదుపరి పారిశ్రామిక పరివర్తనకు క్వాంటం టెక్నాలజీ ఎందుకు కేంద్రంగా ఉందో వివరించారు. ప్రత్యర్థులు క్వాంటం కంప్యూటింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్న ప్రపంచంలో సాంప్రదాయ కంప్యూటింగ్, సైబర్ భద్రతా వ్యవస్థలు ప్రమాదంలో పడతాయని ఆయన పేర్కొన్నారు. డేటా ఉల్లంఘనను క్వాంటం ఎన్‌క్రిప్షన్ దాదాపు అసాధ్యం చేస్తుందనీ, డీకోడ్ చేయడానికి ఖగోళ కాలపరిమితులు అవసరమని ఆయన వివరించారు. రక్షణ, సైబర్ భద్రతలో ఇది అపూర్వమైన వ్యూహాత్మక రక్షణను అందిస్తుందని తెలిపారు.
ఇతరత్రా అవయవాలకు నష్టం లేకుండా కణితులను మాత్రమే లక్ష్యంగా చేసుకోగల, అవయవ కదలికకు అనుగుణంగా వేగంగా మారగల, రోగి వేగంగా కోలుకోవడానికి వీలు కల్పించే కచ్చితత్వం గల రేడియేషన్ చికిత్సలు సహా పరివర్తనాత్మక ఆరోగ్య సంరక్షణ ఉపయోగాలనూ ఆయన ప్రస్తావించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్, సురక్షిత కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు, అధునాతన సెన్సింగ్ సామర్థ్యాలనూ క్వాంటం టెక్నాలజీ పునర్నిర్వచించగలదని ఆయన అన్నారు.
భారత్ కొన్ని దేశాల కంటే ఆలస్యంగా ఐటీ విప్లవంలోకి ప్రవేశించి ఉండవచ్చు... కానీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో ఆ జాప్యాన్ని పునరావృతం చేయదని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, అంతరిక్షం, సముద్ర లోతుల అన్వేషణలో సమాంతర మిషన్లతో భారత్ తదుపరి ప్రపంచ సాంకేతిక రంగంలో ముందంజలో ఉందన్నారు. ఇటీవల ప్రకటించిన బయోఫార్మా శక్తి కార్యక్రమాన్నీ ఆయన ప్రస్తావించారు. బయోటెక్నాలజీ, పునరుత్పత్తి, జన్యుశాస్త్రాలు, సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవస్థలు, క్వాంటం కంప్యూటింగ్ దిశగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పురోగమిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
క్వాంటం టెక్నాలజీలో భారత్ ఇప్పటికే బి.టెక్ మైనర్ కోర్సులను ప్రవేశపెట్టిందనీ, ఇప్పుడు ఎం.టెక్ కార్యక్రమాలకూ దానిని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. శిక్షణ పొందిన అధ్యాపకుల, సంస్థాగత సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణాత్మక క్వాంటం విద్యా కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం గురించి ఆయన ముఖ్యమంత్రితో చర్చించారు. అధునాతన ఫ్యాబ్రికేషన్ సౌకర్యాలు, కేంద్ర పరిశోధనా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామనీ... అవి అంకురసంస్థలు, పరిశోధకులు, విద్యా సంస్థలకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఐఐటీ మద్రాస్ ప్రారంభించిన... ఇప్పుడు దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న... మార్గదర్శక పరిశోధన పార్క్ నమూనానూ ఆయన ప్రశంసించారు.
ఒంటరిగా పనిచేసే యుగం ముగిసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థలు, అంకురసంస్థలను ఏకీకృత జాతీయ ప్రయత్నంలో సమగ్రపరచడంలోనే అమరావతి క్వాంటం వ్యాలీ విజయం ఆధారపడి ఉందని తెలిపారు. ఐదు సంవత్సరాల కిందట అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించడం, అణుశక్తిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని విస్తరించడం సహకార వృద్ధి పట్ల ప్రస్తుత ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పాక్షిక వాటా నుంచి 800 కోట్లకు పెరిగిందనీ... ఈ సమగ్ర విధానం కారణంగా రాబోయే సంవత్సరాల్లో ఇది 4500 కోట్లకు చేరుతుందని అంచనాలు చెబుతున్నాయని ఆయన వివరించారు.
కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ... భారత క్వాంటం ప్రస్థానం పవిత్రమైన అమరావతి నగరం నుంచి ప్రారంభమవుతోందని, వికసిత భారత్ దిశగా భారత్ ప్రస్థానంలో ముందడుగుకు వేదికగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ప్రకటించారు. జాతీయ మిషన్లతో తమ ఆవిష్కరణల వ్యవస్థలను అనుసంధానించే రాష్ట్రాలకు భారత ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందనీ ఆయన హామీ ఇచ్చారు. కేంద్రం-ఆంధ్రప్రదేశ్ మధ్య సహకారం దేశాన్ని ప్రపంచ క్వాంటం రంగంలో అగ్రగామిగా నిలిపే ప్రక్రియను వేగవంతం చేస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు.
***
(రిలీజ్ ఐడి: 2225160)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8