వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
స్టార్టప్ ఇండియా కార్యాచరణ ప్రణాళికను బలోపేతం చేసేందుకు అంకుర సంస్థల గుర్తింపు విధానాలను(ఫ్రేమ్ వర్క్) సవరించిన ప్రభుత్వం
ఆవిష్కరణ, డీప్ టెక్, సహకార సంఘాల నేతృత్వంలోని సంస్థలకు ప్రోత్సాహం
ప్రభుత్వం సవరించిన స్టార్టప్ నిబంధనల ప్రకారం టర్నోవర్ అర్హత పరిమితి రూ. 200 కోట్లకు పెంపు
డీప్ టెక్ అంకుర సంస్థలకు కాలపరిమితిని 20 ఏళ్లకు పెంపు.. రూ.300 కోట్లకు పెంచిన టర్నోవర్ పరిమితి
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2026 8:20PM by PIB Hyderabad
స్టార్టప్ ఇండియా కార్యాచరణ ప్రణాళికను మరింత బలోపేతం చేయడానికి, భారత్‌ను ప్రపంచ ఆవిష్కరణల శక్తి కేంద్రంగా, తయారీ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు నిలయంగా తీర్చిదిద్దాలనే ప్రధానమంత్రి దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం అంకుర సంస్థల గుర్తింపు మార్గదర్శకాలను సవరించింది. స్టార్టప్ ఇండియా రెండో దశాబ్దంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో.. ఈ సవరించిన ఫ్రేమ్‌వర్క్ వ్యవస్థాపకులకు మరింత స్పష్టమైన, సమగ్ర, భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన విధాన వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అధునాతన సాంకేతికతలు, పరిశోధనాపరమైన రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు సులభంగా వచ్చేలా దోహదపడతాయి.
స్టార్టప్ గుర్తింపు ప్రమాణాల్లో కీలక సవరణలు ఈ కింది విధంగా ఉన్నాయి:
స్టార్టప్ గుర్తింపు కోసం పెంచిన టర్నోవర్ పరిమితి:
అభివృద్ధి చెందుతున్న అంకుర సంస్థల వ్యవస్థ, వారి వ్యాపార జీవన చక్రంలోని వివిధ దశల్లో సంస్థలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, స్టార్టప్‌గా గుర్తింపు పొందేందుకు టర్నోవర్ పరిమితిని రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచారు.
డీప్ టెక్ స్టార్టప్‌ల కోసం ప్రత్యేక విభాగం ప్రారంభం:
అత్యాధునిక, విప్లవాత్మక సాంకేతికతలపై పనిచేసే సంస్థల కోసం ‘డీప్ టెక్ స్టార్టప్’ అనే కొత్త ఉప-విభాగాన్ని ప్రవేశపెట్టారు. స్పష్టత, స్థిరత్వం, నిష్పాక్షికమైన గుర్తింపును నిర్ధారించడానికి వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఈ రంగంలోని నిపుణులతో సంప్రదింపుల ద్వారా డీప్ టెక్ స్టార్టప్‌ల ప్రధాన లక్షణాలను ఖరారు చేశారు. డీప్ టెక్ సంస్థల సుదీర్ఘ కాలపరిమితి, అధిక పరిశోధన, అభివృద్ధి తీవ్రత, భారీ పెట్టుబడుల అవసరాలను గుర్తిస్తూ.. ఈ విభాగం కోసం అర్హత ప్రమాణాలను విస్తరించారు. దీనిలో భాగంగా కాలపరిమితిని విలీనం లేదా రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు పెంచారు. వార్షిక టర్నోవర్ పరిమితిని రూ. 300 కోట్లకు పెంచారు.
సహకార సంఘాలను అర్హత గల అంకుర సంస్థలుగా చేర్చడం:
వ్యవసాయం, అనుబంధ రంగాలు, గ్రామీణ పరిశ్రమలు, సమాజ ఆధారిత సంస్థల్లో క్షేత్ర స్థాయి నుంచి ఆవిష్కరణలతో కూడిన వృద్ధిని ప్రోత్సహించేందుకు అంకుర సంస్థల గుర్తింపు అర్హతను సహకార సంస్థలకు కూడా విస్తరించారు. దీని ప్రకారం బహుళ- రాష్ట్ర సహకార సంఘాల చట్టం 2002 కింద నమోదైన బహుళ-రాష్ట్ర సహకార సంఘాలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల సహకార చట్టాల కింద నమోదైన సహకార సంఘాలు కూడా ఇతర నిబంధనలకు లోబడి గుర్తింపు పొందేందుకు ఇకపై అర్హులు.
సవరించిన ఈ నిబంధనలను అంకుర సంస్థల వ్యవస్థలోని వాటాదారులతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపిన తర్వాత రూపొందించారు. ఈ ఆధునీకరించిన ప్రమాణాల ద్వారా పరిశోధన, ఆవిష్కరణల ఆధారిత సంస్థలకు అంకుర సంస్థల ప్రయోజనాలు మరింతగా అందుతాయని, ఎక్కువ సమయం అవసరమయ్యే డీప్ టెక్ సంస్థలకు నిర్దేశిత మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో ఆవిష్కరణలను నడిపించేందుకు సహకార సంఘాలకు వీలు కలుగుతుందని, అత్యాధునిక సాంకేతికత, నాలెడ్జ్-ఇంటెన్సివ్ వ్యవస్థాపకతలో ప్రపంచ కేంద్రంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2224899)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12