యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

ప్రామాణిక వైకల్యంగల అభ్యర్థులకు ‘పరీక్ష కేంద్రం ఎంపిక’తో సౌలభ్యం మెరుగుపరచిన యూపీఎస్‌సీ

· ప్రిలిమ్స్.. మెయిన్స్ కోసం 3 కొత్త పరీక్ష కేంద్రాల ఏర్పాటు సహా భవిష్యత్‌ విస్తరణ దిశగా అభ్యర్థుల ప్రాధాన్యంపై సర్వే విధానం ప్రవేశపెట్టింది

· ‘పీడబ్ల్యూబీడీ’ అభ్యర్థులకు పరీక్ష కేంద్రం సామర్థ్యంపై ఏ పరిమితీ లేకుండా మరింత సౌలభ్యం.. సౌకర్యం లభిస్తుంది: యూపీఎస్‌సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్

నాడు పోస్టు చేయడమైనది: 05 FEB 2026 5:37PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026 (సీఎస్ఈ), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2026 (ఐఎఫ్ఓఎస్) నిర్వహణ దిశగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) అనేక సాంకేతికపరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అభ్యర్థుల సౌలభ్యం పెంపు, పరీక్షల భద్రత బలోపేతంపై తొలుత దృష్టి సారించింది. ఈ ఏడాది (2026) ‘సివిల్ సర్వీసెస్’ కోసం 933 ఖాళీలు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు 80 ఖాళీల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది.

సామర్థ్యం, పారదర్శకత, అభ్యర్థుల సౌలభ్యం మెరుగు కోసం చేపట్టే చర్యల్లో భాగంగా దరఖాస్తుల సమర్పణ, పరీక్షల నిర్వహణ కోసం పునర్నవీకృత ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్‌ను యూపీఎస్‌సీ అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తుల దాఖలు సులభతరం కావడమేగాక పరీక్ష ప్రక్రియలోని వివిధ దశలలో సమగ్రత బలోపేతం అవుతుంది.

ఈ కీలక సంస్కరణ కింద ప్రామాణిక వైకల్యంగల (పీడబ్ల్యూబీడీ) అభ్యర్థులకు మద్దతు లక్ష్యంగా పరీక్ష కేంద్రం కేటాయింపు చట్రాన్ని మార్పుచేసింది. ఈ మేరకు సవరించిన విధానం ప్రకారం ‘పీడబ్ల్యూబీడీ’ అభ్యర్థులకు పరీక్ష కేంద్రం సామర్థ్యంతో నిమిత్తం ఉండదు. ప్రస్తుతం ప్రతి కేంద్రం సామర్థ్యం మేరకు  సాధారణ, ‘పీడబ్ల్యూబీడీ’ అభ్యర్థులు ఉపయోగించుకుంటారు. దీంతో ఒక కేంద్రం పూర్తిగా నిండిన తర్వాత సాధారణ అభ్యర్థులు దాన్ని ఎంపిక చేసుకునే వీలుండదు. కానీ, ‘పీడబ్ల్యూబీడీ’ అభ్యర్థులకు మాత్రం అదే కేంద్రాన్ని ఎంచుకోగల అవకాశం కొనసాగుతుంది. తదనుగుణంగా వారి ప్రాధాన్యం మేరకు వారికి పరీక్ష కేంద్రం కేటాయించాల్సిన సందర్భంలో పరీక్ష కేంద్రం సామర్థ్యాన్ని కమిషన్‌ పెంచుతుంది.

దీనిపై యూపీఎస్‌సీ చైర్మన్ డాక్టర్ శ్రీ అజయ్ కుమార్ మాట్లాడుతూ- “గడచిన ఐదేళ్లుగా పరీక్ష కేంద్రాల గణాంకాల విశ్లేషణ సందర్భంగా ఢిల్లీ, కటక్, పాట్నా, లక్నో సహా కొన్ని కేంద్రాల సామర్థ్యం ప్రారంభ దశలోనే నిండిపోయింది. అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడమే ఈ పరిమాణానికి కారణమని తేలింది. దీనివల్ల ‘పీడబ్ల్యూబీడీ’ అభ్యర్థులకు ఇబ్బందులు తప్పలేదు. అయితే, ఇప్పుడు సవరించిన విధానం ఫలితంగా ప్రతి ‘పీడబ్ల్యూబీడీ’ అభ్యర్థి తమ సౌలభ్యం మేరకు వారు పరీక్ష కేంద్రం ఎంచుకోగల భరోసా లభిస్తుంది. యూపీఎస్‌సీ పరీక్షకు హాజరు కావడంలో వారికి మరింత సౌలభ్యంతోపాటు సౌకర్యం కూడా లభిస్తుంది” అని వివరించారు.

అధిక డిమాండ్గల ప్రాంతాలపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాల నెట్‌వర్కును కూడా కమిషన్‌ విస్తరించింది. లక్నో పరిసరాల్లో ఒత్తిడి తగ్గించేలా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, కాన్పూర్ కేంద్రాలకు మీరట్‌ను జోడించారు. అలాగే, కటక్ సమీపంలోని కేంద్రాలకు అదనంగా భువనేశ్వర్‌ను చేర్చారు. ప్రిలిమినరీ పరీక్ష కోసం ఈ కేంద్రాలను జోడించడంతో మొత్తం ప్రిలిమ్స్ కేంద్రాల సంఖ్య 80 నుంచి 83కు పెరిగింది. ఇక మెయిన్స్ పరీక్ష కోసం భువనేశ్వర్, శ్రీనగర్, ఇంఫాల్‌లను చేర్చడంతో కేంద్రాల సంఖ్య 24 నుంచి 27కు పెరిగింది.

ఈ కీలక ప్రణాళిక ప్రక్రియను మరింత బలోపేతం చేస్తూ పునర్నవీకృత దరఖాస్తుల అప్లికేషన్ పోర్టల్ ఇప్పుడు పరీక్ష కేంద్ర ప్రాధాన్యాల సంబంధిత కొత్త అంశంతో రూపొందింది. ప్రకటిత పరీక్ష కేంద్రాల నుంచి ఎంపికతోపాటు డ్రాప్‌డౌన్ జాబితా ద్వారా తమకు సౌలభ్యంగల సమీపంలోని నగరాలను సూచించమని అభ్యర్థులు కోరవచ్చు. ఈ సమాచారం అభ్యర్థుల ప్రాధాన్యంపై అధ్యయనంగా  ఉపయోగపడుతుంది. అలాగే సాధ్యమైన సందర్భాల్లో కొత్త పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు తగిన ప్రదేశాలను గుర్తించే వీలుంటుంది.

పరీక్ష ప్రక్రియ సమగ్రతను పెంచే దిశగా పోర్టల్‌లో ఫోటో వెరిఫికేషన్, ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత-ఆధారిత వెసులుబాటు కూడా ఉంటుంది. తద్వారా పరీక్ష సంబంధిత వివిధ దశలలో గుర్తింపు ధ్రువీకరణను బలోపేతం చేయడమేగాక మరింత బలమైన, పారదర్శక వ్యవస్థకు దోహదం చేస్తుంది.

ఈ మేరకు కమిషన్ విధానాన్ని డాక్టర్‌ శ్రీ అజయ్‌ కుమార్‌ స్పష్టం చేస్తూ- “ఉచిత, న్యాయమైన, సమగ్ర, సౌలభ్య పరీక్ష ప్రక్రియకు భరోసా ఇస్తూ కమిషన్ తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. అభ్యర్థుల సౌలభ్యం, భాగస్వామ్యం పెంపుపై కమిషన్‌ నిశితంగా దృష్టి సారించింది. అదే సమయంలో ఎంపిక కచ్చితంగా ప్రతిభ ప్రాతిపదికనే చేపడతాం” అని ప్రకటించారు.

యూపీఎస్‌సీ శతాబ్ది సంవత్సర వేడుకల నేపథ్యంలో చేపట్టిన ఈ చర్యలు న్యాయమైన, పారదర్శక, సమగ్ర అత్యున్నత ప్రమాణాలకు హామీ ఇస్తున్నాయి. అలాగే, సమకాలీన అవసరాలకు తగినట్లు ఆయా ప్రక్రియల రూపకల్పనకు కమిషన్ నిరంతర కృషిని ప్రతిబింబిస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2224197) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी