భారత ఎన్నికల సంఘం
రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో జాతీయ సదస్సును నిర్వహించనున్న ఈసీఐ 25 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ జరగబోతున్న జాతీయ ఎస్‌ఈసీ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
04 FEB 2026 7:22PM by PIB Hyderabad
1. ఫిబ్రవరి 24, 2026న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల (ఎస్ఈసీల) జాతీయ సదస్సును భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్వహించనుంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల కమిషనర్లు హాజరుకానున్నారు.
2. 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ జాతీయ స్థాయి ఎస్‌ఈసీ సదస్సు జరగబోతోంది. చివరిసారిగా ఇలాంటి సదస్సు 1999 సంవత్సరంలో నిర్వహించారు.
3. ఈ సదస్సుకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) శ్రీ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షత వహిస్తారు. ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో కలిసి ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
4. రాష్ట్ర ఎన్నికల కమిషనర్లతో పాటు వారి న్యాయ, సాంకేతిక నిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే ఈసీఐకి చెందిన 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈఓలు) కూడా ఈ సదస్సుకు హాజరవుతారు.
5. తమ పరిధిలోని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియలు, నిర్వహణలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం.
6. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్ల అర్హతలకు సంబంధించిన ఎన్నికల చట్టాలు, ఈసీఐ ఇటీవల ప్రారంభించిన ఈసీఐఎన్‌ఈటీ డిజిటల్ వేదిక, ఈవీఎంలు వంటి సాంకేతిక మార్పులు, ఇతర అంశాలపై జరిగే చర్చా సమావేశాల్లో వీరంతా పాల్గొంటారు.
7. ఓటర్ల జాబితాల తయారీ, ఎన్నికల నిర్వహణలో భారత రాజ్యాంగం ప్రకారం తమకున్న అనుభవాన్ని, నైపుణ్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈ సదస్సులో పంచుకోనుంది.
8. 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా సంబంధిత రాష్ట్రాల చట్టాల ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేశారు. పంచాయతీలు, మున్సిపల్ సంస్థలకు జరిగే అన్ని ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితాల తయారీ, ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణ, దిశానిర్దేశం, నియంత్రణ అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్లకే ఉంటుంది.
***
(రిలీజ్ ఐడి: 2223807)
సందర్శకుల సూచీ సంఖ్య : : 29