నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
దేశంలో ఇంధన నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా బహుముఖ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
· పీపీఏలను వేగవంతంగా ఖరారు చేసేలా క్రియాశీల చర్యలు తీసుకుంటున్న నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
03 FEB 2026 1:31PM by PIB Hyderabad
2029-30 నాటికి దేశానికి మొత్తం 60.63 గిగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం అవసరమని.. కేంద్ర విద్యుత్ సంస్థ తన ‘ఆప్టిమల్ జనరేషన్ మిక్స్- 2030’లో అంచనా వేసింది. ఇందులో 18.98 గిగావాట్లు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల (పీఎస్పీ) నుంచి, 41.65 గిగావాట్లు బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థల (బీఈఎస్ఎస్) నుంచి లభించాల్సి ఉంటుందని పేర్కొన్నది. దేశీయ పరిశోధన, నిల్వ సాంకేతికతల రూపకల్పనలకు ప్రోత్సాహం సహా.. దేశంలో ఇంధన నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు కింద పేర్కొన్న ముఖ్య చర్యలను ప్రభుత్వం చేపట్టింది:
- ఉత్పత్తి, సరఫరా, పంపిణీ ఆస్తుల్లో భాగంగా బీఈఎస్ఎస్ కొనుగోలు, వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను.. అనుబంధ సేవల నిబంధనలతో కలిపి ప్రకటించడం.
- దేశంలో ఇంధన నిల్వ వ్యవస్థలను ప్రోత్సహించేలా జాతీయ ఫ్రేమ్‌వర్క్ జారీ.
- పీఎస్పీని ప్రోత్సహించేలా మార్గదర్శకాల జారీ.
- అంతర్రాష్ట్ర సరఫరా వ్యవస్థల(ఐఎస్‌టీఎస్)కు 100 శాతం మాఫీని మంజూరు చేయడం.
- 2028 జూన్ 30న లేదా అంతకు ముందు నిర్మాణ పనులు మంజూరు చేసిన పీఎస్పీలకు ఛార్జీలు.
- నిర్దిష్ట నిబంధనలకు లోబడి, 2028 జూన్ 30న లేదా అంత కన్నా ముందు ప్రారంభించిన కో-లొకేటెడ్ బీఈఎస్ఎస్ ప్రాజెక్టులకు.. అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థ ఛార్జీల నుండి 100 శాతం మినహాయింపు మంజూరు చేయడం.
- 2024 మార్చిలో భారీ స్థాయి బీఈఎస్ఎస్‌ల అభివృద్ధి కోసం ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకాన్ని ఆమోదించింది. ఇందులో భాగంగా రూ. 3,760 కోట్ల వ్యయంతో.. ఒక మెగావాట్ అవర్‌కు రూ. 27 లక్షల చొప్పున సాయాన్ని అందిస్తూ, మొత్తం 13,220 మెగావాట్ అవర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- 2025 జూన్‌లో.. 30 గిగావాట్ అవర్ సామర్థ్యం కలిగిన మరో వయబలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీనికి పవర్ సిస్టమ్ డెవలప్‌మెంట్ ఫండ్ (పీఎస్డీఎఫ్) నుంచి రూ.5,400 కోట్లను కేటాయించారు. ప్రతి మెగావాట్ అవర్‌కు రూ. 18 లక్షల చొప్పున వీజీఎఫ్ అందిస్తారు.
- గ్రిడ్ స్కేల్ స్టేషనరీ స్టోరేజ్ అప్లికేషన్ల (గ్రిడ్ అవసరాల కోసం ఒకే చోట ఉండే నిల్వ వ్యవస్థలు) కోసం ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్’ కింద 10 గిగావాట్ అవర్ సామర్థ్యాన్ని ప్రత్యేకంగా కేటాయించారు.
- గ్రిడ్ స్థిరత్వాన్ని పెంపొందించడానికి, ఖర్చును తగ్గించడానికి ‘సౌర విద్యుత్ ప్రాజెక్టులతోపాటు ఇంధన నిల్వ వ్యవస్థలను ఒకే చోట ఏర్పాటు చేయడం’పై ప్రభుత్వం సలహా ఇచ్చింది.
- తక్కువ ఖర్చుతో నిల్వ సాంకేతికతలు సహా నూతన, పునరుత్పాదక శక్తికి సంబంధించి విస్తృత అనువర్తనాల కోసం దేశీయ సాంకేతికతలు, తయారీని అభివృద్ధి చేసేందుకు.. వివిధ పరిశోధన సంస్థలు, పరిశ్రమలకు దన్నుగా నిలిచేలా ‘పునరుత్పాదక ఇంధన పరిశోధన, సాంకేతికత అభివృద్ధి కార్యక్రమా’న్ని అమలు చేయడం.
- క్లీన్ ఎనర్జీ మెటీరియల్ ఇనిషియేటివ్ (సీఈఎంఐ) కింద.. ఇంధన నిల్వ పదార్థాలు, పరికరాల రంగంలో పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ) నిధులను సమకూరుస్తోంది.
2025 డిసెంబరు 31 నాటికి.. నాలుగు పునరుత్పాదక ఇంధన అమలు సంస్థలైన ఎస్ఈసీఐ, ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎస్‌జేవీఎన్ దాదాపు 69 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి కేటాయింపు పత్రాలను జారీ చేశాయి. వీటిలో దాదాపు 24.3 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరాయి.
రాష్ట్రాలు కూడా పునరుత్పాదక విద్యుత్ సేకరణ టెండర్లను జారీ చేస్తున్నాయి. అదేవిధంగా ఉత్పత్తిదారుల నుంచే నేరుగా కొనుగోలు (గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్)/ సొంతంగా ప్లాంట్లలోనే విద్యుదుత్పత్తి (క్యాప్టివ్ రూట్) ద్వారా వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో కూడా పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెరుగుతోంది. తద్వారా కేవలం ఆర్ఈఐఏ బిడ్ల ద్వారా మాత్రమే కాకుండా.. వివిధ మార్గాల్లో పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణ పురోగమిస్తోంది.
సౌర/పవన విద్యుత్తుతోపాటు నిల్వ, పంపిణీ చేయదగిన పునరుత్పాదక ఇంధన ఖర్చులు తగ్గుతుండటంతో.. విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇతర కొనుగోలుదారులు ఈ మార్గాల పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు కారణంగా సాధారణ సౌర/పవన విద్యుత్తుకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ఇందుకు అనుగుణంగా.. సాధారణ పునరుత్పాదక ఇంధన టెండర్లకే పరిమితం కాకుండా, ఇంధన నిల్వతో కూడిన సౌర/పవన విద్యుత్, అలాగే డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయాల్లో సరఫరా చేసేలా రూపొందించిన టెండర్లు, వీటితోపాటు స్థిరమైన, పంపిణీ చేయదగిన పునరుత్పాదక ఇంధన (ఎఫ్ఆర్‌డీఈ) టెండర్ల వైపు మొగ్గు చూపాలని ప్రభుత్వం ఆర్ఈఐఏలకు నిర్దేశించింది.
పునరుత్పాదక ఇంధన అమలు సంస్థలు (ఆర్ఈఐఏ) జారీ చేసిన బిడ్లకు సంబంధించి.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, ఇంధన సంరక్షణ చట్టం కింద పునరుత్పాదక ఇంధన వినియోగ బాధ్యతను తప్పక పాటించాలని రాష్ట్రాలను కోరడంతోపాటు.. టెండర్లను రూపొందించి జారీ చేయడానికి ముందే డిస్కంలు, ఇతర వినియోగదారుల నుంచి ఉన్న డిమాండ్‌ను అంచనా వేసి ఏకీకృతం చేయాలని ఆర్ఈఐఏలకు సూచించింది. అమలులో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రక్రియను వేగవంతం చేయడానికి... పునరుత్పాదక ఇంధనాన్ని అధికంగా కొనుగోలు చేసే ప్రధాన రాష్ట్రాలతో ప్రాంతీయ వర్క్‌షాపులను ప్రభుత్వం నిర్వహించింది.
రాజ్యసభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో.. కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యశో ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2222829)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11