జల శక్తి మంత్రిత్వ శాఖ
అందరికీ కుళాయి నీటిని అందించటం
నాడు పోస్టు చేయడమైనది:
02 FEB 2026 4:16PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి తాగునీటిని అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఆగస్టు 2019 నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ (జేజేఎం) - హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేస్తోంది. తాగునీరు రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ రాష్ట్ర ప్రయత్నాలకు తోడ్పాటునందించేందుకు భారత ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
జల్ జీవన్ మిషన్ ప్రారంభమనప్పటి నుంచి దేశంలోని గ్రామీణ గృహాలకు కుళాయి నీటి సరఫరా గణనీయంగా మెరుగుపడింది. ఆగస్టు 2019లో పథకం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3.23 కోట్ల (16.72%) గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదికలున్నాయి. జేజేఎం ద్వారా ఇప్పటివరకు 12.55 కోట్ల అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లనిచ్చారు. 28.01.2026 నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో 15.79 కోట్లకు పైగా (81.56%) ఇళ్లకు నేరుగా కుళాయి నీరు అందుతున్నట్లు నమోదైంది.
ఈ మిషన్ మొత్తం అంచనా వ్యయం రూ.3.60 లక్షల కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2.08 లక్షల కోట్లు. కేంద్రం కేటాయించిన నిధులు 2024-25 నాటికే దాదాపు వినియోగించారు. ఇప్పటివరకు సాధించిన పురోగతిని, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పరిగణలోకి తీసుకుని జల్ జీవన్ మిషన్‌ను డిసెంబర్ 2028 వరకు పొడిగిస్తున్నామని, ఇందుకోసం కేటాయింపులను కూడా పెంచినట్లు 2025-26 బడ్జెట్ ప్రకటనల్లో ఆర్థిక మంత్రి వెల్లడించారు. జల్ జీవన్ మిషన్‌ను డిసెంబర్ 2028 వరకు కొనసాగించే ప్రతిపాదన సంబంధిత శాఖ పరిశీలనలో ఉంది.
జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి వికేంద్రీకృత, డిమాండ్ ఆధారిత, సంఘ నిర్వహణతో అమలవుతోంది. గ్రామీణ గృహాలకు క్రమంగా, భరోసాతో కుళాయి నీటిని సరఫరా చేసేందుకు గ్రామ పంచాయతీ, దాని ఉపకమిటీలు, వినియోగదారుల బృందాలైన గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీ (వీడబ్ల్యూఎస్‌సీ), పానీ సమితిలకు అధికారం కల్పించారు. నీటి సరఫరా వ్యవస్థల కోసం ప్రణాళికను రూపొందించటం, అమలు చేయటం, నిర్వహించటం, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామాల్లోని ఈ కమిటీలే చేపడతాయి.
జేజేఎం ద్వారా ఎన్జీవోలు, సామాజిక సంస్థలు (సీబీఏలు), స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు), ఇతర స్వచ్ఛంద సంస్థలను (వీవోలు) అమలు మద్దతు సంస్థలు (ఐఎస్ఏలు)గా ఎంపిక చేశారు. ఇవి ప్రణాళికను రూపొందించటం, సామాజిక చైతన్యం కల్పించటం, భాగస్వామ్యాన్ని పెంపొందించటం, సమాచారాన్ని తెలియజేయటం, నీటి సరఫరా మౌలిక వసతుల దీర్ఘకాలిక నిర్వహణకు మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటం వంటి అంశాల్లో వీడబ్ల్యూఎస్సీలు, పానీ సమితులకు శిక్షణ ఇవ్వటం, మార్గనిర్దేశం చేయటానికి పనిచేస్తాయి.
ప్రణాళిక రూపకల్పన, అమలులో క్రీయాశీల పాత్ర పోషించేలా, నిర్వహణ బాధ్యతలను స్వీకరించేలా స్థానిక ప్రజలను ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహకారంతో నల్ జల్ మిత్ర (ఎన్జేఎంపీ) కార్యక్రమం ప్రారంభించారు. దీనిద్వారా గ్రామస్థులకు సమగ్ర నైపుణ్య శిక్షణ అందించి, వారిని "నల్ జల్ మిత్రులు"గా తీర్చిదిద్దటం వల్ల గ్రామాల్లో పైపుల ద్వారా జరిగే నీటి సరఫరా పథకాలకు ఆపరేటర్లుగా వ్యవహరించటమే కాక, నైపుణ్యం గల మేస్త్రీలు, ప్లంబర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రిషియన్లు, మోటార్ మెకానిక్స్, పంపు ఆపరేటర్లుగా చిన్నపాటి మరమ్మతులు, ముందస్తు నిర్వహణ పనులను స్వయంగా చేసుకోగలుగుతారు.
పారదర్శకతను పెంపొందించటానికి, సుస్థిరమైన, నిరంతర సేవలందించేందుకు జన్ భాగీదారీని ప్రోత్సహించటానికి జల్ అర్పణ్ ద్వారా "హ్యాండ్‌బుక్ ఆన్ కమ్యూనిటీ మేనేజ్డ్ పైప్డ్ వాటర్ సిస్టమ్స్"ను ప్రామాణీకరించారు. ఇందులో భాగంగా సులభతర బదిలీ, సుస్థిర నిర్వహణకు జీపీలు, వీడబ్ల్యూఎస్‌సీ సభ్యుల భాగస్వామ్యంతో తప్పనిసరిగా 15 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించాలి. ప్రజల ఫీడ్‌బ్యాక్, ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా, గ్రామ పంచాయతీ స్థాయి డాష్‌బోర్డులను ప్రారంభించి, వాటిని మేరీ పంచాయత్ వేదికతో అనుసంధానించారు. తాగునీటి సేవల పనితీరును అంచనా వేయటానికి గ్రామ పంచాయతీ నేతృత్వంలోని డిజిటల్ అసెస్‌మెంట్ సాధనాన్ని ప్రారంభించారు.
జల్ జీవన్ మిషన్ ద్వారా వనరుల పునరుద్దరణ, స్థానిక తాగునీటి వనరుల పెంపు, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం, భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వీబీ-జీ రామ్ జీ, సమీకృత వాటర్‌షెడ్ నిర్వహణ కార్యక్రమం (ఐడబ్ల్యుఎంపీ), స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) వంటి పథకాలతో స్థానిక సంస్థలు లేదా పంచాయతీరాజ్ సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపింది.
జేజేఎం మార్గదర్శకాల ప్రకారం పైప్డ్ వాటర్ సప్లై పథకాల ద్వారా సరఫరా అయ్యే నీటి నాణ్యతను కొలిచేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్:10500ను ప్రామాణికంగా స్వీకరించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గృహాలకు కుళాయి నీటి సరఫరాకు పథక ప్రణాళిక చేసేప్పుడు ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి రసాయనాల ప్రభావమున్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు.
నీటి నాణ్యతా సమస్యలున్న గ్రామాల్లో, ప్రత్యామ్నాయ సురక్షిత నీటి వనరుల ఆధారంగా పైపుల ద్వారా నీటి సరఫరా పథకాలను రూపొందించి, అమలు చేయాలని రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం సూచించింది. జల్ జీవన్ మిషన్ (జేజేఎం) ద్వారా ముఖ్యంగా ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనిటీ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లను (సీడబ్ల్యూపీపీలు) ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికి తాగునీరు, వంట అవసరాలకు (వ్యక్తికి రోజుకు 8-10 లీటర్ల చొప్పున) సురక్షితమైన నీటిని అందించాలని రాష్ట్రాలు, యూటీలకు తెలిపింది. ఇప్పటివరకు దేశంలోని గ్రామాల్లో నివాస ప్రాంతాలకు ఆర్సెనిక్, ఫ్లోరైడ్ లేని సురక్షిత తాగునీటిని అందించగలిగారు.
జేజేఎం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన వార్షిక నిధుల్లో 2% వరకు నీటి నాణ్యతా పర్యవేక్షణ, నిఘా (డబ్ల్యూక్యూఎంఎస్) కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చు. ఇందులో నీటి నాణ్యతా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, బలోపేతం చేయటం, అవసరమైన పరికరాలు, యంత్రాలు, రసాయనాలు, గాజు పరికరాలు, ఇతర వినియోగ వస్తువుల కొనుగోలు, నైపుణ్యం గల మానవ వనరుల నియామకం, ఫీల్డ్ టెస్ట్ కిట్ల (ఎఫ్టీకేల) ద్వారా కమ్యూనిటీ నిఘా, అవగాహన పెంపొందించటం, నీటి నాణ్యతపై విద్యా కార్యక్రమాలు నిర్వహించటం, ప్రయోగశాలకు అక్రిడేషన్ లేదా గుర్తింపునివ్వటం వంటి కార్యకలాపాలుంటాయి.
రాష్ట్రాలు, యూటీలు నీటి నమూనాలను పరీక్షించటానికి, తాగు నీటి నమూనాల సేకరణ, రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిఘా కోసం జేజేఎం- నీటి నాణ్యతా నిర్వహణ సమాచార వ్యవస్థ (డబ్ల్యూక్యూఎంఐఎస్) ఆన్లైన్ పోర్టల్‌ను అభివృద్ధి చేశాం. నీటి నాణ్యత పరీక్షలకు సంబంధించి డబ్ల్యూక్యూఎంఐఎస్‌లో నివేదించిన వివరాలు రాష్ట్రాల వారీగా జేజేఎం డాష్‌బోర్డులో పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని https://ejalshakti.gov.in/WQMIS/Main/report ద్వారా వీక్షించవచ్చు.
జేజేఎం డాష్‌బోర్డులో 'సిటిజన్ కార్నర్' విభాగాన్ని అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పీడబ్ల్యూఎస్ ద్వారా సరఫరా అయ్యే నీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు గ్రామస్థాయిలోని నీటి నాణ్యతా పరీక్షా ఫలితాలను ఈ విభాగం ద్వారా బహిరంగంగా అందుబాటులో ఉంచుతారు.
మార్చి 2023లో "హ్యాండ్‌బుక్ ఆన్ డ్రింకింగ్ వాటర్ ట్రీట్‌మెంట్ టెక్నాలజీస్”, డిసెంబర్ 2024లో పైపుల ద్వారా అందిస్తున్న నీటి నాణ్యత వాస్తవ పరిస్థితిపై ఒక చిన్న పుస్తకాన్ని జల విభాగం విడుదల చేసింది. సురక్షితమైన నీటి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గనిర్దేశం చేయటమే ఈ రెండింటి లక్ష్యం.
రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి శ్రీ వి. సోమన్న లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2222516)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6