రైల్వే మంత్రిత్వ శాఖ
రూ.2.93 లక్షల కోట్ల రికార్డు స్థాయి మూలధన వ్యయం, హైస్పీడ్ కనెక్టివిటీ, సరుకు రవాణా వ్యవస్థ బలోపేతం, భద్రతే ప్రధాన ప్రాధాన్యతలుగా భారత రైల్వేకు నిధుల కేటాయింపు
భారతదేశవ్యాప్తంగా ఏడు కొత్త హైస్పీడ్ కారిడార్లు, ప్రధాన నగరాల మధ్య తగ్గనున్న దూరం.. సౌత్ హైస్పీడ్ డైమండ్ ద్వారా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ప్రయోజనం
సుమారు 4,000 కి.మీ మేర విస్తరించనున్న హైస్పీడ్ రైల్ కారిడార్ల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం: అశ్వినీ వైష్ణవ్
తూర్పు-పశ్చిమ ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని బలోపేతం చేసేందుకు దంకుని (డబ్యూబీ) నుంచి సూరత్ వరకు 2,052 కి.మీ. పొడవైన నూతన సరుకు రవాణా కారిడార్ ప్రకటన
దాదాపు రూ.1.20 లక్షల కోట్ల కేటాయింపులతో భద్రతకే తొలి ప్రాధాన్యత: అశ్వినీ వైష్ణవ్
భారత్‌లో రూపొందించి, అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్ అగ్ర దేశాలైన అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి దేశాలకు ఎగుమతి: అశ్వినీ వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 7:51PM by PIB Hyderabad
భారత రైల్వే శరవేగంగా విస్తరణకు సిద్ధమవుతుంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.2,78,000 కోట్ల భారీ నిధులను ప్రధానంగా హైస్పీడ్ కనెక్టివిటీ, సరుకు రవాణా, భద్రతపై వెచ్చించాలని భావిస్తోంది.
కేంద్ర బడ్జెట్ 2026–27లో భారతీయ రైల్వేలకు మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,93,030 కోట్ల మూలధన వ్యయాన్ని కేటాయించారు. రైల్వే రంగానికి కేటాయించిన అత్యధిక నిధుల కేటాయింపు ఇదే.
రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం, సామర్థ్యాన్ని విస్తరించటం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వ నిరంతర కృషిని ఈ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక వృద్ధికి, లాజిస్టిక్స్ సామర్థ్యానికి రైల్వే మౌలిక సదుపాయాలే కీలకమని ఇది ప్రతిబింబిస్తోంది. సరుకు రవాణాను మెరుగుపరచటం, రవాణా ఖర్చులను తగ్గించటం, రద్దీగా ఉండే మార్గాల్లో ఒత్తిడిని తగ్గించటం, ఆధునిక రైళ్లు, పునరాభివృద్ధి చేసిన స్టేషన్ల ద్వారా ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ నిరంతర పెట్టుబడులు కొనసాగుతున్నాయి.
దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా, పర్యావరణహితమైన ప్రయాణ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు ఏడు నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లను 'గ్రోత్ కనెక్టర్స్'గా అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారిడార్లలో ముంబై-పూణె, పూణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి ఉన్నాయి. ఈ కారిడార్ల ద్వారా నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గటమే కాక, ప్రయాణికులు ఒక రవాణా మార్గం నుంచి మరో రవాణా మార్గానికి సులభంగా మారేందుకు దోహదపడతాయి.
కొత్త కారిడార్ల ప్రకటనతో రైలు రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. దక్షిణ భారతదేశంలో చెన్నై-బెంగళూరు-హైదరాబాద్ హైస్పీడ్ వ్యవస్థ సౌత్ హైస్పీడ్ త్రిభుజం (లేదా డైమండ్)లా ఏర్పడి ప్రధాన ఆర్థిక, ఐటీ కేంద్రాలను అనుసంధానిస్తుంది. దీనిద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఇవాళ రైల్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
చెన్నై-బెంగళూరు మధ్య ప్రయాణ సమయం సుమారు ఒక గంట 13 నిమిషాలు, బెంగళూరు-హైదరాబాద్ మధ్య 2 గంటలు, చెన్నై-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం 2 గంటల 55 నిమిషాలకు మాత్రమే పరిమితమవుతుందని కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఈ రవాణా వ్యవస్థ అభివృద్ధి ఉత్ప్రేరకంలా మారటమే కాక, ఆయా ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.
ముంబై-పూణె హైస్పీడ్ కారిడార్ ద్వారా పశ్చిమ, మధ్య భారతదేశానికి ప్రయాణ సమయం సుమారు 48 నిమిషాలు తగ్గటమే కాక, రెండు ప్రధాన నగరాలను సమర్థవంతంగా అనుసంధానిస్తుంది. పూణె-హైదరాబాద్ కారిడార్ ద్వారా సుమారు ఒక గంట 55 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుంది. దీన్ని దక్షిణ భారత నగరాలతో అనుసంధానించటం ద్వారా దేశవ్యాప్తంగా హైస్పీడ్ స్పైన్ ఏర్పడి, ప్రయాణికులకు, ఆయా ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ఉత్తర, తూర్పు భారతదేశంలో ఢిల్లీ-వారణాసి హైస్పీడ్ కారిడార్ ద్వారా సుమారు 3 గంటల 50 నిమిషాలకు ప్రయాణ సమయం తగ్గుతుంది. వారణాసి, పాట్నా మీదుగా పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి వరకు నిర్మించే హైస్పీడ్ కారిడార్ ద్వారా వారణాసి-సిలిగురి మధ్య ప్రయాణం కేవలం 2 గంటల 55 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనిద్వారా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్‌ను కలుపుతూ నూతన ఆర్థిక కారిడార్ ఏర్పడటమే కాక, ఆయా ప్రాంతాల అభివృద్ధిని, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది.
సుమారు 4,000 కి.మీ మేర విస్తరించనున్న హైస్పీడ్ రైల్ కారిడార్ల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా భవిష్యత్ రవాణా వ్యవస్థలో రైల్వే రంగం ప్రధానంగా నిలుస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
సరుకు రవాణా, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని భారీగా పెంచే దిశగా కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రతిపాదన చేశారు. పశ్చిమబెంగాల్‌లోని దంకుని నుంచి గుజరాత్‌లోని సూరత్ వరకు.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా నూతన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను ప్రతిపాదించారు. 2,052 కి.మీ పొడవున్న ఈ కారిడార్ ను ప్రస్తుత వెస్ట్రన్ డెడికేటెట్ ఫ్రైట్ కారిడార్‌తో అనుసంధానిస్తారు. దీనివల్ల పశ్చిమ తీరంలోని ఓడరేవులకు సరుకు రవాణా సాఫీగా సాగుతుంది. ప్రస్తుతమున్న తూర్పు, పశ్చిమ డీఎఫ్‌సీలు పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ కారిడార్లో రోజూ సుమారు 400 సరుకు రవాణా రైళ్లు నడుస్తున్నాయి. భవిష్యత్తులో పెరగబోయే డిమాండ్ ను తట్టుకోవటానికి అదనపు కారిడార్ల నిర్మాణం అవసరమని ఆయన పేర్కొన్నారు.
తూర్పు-పశ్చిమ కారిడార్, వివిధ ప్రాంతాల మధ్య వాణిజ్య ప్రవాహాన్ని బలోపేతం చేస్తుంది. ప్రస్తుతమున్న రైల్వే వ్యవస్థలో రద్దీని తగ్గించటమే కాక, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచటం ద్వారా పారిశ్రామిక వృద్ధికి, సరఫరా వ్యవస్థలకు మద్దతుగా నిలుస్తుంది.
భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తూ దాదాపు రూ.1.20 లక్షల కోట్లను ప్రత్యేకంగా భద్రతా పనులకు కేటాయించినట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా నిరంతరాయంగా పెట్టిన పెట్టుబడులు ఇప్పటికే ఆశించిన ఫలితాలను ఇచ్చాయని, దీనివల్ల రైల్వే ప్రమాదాలు దాదాపు 95 శాతం తగ్గినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. రైల్వే రంగంలో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా రైలు పట్టాలు, ఇంజిన్లు, గూడ్స్ వ్యాగన్లు, పాసింజర్ కోచ్‌ల నిర్వహణను మెరుగుపరచటం, కవచ్ స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురావటం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ (ఓహెచ్ఈ) వ్యవస్థల ఆధునీకరణ, రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయటం, వినియోగదారులకు సేవలను మెరుగుపరచటం, ప్రయాణికులకు అవసరమైన వసతుల కల్పన వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.
రైల్వే సాంకేతికతలో ప్రొపల్షన్ వ్యవస్థలు అత్యంత కీలకమని, భారతదేశంలో రూపొందించి, తయారుచేసిన అత్యాధునిక ప్రొపల్షన్ వ్యవస్థలను అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి ప్రపంచ అగ్రదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
మౌలిక సదుపాయాల కల్పన రికార్డు స్థాయి విజయాలను కేంద్రమంత్రి ప్రస్తావిస్తూ.. 35,000 కి.మీ కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, 47,000 కి.మీ మేర రైల్వే విద్యుద్దీకరణ చేసినట్లు చెప్పారు. బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో 99.5 శాతానికి పైగా విద్యుద్దీకరణ పూర్తయినట్లు తెలిపారు. వీటితో పాటు వందేభారత్ స్లీపర్, చైర్ కార్ రైళ్లు, అమృత్ భారత్, నమో భారత్ రైళ్ల తయారీతో పాటు రికార్డు స్థాయిలో కొత్త వ్యాగన్లను చేర్చటం వంటివి వేగంగా జరుగుతున్నాయన్నారు.
రోడ్డు రవాణాతో పోలిస్తే రైలు రవాణా ద్వారా సుమారు 95 శాతం తక్కువగా కాలుష్యం జరుగుతుందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇది పర్యావరణం, వాతావరణం పట్ల ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉండటమే కాక, రైల్వేలను పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థగా మార్చాలన్న ప్రధానమంత్రి దార్శనికతను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
దేశాభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి, సమ్మిళిత అనుసంధానానికి భారత రైల్వే కీలక ఆధారమని కేంద్ర బడ్జెట్ 2026-27లో కేటాయించిన రికార్డు స్థాయి నిధులు తెలియజేశాయి. ఈ బడ్జెట్‌లో ప్రకటించిన కార్యక్రమాల ద్వారా వేగవంతమైన కనెక్టివిటీ, సమర్థవంతమైన లాజిస్టిక్స్, పటిష్ఠమైన మౌలిక సదుపాయాలను అందిస్తూ, వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశ నిర్మాణంలో భారత రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2222202)
సందర్శకుల సూచీ సంఖ్య : : 64