శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలో రూ. 32 కోట్ల విలువైన సీఎస్ఐఆర్-ఎన్ఐవో తీరప్రాంత-ఆధారిత ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్
ఇరవై ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్టు... రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం రావడంతో ఏడాదిలోనే పూర్తయింది
ఇది 'డబుల్ ఇంజిన్ ప్రభావం'కు నిదర్శనం
'బ్లూ ఎకానమీ'కి, నౌకా వాణిజ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యమిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
భారత నౌకా వాణిజ్య శాస్త్రం, ఇంధన భద్రత, వాతావరణ పరిస్థితులన్నింటినీ తట్టుకునే తీరప్రాంత సామర్థ్యాన్ని బలోపేతం చేయనున్న కొత్త సీఎస్ఐఆర్-ఎన్ఐఓ కేంద్రం
తీరప్రాంత ఇంధనం, విపత్తు నిర్వహణ, వాతావరణ అధ్యయనాల్లో విశాఖపట్నం సీఎస్ఐఆర్-ఎన్ఐఓ కేంద్రం పాత్ర కీలకం
చమురు, గ్యాస్, సముద్రగర్భ ఖనిజాల విషయంలో భారత స్వయం-సమృద్ధి బలోపేతానికి ఈస్టర్న్ కాంటినెంటల్ మార్జిన్ పరిశోధన: డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
30 JAN 2026 5:20PM by PIB Hyderabad
విశాఖపట్నంలోని సీఎస్ఐఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐవో) ప్రాంతీయ కేంద్ర తీరప్రాంత ఆధారిత ప్రయోగశాలను కేంద్ర శాస్త్ర, సాంకేతికత, భూ విజ్ఞాన శాస్త్ర శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిరంతర సమన్వయంతో అభివృద్ధిని వేగవంతం చేస్తున్న 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రభావానికి' ఇది స్పష్టమైన నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి శ్రీమతి అనితా వంగలపూడి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎం. శ్రీభరత్, ఎమ్మెల్యే శ్రీ జి. శ్రీనివాసరావు, సీఎస్ఐఆర్-ఎన్ఐవో డైరెక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ సింగ్, డాక్టర్ వి.వి.ఎస్.ఎస్. శర్మ, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కలైసెల్వి సమక్షంలో సభను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. ఈ ప్రాజెక్టుకు సంవత్సరాల కిందటే పునాది వేసినప్పటికీ ఇది ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సమన్వయంతో గడిచిన 8-10 నెలల్లోనే గణనీయమైన పురోగతితో ఈ ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2000వ దశకం ప్రారంభంలో నామమాత్రపు ధరకు భూమిని బదిలీ చేసిందని, అయితే ఆ ప్రాంతంలో వేగవంతమైన అభివృద్ధి కారణంగా దాని ప్రస్తుత విలువ అనేక రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సీఎస్ఐఆర్ తరపున, సీఎస్ఐఆర్ అధ్యక్షులు అయిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరపున భారత ప్రభుత్వం రూ. 32 కోట్లతో ఈ తీరప్రాంత ఆధారిత ప్రాంతీయ కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ కేంద్రం వ్యూహాత్మక ప్రాముఖ్యతను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధానంగా ప్రస్తావించారు. భారత్ దాదాపు 11,000–12,000 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని కలిగి ఉందనీ, ఇందులో 1,000 కిలోమీటర్లకు పైగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతమేనన్నారు. ఇది నౌకా వాణిజ్య ఆర్థిక వ్యవస్థకు, ప్రధాన మంత్రి బ్లూ ఎకానమీ దార్శనికతకూ సహజ కేంద్రంగా మారుతుందన్నారు. భారత తూర్పు తీర సరిహద్దు భౌగోళికంగా వైవిధ్యభరితంగా ఉందనీ... హైడ్రోకార్బన్‌లు, సముద్రగర్భ ఖనిజాలు, చమురు, సహజ వాయువు నిక్షేపాల గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దీనికి ప్రధాన కారణం హిమాలయ నదీ వ్యవస్థల నుంచి వచ్చిన భారీ అవక్షేపాలేనని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్నం తీరం అనేక రకాల సముద్ర వనరులకు కేంద్రంగా ఉందనీ... ఇది భారత ఇంధన భద్రతకు, బ్లూ ఎకానమీకి గణనీయంగా దోహదపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. కొత్తగా ప్రారంభించిన సీఎస్ఐఆర్-ఎన్ఐఓ ప్రాంతీయ కేంద్రం ఈ ప్రయత్నానికి శాస్త్రీయంగా కీలక ఆధారంగా పనిచేస్తుందని ఆయన అన్నారు.
సీఎస్ఐఆర్-ఎన్ఐవో ఇప్పటికే ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, ఇతర సంబంధిత సంస్థల సన్నిహిత సహకారంతో పనిచేస్తోందన్నారు. ఫార్మాస్యూటికల్స్, ఓడరేవులు, థర్మల్ పవర్ ప్రాజెక్టులు, మత్స్య సంపద వంటి రంగాలకు ఇది చురుగ్గా మద్దతునిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధానంగా ప్రస్తావించారు. సముద్ర జీవ వనరులను వైద్యం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నందున సంభావ్య ఫిషింగ్ జోన్‌లను గుర్తించడం, మత్స్యకారుల కోసం సముద్రపు నాచు పెంపకం, హానికరమైన ఆల్గల్ బ్లూమ్‌లను అంచనా వేయడం కోసం కేంద్రం చేస్తున్న కృషి జీవనోపాధికి, ప్రజారోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి వివరించారు.
ప్రభుత్వ సమగ్ర విధానాన్ని స్పష్టం చేస్తూ... భారత నౌకా వాణిజ్య అభివృద్ధి ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ- ప్రైవేట్ రంగాలు, పరిశోధనా సంస్థలు, అంకుర సంస్థలను ఏకతాటిపైకి తీసుకువస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. నౌకా వాణిజ్యం, తీరప్రాంత రంగాల అంకురసంస్థలు, ఆవిష్కర్తల కోసం సాంకేతికత, ఆర్థిక సహాయంతో కూడిన పటిష్ఠ వ్యవస్థ ఇప్పటికే అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిలో క్రియాశీల భాగస్వాములు కావాలని ఆయన పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
విశాఖపట్నం కేంద్రం విస్తరిస్తున్న భారత భారత నౌకా వాణిజ్య రంగం కోసం యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అంకురసంస్థలు, భవిష్యత్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ... సామర్థ్యాలను పెంపొందించడం, నైపుణ్య శిక్షణ కోసం ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు కృషిని ప్రత్యేకంగా ప్రశంసించిన కేంద్ర మంత్రి... ఆయన వ్యక్తిగత జోక్యం కారణంగా దాదాపు దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న తీరప్రాంత, పర్యావరణ అనుమతులు ఆరు నెలల్లోనే మంజూరయ్యాయన్నారు. దీనివల్ల ప్రాజెక్టు అమలులో ఒక్క రోజు కూడా ఆలస్యం జరగలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు తీరప్రాంతంలో ఉన్నందున దానికి అనేక అనుమతులు అవసరమయ్యాయనీ, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమర్థ సమన్వయం ద్వారా వాటన్నింటినీ వేగంగా సాధించామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు రాష్ట్ర నూతన రాజధాని అమరావతిపైనా ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. త్వరలోనే అక్కడ క్వాంటం టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గత 7-8 నెలల్లో విశాఖపట్నంలో తాను పర్యటించడం ఇది మూడోసారి అని... ఇది విజ్ఞానశాస్త్ర ఆధారిత అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ క్రియాశీల భాగస్వామ్యానికి ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
రుషికొండలోని యెండడ గ్రామంలో 4 ఎకరాల క్యాంపస్‌ను 3.25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు (జీ+1)తో 4,550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ తీరప్రాంత ఆధారిత ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టును సీపీడబ్ల్యూడీ సంస్థ చేపట్టింది. దీని నిర్మాణం 2024, నవంబరు నెలలో ప్రారంభమై, 2025, డిసెంబరులో పూర్తయింది.




***
(रिलीज़ आईडी: 2221050)
आगंतुक पटल : 7